ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలలోని అత్యధిక ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ విభజన జరుగుతుందని వారు ఆరోపించారు. అందువల్లే బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విభజనకు ఎలాంటి ప్రాతిపదిక లేదన్నారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా విభజన జరుగుతోందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ నుంచి తీర్మానం లేకుండానే విభజన జరుగుతోందని అంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా విభజన ఉందన్నారు.
రాష్ట్ర విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదించిన సిఫార్సులను కేంద్రం తుంగలోకి తొక్కిందని, ఆ సిఫార్సులను కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 371 (డీ)కి విరుద్ధంగా విభజన ఉందన్నారు. తమ లిఖితపూర్వక అభిప్రాయాలను రికార్డులో నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం లేఖ రాశారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద శుక్రవారం స్పీకర్కు రాసిన లేఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విడుదల చేశారు.