వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిందని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలని కోరుకుంటున్న జగన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే కేంద్రం యోచనలో భాగమే రాష్ట్ర విభజన అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్లీనరీ సమావేశంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటే తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్ సీపీ 60 నుంచి 70 స్థానాలలో విజయం సాధిస్తుందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ విభజనకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. వైఎస్ జగన్ త్వరలో తెలంగాణ ప్రాంతంలో కూడా పర్యటిస్తారని మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజమోహన్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు.ఆ మహానేత మరణంతో ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నింటికి ఆ తర్వాత వచ్చిన సీఎం కూర్చి చేపట్టిన వారు కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలన మళ్లీ వైఎస్ జగన్తో సాధ్యమని రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు.