ర్యాలీ నిర్వహిస్తున్న ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి
మర్రిపాడు, న్యూస్‌లైన్ : అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాల కోసం విభజించిన కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. మర్రిపాడులో శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే పలు సర్వేలు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుందని చెబుతున్నాయన్నారు.
తొమ్మిదేళ్లుగా సీఎంగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోలేదని, మళ్లీ తనకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియాగా చేస్తాననడం ప్రజలను మరోసారి మోసం చేయడానికేనన్నారు. సోనియాగాంధీ రాష్ట్రంపై కక్ష గట్టి విభజించారన్నారు. యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారన్నారన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్ హయాంలో రాష్ట్రాన్ని ఏనాడు విభజించాలనుకోలేదని, నేడు స్వార్థ రాజకీయాలతో రాష్ట్రాన్ని విభజించాలనుకోవటం దుర్మార్గమన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారన్నారు.
నీల్సన్- ఎన్‌టీవీ సర్వేలో 2 లక్షల మంది అభిప్రాయాలు తెలుసుకుని సర్వే చేసి 130 స్థానాలు వస్తాయని నిర్ధారించారన్నారు. అయితే సీఎన్‌ఎన్ సంస్థ కేవలం 1,300 మందితోనే సర్వే చేసి ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి సర్వేలు చేస్తున్నాయన్నారు. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ టీడీపీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగల్భాలు పలికారన్నారు. జనమంతా జగన్ వెంటే ఉన్నారని కేంద్రంలో కూడా జగన్‌మోహన్ రెడ్డే చక్రం తిప్పుతారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి వంద రోజుల్లో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని కితాబిచ్చారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు మేకపాటి కుటుంబం వరప్రసాదం అన్నారు. యువనేత గౌతమ్‌రెడ్డి జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో దృష్టి సారించడం అభినందనీయమన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావటం తథ్యమన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఆయన విజయాన్ని ఆపలేరన్నారు.;
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మండలంలోని 12 ఎంపీటీసీ సెగ్మెంట్‌లతో పాటు జెడ్పీటీసీ స్థానాన్ని సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. పాదయాత్రలో ఎన్నో సమస్యలను చూశానని, సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, సురేం ద్రనాథ్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు పెనగలూరి వెంకటేష్, జెడ్పీటీసీ అభ్యర్థిని చంద్రకళ, పడమటినాయుడుపల్లి ఎంపీటీసీ అభ్యర్థి రమణయ్య, పార్టీ నాయకులు రాములు నాయుడు, శ్రీనివాసులునాయుడు, అంబటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.