నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ హవా
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. మొత్తం 10 నియోజకవర్గాల్లో ఏడు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే నెల్లూరు ఎంపీ సీటును కూడా వైఎస్ఆర్సీపీ తన ఖాతలో జమ చేసుకుంది. టీడీపీ మూడు స్థానాలు గెలుచుకుంది.
*కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడుగా పని చేసిన ఆయన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
*ఆత్మకూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతం రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి, మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డిపై గెలుపొందారు.
* కోవూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు.
* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీని తన ఖాతాలో వేసుకుంది. ఆపార్టీ అభ్యర్థి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. 2009లో నెల్లూరు నగరం నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో బరిలోకి దిగిన ఆనిల్ కుమార్ యాదవ్‌కు స్థానికంగా ఆనం బ్రదర్స్ ఆశీస్సులు లేకపోవడంతో విజయానికి ఆమడ దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్ కాంగ్రెస్‌ని విడచిపెట్టడంతో అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ జగన్ వెంట నడిచారు. నెల్లూరు నగరంలో పాతుకుపోయిన అనీల్ కుమార్ యాదవ్‌కు ప్రజలు పట్టం కట్టారు.
* నెల్లూరు రూరల్ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి విజయ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు.
*సర్వేపల్లి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాని గోవర్థన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థి, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై గెలుపొందారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి అడాల ప్రభాకరరెడ్డి చేతిలో చంద్రమోహన్ రెడ్డిపై 10000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
*నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.సునీల్ కుమార్ గెలుపొందారు. సునీల్ కుమార్ చేతిలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య ఓటమి పాలయ్యారు.
*సూళ్లూరుపేటను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఆపార్టీ అభ్యర్థి కె.సంజీవయ్య తన సమీప ప్రత్యర్థిపై పరసా వెంకటరత్నంపై విజయం సాధించారు.
*వెంకటగిరిని టీడీపీ సొంతం చేసుకుంది. ఆపార్టీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గెలుపొందారు.
*ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. ఆపార్టీ బొల్లినేని రామారావు గెలుపొందారు.