వైఎస్సార్‌సీపీ ఉద్యమంతోనే.. | YSRCP Former MPs Fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఉద్యమంతోనే..

Published Sat, Jul 21 2018 3:08 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

YSRCP Former MPs Fires on CM Chandrababu  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సాక్షిగా టీడీపీ బీజేపీ బంధం మరోసారి బట్టబయలైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజా మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానం చర్చలో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ ఎన్‌డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని వెల్లడించిన అంశం, టీడీపీ వ్యవహరించిన తీరుపై వీరు స్పందించారు. ప్రత్యేక హోదా సంజీవనా అని ఎగతాళి చేసిన చంద్రబాబు.. హోదా కోసం వైఎస్సార్‌ సీపీ చేస్తున్న ఉద్యమం చూసి యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చిందని మాజీఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మేం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని మద్దతు కోరితే అవిశ్వాసంతో ఏమొస్తుందని అన్నారని.. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టినా  ఏం సాధించలేకపోయారని తెలిపారు.

ప్రజలను మభ్య పెట్టడంలో భాగంగానే టీడీపీ అవిశ్వాస డ్రామా ఆడిందన్నారు. రాజ్‌నాథ్‌ స్టేట్‌మెంట్‌పై టీడీపీ ఎంపీలు కనీసం నిరసన  తెలపలేదని విమర్శించారు. బీజేపీతో బంధం కొనసాగుతోంది కాబట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లలేదని తెలిపారు. అవిశ్వాసంపై లోపాయికారిగా ముందే మాట్లాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేశినేని నాని చివర్లో హోదా కోసం గట్టిగా నిలదీయకుండా, హామీలపై వాదించకుండా వ్యక్తిగత విమర్శలకే సరిపెట్టారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకను అనర్హురాలిగా ప్రకటించాలని అడిగితే.. ఆమెకు  మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని, ఇప్పటికీ టీడీపీ,బీజేపీ కలిసి ఉన్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. 

లోపాయికారి ఒప్పందంతోనే..
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో చిత్తశుద్ధితో నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, కడప స్టీల్‌ ప్లాంటు, పోర్టుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామని మాజీఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  బడ్జెట్‌ సమావేశాల్లోనే ఒత్తిడి పెంచాలని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని మేం 13 సార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చినా స్పీకర్‌ అనుమతించలేదన్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా  తమ పదవులకు రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేశామని తెలిపారు.

అయితే ఇప్పుడు తొలిరోజే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చారని.. దీంతో వారి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం అర్థమవుతోందన్నారు.  బయట కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని..లోపల బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకున్నారని ప్రధాని స్పష్టం చేశారని.. ఇప్పుడు, ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లి హోదా వచ్చేవరకు పోరాడుతామని సుబ్బారెడ్డి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement