మీడియాతో ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, గన్నవరం: ఏపీకి ప్రత్యేక హోదా మా ఊపిరి అని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ ఆమరణ దీక్ష చేసిన ఎంపీలు కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇవ్వనందుకే లోక్‌సభ సభ్యత్వాలకు (ఎంపీ పదవులకు) రాజీనామాలు చేశామన్నారు. అనంతరం ముందుగా చెప్పినట్లుగానే మా పోరాటంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాం. బలవంతంగా మా ఎంపీల దీక్షను భగ్నం చేశారు. ప్రత్యేక హోదా సాధించేవరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ విషయాన్నే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర వద్దకు మరికాసేపట్లో చేరుకోనున్నారు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. ‘ఈ ద్రోహంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్నారు. ఇలాంటి ద్రోహం చేసిన వ్యక్తులను క్షమించకూడదు. ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చుకుంటున్నాం. 2019లో రాజకీయ సమీకరణాలు మారతాయి. మనకు ఇచ్చిన హామీలను ఎవరు నెరవేరుస్తారో వారికే మద్దతిస్తామని’ వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి స్పష్టం చేశారు.
హోదా కోసం ఉధృతంగా పోరాటం చేశామని, అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం నోటీసులు కూడా ఇచ్చామన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి. ‘హోదా ఇవ్వకపోవడంతో రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశాం. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించడానికి మా పోరాటం కొనసాగిస్తామని’ వైఎస్ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేశామని ఎంపీ వరప్రసాద్ అన్నారు. హోదా సాధన కోసం ఏం చేయాలో మా వైపు నుంచి అన్ని చేశాం. హోదా సాధించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. ఏపీ అభివృద్ధి కోసం మాతో రాజీనామా చేయించిన వైఎస్ జగన్‌కు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నామని చెప్పారు.
‘ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగిస్తాం. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలుస్తాం. చంద్రబాబు నాలుగేళ్లు వృథాచేసి.. ఇప్పుడు అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని’ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment