పది సీట్ల కోసం విభజిస్తారా!
Published Wed, Jan 8 2014 2:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
చింతలపూడి, న్యూస్‌లైన్ : తెలంగాణలో పది సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజన నాటకాలాడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన చింతలపూడి మండల వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు రద్దు చేసి, కొత్త రుణాలు ఇస్తామని వాగ్దానాలు చేస్తున్నారని.. అసలు ఏనాడైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. ఎన్నికలు ఎప్పడు వస్తాయా ఎప్పుడు కాంగ్రెస్‌ను సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సమైక్య రాష్ట్రం సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 30 పార్లమెంట్ స్థానాలను గెలిపిస్తే కేంద్రాన్ని శాసించే అవకాశం వైసీపీకి వస్తుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే సమైక్య వాదాన్ని వినిపిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి కాంగ్రెస్, టీడీపీలు కొట్టుకు పోతాయన్నారు. మరో సమన్వయకర్త డా కర్రారాజారావు మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే కల్లబొల్లి వాగ్దానాలను నమ్మ వద్దని అన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పార్టీ పెట్టిన జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. పార్టీ మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు, ముఖ్య నాయకులు ప్రసంగించారు. అనంతరం వైసీపీ తరుపున గెలుపొందిన సర్పంచ్‌లు, సొసైటీ అధ్యక్షులను తోట చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు. చింతలపూడిలో గడపగడపకు వైసీపీ సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఘన స్వాగతం
లింగపాలెం : వైసీపీ నేత తోట చంద్రశేఖర్ తొలిసారిగా లింగపాలెం మండలానికి రావటంతో నియోజకవర్గ సమన్వయకర్తలు మద్దాల రాజేష్‌కుమార్, కర్రా రాజారావు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో మఠగూడెంకు తరలివచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇటీవల అస్వస్థకు గురైన వైసీపీ జిల్లా సీనియర్ నాయకుడు మందలపు సత్యనారాయణను చంద్రశేఖర్ పరామర్శించి, ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం మోటార్‌సైకిళ్లపై పార్టీ శ్రేణులతో ర్యాలీగా చింతలపూడి చేరుకున్నారు.
Advertisement
Advertisement