ఓట్లు డౌటే...! నోట్లు ఖాయం...!!
Published Mon, Jan 6 2014 1:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
విభజన బిల్లు అసెంబ్లీకొచ్చిన నేపథ్యంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లోని నేతల్లో రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎటు వెళ్లాలి? అని తేల్చుకోలేక కొందరు నేతలు సతమతమవుతున్నారు. తాజా పరిణామాల్లో కాంగ్రెస్ సీమాంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందట. తెలుగుదేశం పని కూడా ఖతమైందట. వైఎస్సార్ సీపీలోనేమో ఖాళీ లేదంటున్నారు. మరేం చేయాలి...? కొద్దిరోజులుగా ఈరకంగా తర్జనభర్జన పడుతున్న ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యేకు తన సన్నిహితుడైన మరో నేత కొత్త ఆఫర్ గురించి చెప్పారు. మన ముఖ్యమంత్రిగారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు! (ఆయన అప్పుడే సీఎంను కలసి బయటకొచ్చారు) అందులో చేరిపోరాదా అంటూ సలహా ఇచ్చారట.
‘ఆఖరు రోజు వరకు అధికారంలో ఉండి ఆ తర్వాత తానేదో పొడిచినట్టు కొత్త పార్టీ పెడితే దానికి ఫ్యూచర్ ఉండదు..’ అని ఎమ్మెల్యే విశ్లేషించారు. అయితే కొత్త పార్టీలో చేరితే ఓట్లు రాకపోయినా కొన్ని కోట్లయినా మిగులుతాయనడంతో ఆ ఎమ్మెల్యే అదేంటని మరింత ఆసక్తిని ప్రదర్శించారు. ‘కొత్త పార్టీ పెట్టే నాయకుడు నియోజకవర్గానికి ఐదు కోట్లిస్తారట. దానికి తోడు ఆ పార్టీ ఏర్పాటుకు తెరవెనుక వ్యవహారాలు చూస్తున్న ఒక ఎంపీ కూడా ఎన్నికల కోసం రూ.250 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారట.
కొందరికి ఇప్పటికే అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు... కొత్త పార్టీకోసం ఇప్పటికే కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, టీ షర్టులు... ఒకటేమిటి లెక్కలేనంత ప్రచార సామగ్రి కూడా సిద్ధం చేశార’ని చెప్పారు. ‘ఇలా టికెట్ ఖాయం చేయడంతోపాటు అవన్నీ మీ ఇంటికొచ్చేస్తాయి..!’ అని కొత్త పార్టీ కథా కమామిషు చెప్పేశారు. ‘అవునా...! ఇదేదో బాగుందే...!! అయితే నేను రెడీ...!!!’ అనుకుంటూ హత్తుకున్నాడట ఆ ఎమ్మెల్యే.
Advertisement