CWC resolution
-
తెలంగాణ ఇస్తే సంబరం.. లేకుంటే సమరమే.. : సుష్మాస్వరాజ్
తెలంగాణ ప్రజాగర్జన సభలో సుష్మాస్వరాజ్ తెలంగాణపై మడమ తిప్పం, మాట తప్పం ప్రకటించి రెండు నెలలైనా అడుగు ముందుకు పడలేదేం? కాంగ్రెస్ తీరు అనుమానాస్పదంగా ఉంది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలి తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర సమస్యలపై దృష్టి తెలుగులో ప్రారంభం, హిందీలో కొనసాగిన ప్రసంగం (మహబూబ్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): తెలంగాణ ఇస్తే సంబరం, ఇవ్వకుంటే సమరమేనని బీజేపీ స్పష్టం చేసింది. రాజకీయ పొత్తులున్నా లేకున్నా తెలంగాణపై మాట తప్పం, మడమ తిప్పమని తెగేసి చెప్పింది. తెలంగాణ ప్రజా గర్జన పేరిట మహబూబ్‌నగర్‌లో బీజేపీ శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ప్రధాన వక్తగా హాజరయ్యారు. అనుకున్న సమయానికి గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన సభలో ఆమె తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి హిందీలో కొనసాగించారు. తెలంగాణ కోసం అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించారు. అందర్నీ ఏకం చేసి ఐక్యపోరాటాన్ని నడిపిస్తున్న కోదండరాంకు అభినందనలు తెలిపారు. జై తెలంగాణ, జై సీమాంధ్ర అని సభికులతో నినాదాలు చేయించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. రతంగ్ పాండురెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ... సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత పార్లమెంటులో చర్చల సందర్భంగా తమ పార్టీ నేతలు చేసిన ప్రసంగాలపై వచ్చిన ఊహాగానాలను తోసిపుచ్చారు. తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. ‘‘ఒకవైపు సంతోషం, మరోవైపు విజయం సిద్ధిస్తుందన్న నమ్మకం ఉన్నా... మనసులో ఏదో మూల సందేహం కూడా ఉంది. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రకటన చేసి కొన్ని రోజుల తర్వాత వెనక్కు తీసుకున్నారు. జూలై 30న సీడబ్ల్యుసీ తెలంగాణపై ప్రకటన చేసింది. ఇప్పటికి రెండు నెలలు కావస్తున్నా ఎటువంటి ముందడుగు పడకపోవడమే ఈ సందేహానికి కారణం. రెండుమూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి మధ్య పొంతన ఉండడం లేదు. శిక్ష పడిన వారిని చట్టసభలకు దూరంగా ఉంచాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ వ్యవహారంలోనూ ప్రధాని ఓ విధంగా, రాహుల్ గాంధీ ఓ విధంగా స్పందించారు. అందుకే నా అనుమానం. ఈసారి కాంగ్రెస్ మోసం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరు. వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారు. నవంబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత అంటే డిసెంబర్లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రెండు రెండు నెలల సమయం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని సీడబ్ల్యుసీ ప్రకటించినట్టుగా హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణను శీతాకాల సమావేశాల్లో పెట్టాలి. అలా పెడితే బీజేపీ భేషరతుగా మద్దతు ఇస్తుంది. మేము గతంలో మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు అందర్నీ సంప్రదించి ఇచ్చాం. కానీ ఈరోజు విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది... ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తారు... ఎంపీలు పార్లమెంటును స్తంభింపజేస్తారు... గాంధీ విగ్రహం ముందు ప్రదర్శనలు నిర్వహిస్తారు... ఎందుకిలా జరుగుతుంది?’’ అని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి తెలంగాణ కల సాకారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ స్వప్నం నెరవేరిన తర్వాత సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. అదే సమయంలో విజయం సాధించిన వారు సంయమనం పాటించాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లను తరిమేస్తామని, ఉండనివ్వబోమని చెప్పడం వల్ల నష్టం జరుగుతుందని సూచించారు. తాము కోరుకుంటున్నది ప్రాంతాల విభజనే తప్ప ప్రజల మధ్య కాదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో తమ పార్టీ, కోదండరాంతో కలిసి సంఘటితంగా కృషి చేస్తుందని ఆమె చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో తమ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్‌ను కలిసిన దానికి రాజకీయ ప్రాధాన్యత లేదని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల కూటమి, భవిష్యత్ పొత్తుల ప్రస్తావన ఈ భేటీలో రానే రాలేదని తెలిపారు. పొత్తులున్నా, లేకున్నా తెలంగాణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను కల్పిస్తుందన్నారు. కృష్ణ, గోదావరి నదుల్ని అనుసంధానం చేస్తుందని హామీ ఇచ్చారు. పాలమూరు గత వైభవానికి చిహ్నంగా తిరిగి ఈ ప్రాంతం పాలు, మీగడలతో తూలతూగేలా చేస్తామన్నారు. ‘‘అభివృద్ధి కోసమే తెలంగాణకు మద్దతిస్తున్నాం. రెండు నెలల సమయంలో తెలంగాణ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ శీతాకాల సమావేశాల్లో పెట్టి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి. అదే జరిగితే విజయోత్సాహాల్లో పాల్గొనేందుకు వస్తా. లేకుంటే తిరిగి ఉద్యమం రెండో అధ్యాయాన్ని ప్రారంభించేందుకు వస్తా. కోదండరాం సిద్ధంగా ఉండాలి’’ అని సుష్మా స్వరాజ్ తన ప్రసంగాన్ని ముగించారు. సీమాంధ్రలో నాయకత్వ పోరు : కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం నాయకత్వ పోరులో భాగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, బొత్స సత్యనారాయణ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సీమాంధ్రలో నాయకత్వానికి పోటీపడుతూ ఉద్యమాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎంగా కొనసాగే హక్కు లేదని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతేనని చెప్పారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణకు అడ్డం పడుతున్న ముఖ్యమంత్రి మీద, బిల్లు పెట్టడంలో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద గర్జించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇస్తే వచ్చేవి మూడు సమస్యలేనని, ఇవ్వకపోతే 30 వస్తాయని చెప్పారు. ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, సాధించిన విజయాలను చూసి గర్వించాలని సూచించారు. ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని తరిమికొట్టే రోజు వచ్చిందని సీహెచ్ విద్యాసాగరరావు చెప్పారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి, మరికొందరు సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని మాజీమంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి తప్పుబటా ్టరు. వచ్చే సెప్టెంబర్ 17న తెలంగాణ సచివాలయం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఇప్పుడెందుకు చెప్పినట్టు ?
నోట్ సిద్ధమయ్యాక నోరు విప్పడంలో ఆంతర్యమేంటి? సీఎం కిరణ్ వ్యాఖ్యలపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో అనుమానాలు ముందే చెబితే ‘డిసెంబర్ 23’ పునరావృతమయ్యేదని వ్యాఖ్య సీడబ్ల్యూసీ నిర్ణయం జరిగిన రెండు నెలలకు సందేహాలా? నిర్ణయం ముందే తెలిసినప్పుడు నిమ్మకు నీరెత్తిన సీఎం తుది ఘట్టంలో సమస్యల ఏకరువు ఎందుకు? అంతా అధిష్టానం డెరైక్షన్లోనే జరుగుతోందా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేసిన 60 రోజుల తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్టుండి శుక్రవారం మీడియా ముందుకొచ్చి సుదీర్ఘంగా పెదవి విప్పడంపై కాంగ్రెస్ నేతల్లో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం పార్టీ నేతలను బుజ్జగిస్తూ వచ్చిన కిరణ్, తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్ నోట్ ముసాయిదా సిద్ధమై త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ముందుకు రానున్న తరుణంలో... ‘సమస్యలున్నాయి’ అంటూ ఏకరువు పెట్టడంలో ఆంతర్యమేంటన్న దానిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయించే బాధ్యతను కిరణ్ నెత్తికెత్తుకున్నారని, పార్టీ అధిష్టానం వ్యూహంలో భాగంగానే తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. తెలంగాణపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని గత జూన్ నుంచీ అధిష్టానం పెద్దలు చెబుతూనే వస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా జూలై 30న యూపీఏ, సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఇంత ప్రక్రియ నడిచినా, విభజనతో సమస్యలు తలెత్తుతాయని ఎప్పుడూ చెప్పని కిరణ్, తాజాగా ఇలా తెర ముందుకు రావడం వెనుక పెద్ద మతలబే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ విభజన ప్రక్రియ పూర్తయ్యేదాకా సీఎంగా కొనసాగాల్సిందేనని ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు అధిష్టానం పెద్దలు ఆదేశించగా సరేనని తిరిగొచ్చిన కిరణ్ తాజా వ్యాఖ్యల వెనుక కూడా పెద్దల ఆదేశాలే ఉన్నాయంటున్నారు. ఇప్పుడు చెప్పిన విషయాలనే కోర్‌కమిటీ ముందు హాజరైనప్పుడు గానీ, సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడు గానీ కిరణ్ బహిరంగంగా చెప్పి ఉంటే నేడు సీమాంధ్రలో ఉద్యమం చేయాల్సిన అవసరమే ఉండేది కాదంటున్నారు. కనీసం కోర్‌కమిటీ భేటీకి ముందుగానీ, భేటీలోగానీ ఇదే వాదనను ఆయనెందుకు గట్టిగా వినిపించలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేనంటున్నారు. రాష్ట్ర విభజన దిశగా 2009 డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేసినప్పుడు కిరణ్ అసెం బ్లీ స్పీకర్‌గా ఉన్నారని, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు సమర్పించడంతో కేంద్రం ఒక్కసారిగా వెనక్కు తగ్గుతూ డిసెంబర్ 23న మరో ప్రకటన చేసిందని నేతలు గుర్తుచేస్తున్నారు. కిరణ్ది నిజంగా సమైక్యవాదమే అయితే ఇన్ని రోజులపాటు ఎందుకు మౌనం దాల్చారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై రోడ్‌మ్యాప్‌లు సిద్ధం చేయాలని దిగ్విజయ్‌సింగ్ ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితుడయ్యాక తొలిసారి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కిరణ్‌తో పాటు డిప్యూటీ సీఎం దామోదర, పీసీసీ చీఫ్ బొత్సలను ఆదేశించారు. అంతేగాక దానిపై పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా నేతలంతా కట్టుబడి ఉండాలని చెప్పారు. వారు ముగ్గురూ అందుకు సరేనన్నారు. తర్వాత జూలై 12న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర హోం శాఖ కార్యాచరణ ప్రణాళికను అందజేసింది. అంతేగాక తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని కూడా సంకేతాలిచ్చారు. అప్పటి నుంచి సీడబ్ల్యూసీ తీర్మానం దాకా కిరణ్ మూడు దఫాలు ఢిల్లీ వెళ్లారు. సోనియాతోపాటు రాహుల్‌నూ రెండుసార్లు కలిశారు. మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, చిదంబరం, దిగ్విజయ్‌సింగ్ వంటి పార్టీ పెద్దలతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. వాటన్నిం ట్లోనూ కిరణ్‌కు వారు చెప్పిన మాటల సారాంశం ఒక్కటే... తెలంగాణకు నిర్ణయం జరిగిపోయిందనే! అయినా ఏ రోజూ కిరణ్ తన వైఖరేంటో బహిరంగంగా చెప్పలేదు. పైగా విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలకు సిద్ధపడ్డ సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కూడా, ‘ఇంకా నిర్ణయం కాలేదు, తొందరపడొద్దు’ అని వారిస్తూ వచ్చారు. అలాగాక అధిష్టానం నిర్ణయం కిరణ్‌కు తెలియగానే దాన్ని రాష్ట్ర నేతలకు చేరవేస్తే అంతా మూకుమ్మడిగా పార్టీపై ఒత్తిడి తెచ్చేవారమని, లేదంటే అందరమూ రాజీనామా చేసి సంక్షోభం సృష్టిస్తే అసలు విభజన నిర్ణయమే జరిగేది కాదని సీమాంధ్ర నేతలు వాపోతున్నారు. అలాగాక ఉన్నట్టుండి, ‘సమస్యలు’ అంటూ కిరణ్ ఈ రోజు కొత్తగా మాట్లాడుతుండటం వింతగా ఉందని సీమాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరన్నారు. ‘‘గత 50 రోజులుగా సీమాంధ్రలో తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతున్నా సీఎం హోదాలో కిరణ్ స్పందించను కూడా లేదు. రాష్ట్రం అతలాకుతలమవుతున్నా కనీసం క్యాంపు ఆఫీసు నుంచి బయటకు రాలేదు’’ అని గుర్తు చేశారు. సమైక్యోద్యమాన్ని పక్కదారి పట్టించడానికో, అధిష్టానం ఆదేశాల మేరకో కిరణ్ ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేస్తున్నట్టు గతంలో ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగా వార్తలు రాగా తీవ్రంగా ఖండించడం తెలిసిందే. పైగా అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు! -
రాజీనామాల్లేవ్!
* రాజీనామా డిమాండ్ మీడియా సృష్టే.. సీమాంధ్ర కేంద్రమంత్రుల అసహనం * పదవుల నుంచి వైదొలగమని ప్రజలెవరూ అడగడం లేదు.. * ఎప్పుడు ఏం చేయాలనే తెలివితేటలు మాకున్నాయి * మా ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చింది.. త్వరలో మంత్రుల కమిటీ వేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు * సమైక్యంగా ఉంచాలని సోనియా, రాహుల్‌గాంధీలను కోరతాం * హైకమాండ్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది * పరిణామాలను చూస్తే విభజన ప్రక్రియ ఆగినట్లే కనిపిస్తోంది * హైదరాబాద్‌లో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల భేటీ ‘‘సీమాంధ్ర మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాలని, ఎంపీలు రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారని మీడియా కాకమ్మ కథలు అల్లుతోంది. ప్రజాభిప్రాయుంపై మీడియా స్పందించటం లేదు. ప్రజల పేరుతో, మీడియానే స్పందిస్తోంది.’’ - కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ‘‘మేం రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారు? పేర్లు చెప్పండి? రాజీనామా ఎవరూ అడగటం లేదు. ఇదంతా మీడియా సృష్టి. చానళ్లు, పత్రికల మధ్యనున్న పోటీ, ఇతర కారణాలవల్లే ఇదంతా జరుగుతోంది.’’ - మరో కేంద్రమంత్రి జె.డి.శీలం ‘‘కావూరి సాంబశివరావు మాటపైనే మేమంతా నిలబడ్డాం. అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటాం తప్ప మాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజల ఆందోళన, ఆకాంక్షల ముందు మా పదవులు చాలా చిన్నవి. ఏదో ఒక కారణంతో పదవులను చంకలో పెట్టుకుని తిరిగే గాడిదలు ఎవరూ లేరిక్కడ.’’ - టీటీడీ చైర్మన్ బాపిరాజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడ్డారంటూ జరిగిన ప్రచారమంతా వట్టిదేనని తేలింది. సీమాంధ్ర కేంద్రమంత్రులు శనివారం హైదరాబాద్‌లో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. రాజీనామాలు చేసే ఉద్దేశమే వారికి లేదని తేటతెల్లమవుతోంది. తమ రాజీనామాల డిమాండ్ అనేది మీడియా సృష్టేనంటూ వారంతా కొట్టిపారేశారు. తమను ఎవరూ రాజీనామాలు అడగటం లేదన్నారు. సీడబ్ల్యూసీ విభజన నిర్ణయంపై తమ ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చిందని చెప్పారు. ఆ కమిటీ సీమాంధ్రలో పర్యటించి ప్రజల ఆందోళనలు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారు. ఢిల్లీలో తాజా పరిస్థితులను చూస్తే విభజన నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సహా మొత్తం 16 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ అయ్యూరు. ఢిల్లీ పరిణామాలు, సమైక్యాంధ్ర ఉద్యవుం, రాజీనామాలు, భవిష్యత్ కార్యాచరణపై రెండు గంటలకుపైగా చర్చించారు. ఆ తర్వాత కేంద్రవుంత్రి కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. రాజీనామాలపై ప్రజల ఒత్తిళ్ల గురించి, విలేకరులు ప్రస్తావించగా ఆయున అసహనం వ్యక్తంచేశారు. రాజీనామాల డిమాండ్ మీడియా సొంత అభిప్రాయమేనని.. ప్రజా స్పందనను మీడియా పేర్కొనటం లేదని తప్పుపట్టారు. తాము ఏ త్యాగాలకైనా సిద్ధవుని, ఎప్పుడు ఏం చేయాల నే తెలివితేటలు, సమర్ధత తమకున్నాయన్నారు. పార్టీ మా సర్వస్వం.. ప్రజలే ముఖ్యం... టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆనాడు ఇంకా దీక్ష కొనసాగిస్తే చనిపోతారనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం విభజన ప్రకటన చేసిందని, కేసీఆర్ దీక్ష నటనేనని తాము చెప్పినా కేంద్రం వినలేదని కావూరి వ్యాఖ్యానించారు. అప్పట్లో కేంద్రం ప్రకటనతో సీమాంధ్రలో తలెత్తిన ప్రజాందోళన, ప్రజాప్రతినిధుల రాజీనామాలతో డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ క్షేత్రస్థారుు అధ్యయనంతో ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమన్నారు. దీనిపై తాము ఒత్తిడి తేవటం వల్లే ఆంటోనీ కమిటీ వచ్చిందని.. మంత్రుల కమిటీ ఏర్పాటుకు ప్రధాని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను పట్టింటుకోకుండా పదవులను అంటిపెట్టుకోవాలన్న ఆశ తమకు లేదన్నారు. తామంతా మళ్లీ ఢిల్లీ వెళ్తావుని, రాష్ట్రంలో పర్యటించి, సీమాంధ్ర ఆందోళనలను చూసి నిర్ణయం తీసుకోవాలని ఆంటోనీ కమిటీకి చెప్తామని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్నాం. పార్టీయే వూకు సర్వస్వం. పార్టీ కంటే ప్రజలే ముఖ్యం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం తప్ప మరేదీ సమ్మతం కాదని సోనియూగాంధీ, రాహుల్‌గాంధీలకు చెప్తాం’’ అని తెలిపారు. రాజీనామా చేస్తామంటే పెద్దలు వద్దన్నారు... హైకమాండ్ పెద్దలకు వాస్తవాలు తెలిసి వస్తున్నాయని, వారిలో మార్పు వస్తుందని మరో కేంద్రమంత్రి చిరంజీవి పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిని గురించి ఆంటోనీ కమిటీతోనే హైకమాండ్‌కు చెప్పిస్తామన్నారు. ఎంపీలు ఇప్పటికే రాజీనామా చేశారని, తాము కూడా రాజీనామా చేస్తామంటే హైకమాండ్ పెద్దలు వద్దన్నారని మరో మంత్రి పురందేశ్వరి పేర్కొన్నారు. విభజన ఆగుతుందనుకుంటే రాజీనావూలకు సిద్ధమేనన్నారు. రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారంటూ వుంత్రి శీలం మీడియాను ఎదురు ప్రశ్నించారు. పదవుల్లో ఉంటే, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతోపాటు ప్రభుత్వంలో జరిగేది తెలుసుకోవచ్చన్నారు. సోనియా, రాహుల్ అపాయింట్మెంట్ కోసం మంత్రి పళ్లంరాజు ప్రయత్నిస్తున్నారని టీటీడీ చైర్మన కనుమూరి బాపిరాజు చెప్పారు. రాజీనామాలపై సమష్టి నిర్ణయం తీసుకుంటామని, కావూరి మాటపైనే తావుు నిలబడ్డామని పేర్కొన్నారు. ఏకాభిప్రాయంలేని విభజన నిర్ణయంతో దేశం అల్లకల్లోలం అవుతోందని, ప్రస్తుత పరిణామాలను చూస్తే, విభజన ప్రక్రియ ఆగినట్టే కనిపిస్తోందని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. విభజన ఆగినట్టేనని, కేంద్రం పునరాలోచనలో పడిందని ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం మినహా మరో ప్రత్యామ్నాయానికి ఒప్పుకోబోవుని హైకమాండ్‌కు చెప్పాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేయబోమని చెప్పండి సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏపీఎన్జీవోల నేత అశోక్‌బాబు సవాల్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఎంపీలు, మంత్రులకు ధైర్యం ఉంటే, తాము రాజీనామాలు చేయబోవుంటూ ప్రజలకు చెప్పాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సవాల్ విసిరారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాల డిమాండ్‌తోనే ఉద్యోగుల, ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైందన్నారు. రాజీనామాలకు ఏపీఎన్జీవోలు ఒత్తిడి తేలేదన్న ఎంపీల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నుంచి తిరిగి వెళ్తూ, బస్సులపై జరిగిన దాడిలో గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందున్న రాజమండ్రి ఉద్యోగి సత్యనారాయణను ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఇతర నేతలతో కలిసి అశోక్ బాబు శనివారం పరావుర్శించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని సంఘం హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలిపారు. చికిత్సకు ఇప్పటికే రూ.3 లక్షలు ఖర్చయ్యాయని, వైద్య ఖర్చులను తమ సంఘమే భరిస్తోందని చెప్పారు. -
చాలా కాలం పడుతుంది: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
ఢిల్లీ నుంచి వచ్చాక రాష్ర్ట విభజనపై మంత్రులతో సీఎం వ్యాఖ్య కేంద్రం ముందుకెళ్లాలంటే ఎటుచూసినా సమస్యలే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు యూటీ చేయాల్సిందే ‘371డి’ వంటి రాజ్యాంగ చిక్కుముడులూ ఉన్నాయి నీటి సమస్యలకు పరిష్కారం చూపటమూ ఇబ్బందే నవంబర్ తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి బడ్జెట్ సమావేశాల వరకూ ముందుకు కదలదేమో సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పూర్తికావటానికి చాలా సమయం తీసుకుంటుందని.. ఈలోగా జరిగే పరిణామాలతో అది ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఢిల్లీలో రెండు రోజుల పర్యటన ముగించుకుని గురువారం హైదరాబాద్ తిరిగివచ్చిన ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, విశ్వరూప్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మహీధర్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు కలిశారు. ఈ సందర్భంగా విభజనపై ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన చూచాయగా సహచరులకు వివరించినట్లు చెప్తున్నారు. విభజనపై కేంద్రం ముందుకు వెళ్లాలంటే ఎటుచూసినా అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయని కిరణ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ తీర్మానంలోనే రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్న విషయాన్ని సీఎం ప్రస్తావిస్తూ.. రెండు రాష్ట్రాల రాజధానిగా ఉన్న ప్రాంతం ఏదో ఒక ప్రభుత్వ పాలనలో ఉండటం సరైంది కాదని, పదేళ్ల పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వ కీలక వ్యవస్థలు, విభాగాలు హైదరాబాద్‌లో వేరే ప్రభుత్వ అధికార పరిధిలో పని చేయటం ఎక్కడా ఉండదని, ఉమ్మడి రాజధానిగా చేస్తే తప్పనిసరిగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం తప్ప మరో మార్గం ఉండదని అభిప్రాయపడినట్లు తెలిసింది. విభజనపై రాజ్యాంగపరమైన చిక్కుముడులు కూడా ఉన్నాయంటూ గతంలో రాజ్యాంగ సవరణ చేసి 371డి అధికరణ కింద రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించిన విషయాన్ని సీఎం ప్రస్తావించినట్లు చెప్తున్నారు. ఇప్పుడు మళ్లీ రాజ్యాంగ సవరణతో ఆ అధికరణాన్ని మార్చిన తర్వాతే విభజనపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ‘రాజ్యాంగ సవరణ కావాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మద్దతు లభించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏకు అంత బలం లేదు కనుక పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఏమేరకు ఉంటాయో తెలియదు’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. నీటి సమస్యలకు పరిష్కారం చూపించటమూ చాలా ఇబ్బందేనని.. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత కారణంగా ఇవన్నీ తేలాకనే విభజనపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో విభజనకు చాలా కాలం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ‘నవంబర్ వరకు ఉద్యమం తీవ్రంగా కొనసాగినా ఆ తరువాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. పార్టీ అధిష్టానం ఆ ఎన్నికల హడావుడిలో పడుతుంది. ఆ తరువాత కూడా ఏవో సమస్యలు రాకతప్పదు. చివరకు బడ్జెట్ సమావేశాల వరకు రాష్ట్ర విభజన అంశం ముందుకు కదలకపోవచ్చు. అప్పటికి సాధారణ ఎన్నికలు దగ్గరపడతాయి. ఈలోగా రాజకీయంగా ఎన్ని పరిణామాలు మారుతాయో, కేంద్రంలో సమీకరణాలు ఎలా మారుతాయో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు విభజనకు ఎన్ని పార్టీలు అంగీకరిస్తాయో, ఎన్ని వ్యతిరేకిస్తాయో చెప్పలేం...’ అంటూ సీఎం మంత్రులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ తప్పుచేసింది: మధుసూదన్‌గుప్తా
అనంతపురం: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర జిల్లాల్లో ఒక్కసారిగా ఉద్యమ వాతావరణం నెలకొంది. జూలై 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సీడబ్ల్యూసీ తీర్మానం అనంతరం కేంద్రం తెలంగాణపై తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో సీమాంధ్రలో ఉద్యమం రగులుకుంది. సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర నినాదంతో కేంద్రం వైఖరిని నిరసిస్తూ అడుగుడుగునా ధర్నాలూ, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. అక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా ఉద్యమంలో పాల్గొని తమ మద్దుతును పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై ముందే సంకేతాలిచ్చినా ప్రజలు ఆలస్యంగా మేల్కొన్నరంటూ గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ తప్పుచేసిందని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రుల అభిప్రాయాలను కాంగ్రెస్ పెద్దలు గౌరవించలేదని మధుసూదన్‌గుప్తా విమర్శించారు. -
రాష్ట్రపతి పాలన విధించైనా తెలంగాణ
కిరణ్ మొండికేస్తే సీఎంని మార్చి అయినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు టీజేఎఫ్ మీట్ ది ప్రెస్‌లో ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ ‘ప్లాన్ బీ’ని సిద్ధం చేసిన కేంద్ర హోంశాఖ తెలంగాణ వారిపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు అక్రమాస్తులు కాపాడుకునేందుకే సమైక్యవాదం ఉద్యోగులకు, ఉద్యమకారులకు డబ్బులిచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ధిక్కరిస్తే ఆయనను మార్చైనా సరే, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఖాయమని లోక్‌సభలో డిప్యుటీ చీఫ్ విప్ మధుయాష్కీగౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘ప్లాన్ బీ’ని సిద్ధం చేసిందని వారు వివరించారు. కిరణ్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, జగన్ తెలంగాణను అడ్డుకోవడానికి తెరవెనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది సమైక్య ఉద్యమం కాదని, కొంతమంది అగ్రవర్ణాల వారి అధికార దాహంతో సాగుతున్నదని ఆరోపించారు. బుధవారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువరించిన 70 గంటల వరకు సీమాంధ్రలో ఉద్యమమే లేదని, ఆ తర్వాత కూడా అంతంత మాత్రంగానే సాగినా చివరకు సీఎం కిరణ్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి ఉద్యమకారులను రెచ్చగొట్టారని ఆరోపించారు. తన తండ్రి అమర్నాథ్ రెడ్డి విగ్రహాలను కూల్చకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయించిన ముఖ్యమంత్రి.. రాజీవ్‌గాంధీ, ఇందిరల విగ్రహాలను కూల్చేస్తున్నా మౌనం వహించారని మండిపడ్డారు. సమైక్య ఉద్యమంలో హింస రేగుతున్నా కేసులు కూడా నమోదు చేయలేని దుస్థితిలో సీమాంధ్రలో పోలీసు శాఖ ఉందని, హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం కిరణ్, డీజీపీలు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల అధికారిని డీజీపీగా నియమించడంతోపాటు నాయకత్వ మార్పుపైనా పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు ప్రస్తుత లోక్‌సభ సమావేశాల్లో కాకపోయినా వచ్చే సమావేశాల్లో తప్పనిసరిగా వస్తుందని తెలిపారు. సమైక్య ఉద్యమంలో హైదరాబాద్ గురించే తప్ప మరో అంశమే లేదంటే అది కేవలం కొందరు పెట్టుబడిదారులు చేయిస్తున్నదేననే విషయం స్పష్టమవుతోందని చెప్పారు. టీడీపీ, బీజేపీ తెరవెనుక చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్నాయని, త్వరలోనే అవి రెండూ కలిసికట్టుగా తిరిగే పరిస్థితి కూడా ఉందన్నారు. సీమాంధ్రలో తెలంగాణ వారిపై దాడులు సరికాదని, ఇలాంటి దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తమ సహనాన్ని అసమర్థతగా భావించరాదని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యమకారులకు డబ్బులు ఇచ్చి సమ్మెలు, ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం ఆరా తీయిస్తోందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం నచ్చని కాంగ్రెస్ నేతలు పార్టీ నుంచి బయటకు పోవచ్చని ప్రభాకర్ పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం ఆంటోనీ కమిటీకి లే దని, సీమాంధ్రుల అపోహలు తీర్చడానికే ఆ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. రేణుకా చౌదరి సీమాంధ్రనేతేనని, ఆమెను తమ సమావేశాలకు పిలవడంపై అభ్యంతరం చెప్పి మరీ ఆపించామని చెప్పారు. తెలంగాణపై ప్రకటనే వచ్చిందని, ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రమాదం అంచులు దాటినట్లు కాదన్నారు. తెలంగాణ వచ్చాక రెండు ప్రాంతాల్లోనూ బడుగు బలహీన వర్గాల వారిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తామని, తాము మాత్రం రేసులో లేమని వివరించారు. ఈ సమావేశంలో టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ, నేతలు క్రాంతికుమార్, పీవీ శ్రీనివాస్, పల్లె రవికుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంటోని కమిటీ ఉత్తుత్తి కమిటీయే..!
-
అది ఉత్తుత్తి కమిటీయే
-
అది ఉత్తుత్తి కమిటీయే
కాంగ్రెస్ ప్రకటనకు, కేంద్రం కదలికకు పొంతనే లేదు కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు వినడానికే ఆంటోనీ కమిటీ ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగింపు దేని పని దానిదే అన్నట్లుగా సాగిపోతున్నా నోరెత్తని కాంగ్రెస్ ముఖ్యులు కమిటీతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టంచేసిన బొత్స సమైక్య ఉద్యమమూ మీడియాతోనే ఉధృతమవుతోందని అభిప్రాయం 19, 20 తేదీల్లో ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర నేతలతో కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానంతో ఏర్పడ్డ పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీకి ఎలాంటి ప్రాధాన్యమూ లేదని, అది ఉత్తుత్తి కమిటీయేనని స్పష్టమవుతోంది. కమిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రకటనకు, తెలంగాణ ప్రక్రియపై కేంద్రం కదలికలకు పొంతనే కనిపించడం లేదు. తెలంగాణ తీర్మానంతో సీమాంధ్రలో తలెత్తిన ఉద్యమ వేడిని తాత్కాలికంగా చల్లార్చడానికి ఆంటోనీ కమిటీని కాంగ్రెస్ కంటితుడుపుగా తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. కమిటీ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నామనే పేరుతో ఉద్యమ ఉధృతిని తగ్గించి ఆపై తన పనిని సాఫీగా కొనసాగించేందుకే కాంగ్రెస్ పెద్దలు కమిటీ నాటకానికి తెరతీసినట్లు తాజా పరిస్థితి స్పష్టం చేస్తోంది. తెలంగాణపై రాజ్యాంగ ప్రక్రియ కొనసాగింపునకు, ఆంటోనీ కమిటీ అభిప్రాయాల సేకరణకు సంబంధం లేదని, దేని దారి దానిదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం చెబుతున్నారు. ఆంటోనీ కమిటీ తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అభ్యంతరాలు, అభిప్రాయాలు మాత్రమే వింటుంది తప్ప ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం చేపట్టే ప్రక్రియతో ఈ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని బొత్స పేర్కొంటుండడం గమనార్హం. ‘‘కమిటీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు, అభ్యంతరాలు వింటుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యాంగపరమైన ప్రక్రియను కేంద్ర హోంశాఖ కొనసాగిస్తూ పోతుంది. ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రక్రియ ఆగబోదు. దేని పని దానిదే’’ అని బొత్స సత్యనారాయణ శుక్రవారం తనను కలసిన మీడియాతో అన్నారు. పైగా కమిటీ నివేదిక ఇవ్వడానికి గడువు లేదని ఆయన అంటున్నారు. కమిటీ స్వీకరించే అభిప్రాయాలతో కానీ, అది ఇచ్చే నివేదికలతో కానీ కేంద్రానికి సంబంధం లేకుండా ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. కమిటీకి సీమాంధ్ర ప్రాంత నేతలు చెప్పే అభ్యంతరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోకుండానే రాజ్యాంగపరమైన చర్యలను కేంద్రం కొనసాగించుకుపోతున్నా కాంగ్రెస్ పార్టీ నేతలు గొంతెత్తడం లేదు. సీడబ్ల్యూసీ తీర్మానంపై కాంగ్రెస్ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వచ్చినందున వారందరినీ ఏకాభిప్రాయంలోకి తెచ్చేందుకు కమిటీ ప్రయత్నిస్తుందని బొత్స పేర్కొంటున్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే అందరినీ నడిపించేందుకు తప్ప సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను వినడం ఈ కమిటీ లక్ష్యం కాదన్న అంశం బొత్స మాటల్లోనే తేటతెల్లమవుతోంది. అభిప్రాయాల స్వీకరణ తూతూమంత్రంగానే.. ఆంటోనీ కమిటీ అభిప్రాయాల స్వీకరణ తీరు కూడా ఏదో తూతూమంత్రంగానే అన్నట్లు సాగుతోంది. ఇలా అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించి ఆ తర్వాత ఉద్యమవేడి చల్లారగానే కేంద్రం తన ప్రక్రియను ముందుకు తీసుకుపోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ కమిటీ ఢిల్లీ నుంచి కదిలే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం పార్లమెంటు జరగని రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చే ప్రయత్నం కూడా కమిటీలో కనిపించడం లేదు. పార్లమెంటు సమావేశాలున్నందున ఈనెల 30 వరకు కమిటీ ఎక్కడికీ వెళ్లదని, ఎవరైనా అక్కడికే వెళ్లి అభిప్రాయాలు చెప్పుకోవాలని, అది కాంగ్రెస్ అంతర్గతవ్యవహార కమిటీ కనుక ఆ పార్టీ నేతల కే అభిప్రాయాలు వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలొచ్చాయి. పార్టీ నేతలు కూడా స్వేచ్ఛగా కమిటీ ముందు హాజరయ్యే పరిస్థితి అసలే లేదు. కమిటీని ఎవరు కలవాలన్నా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పాలి. కమిటీని కలుస్తామనే వారి వివరాలను వారిద్దరూ ఏఐసీసీకి పంపిస్తారు. ఆ తర్వాత కమిటీ అనుమతిని అనుసరించి ఎంపికచేసిన నేతలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. బయటి వ్యక్తులకు అసలు అవకాశమే ఇవ్వకుండా కమిటీతో చర్చల తతంగాన్ని పైపైనే ముగించాలన్నది పార్టీ పెద్దల అభిప్రాయం. ఇదిలా ఉంటే అందుకు విరుద్ధంగా బయటి వ్యక్తులకు, సంస్థలకు అవకాశమిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స కొద్దిరోజులక్రితం చేసిన ప్రకటన పార్టీలో వివాదాస్పదమైంది. ఆ ప్రకటనలో ఒక ఫోన్ నంబర్‌ను కూడా ఆయన ఇచ్చారు. ఈ ప్రకటనపై ఏఐసీసీ అగ్ర నేతలు బొత్సపై ఆగ్రహించినట్లు తెలుస్తోంది. దీంతో కంగుతిన్న బొత్స శుక్రవారం మాటమార్చారు. ఇది పార్టీ అంతర్గత కమిటీయేనని, పార్టీ నేతల్లోని అపోహలను తొలగించడానికే దీన్ని ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ ఇచ్చిన ఫోన్ నంబర్‌కు దాదాపుగా 200కు పైగా కాల్స్, 60కి పైగా ఎస్సెమ్మెస్‌లు వచ్చాయని తెలుస్తోంది. ‘‘మాకు వచ్చిన ఎస్సెమ్మెస్‌లలో చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. 13 గ్రూపులు మాత్రం అపాయింట్మెంటు కోరాయి. వాటిలోనూ స్పష్టత లేదు. చాలా మంది కమిటీ ముందు చెప్పాల్సిన అభిప్రాయాలను మెసేజ్ రూపంలో ఇచ్చారు’’ అని బొత్స పేర్కొన్నారు. పార్టీని సంప్రదించిన సంస్థలకు అవకాశం ఇవ్వడం ఇష్టం లేకపోవడం కారణంగానే అవేవీ ప్రతిష్టాత్మకమైనవి కావని పార్టీ నేతలు పక్కన పెట్టేస్తున్నారు. సీఎంతో బొత్స భేటీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈనెల 19, 20 తేదీల్లో ఢిల్లీలో ఆంటోనీ కమిటీ.. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్న నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు. ఆంటోనీకి నివేదించాల్సిన అంశాలపై చర్చించేందుకు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శనివారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం, బొత్స పాల్గొంటారు. కాగా, ఆంటోనీ కమిటీతో సమన్వయం చేసుకునేందుకు ఈనెల 19న బొత్స ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం మాత్రం ఢిల్లీ వెళ్లాలా లేదా అన్న మీమాంసలో ఉన్నట్లు తెలిసింది. మీడియాపై కాంగ్రెస్ గుర్రు సీమాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ముద్దాయిగా మారడంతో ఆ పార్టీ నేతల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. పార్టీ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీర్మానాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నా గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయలేకపోతున్నారు. ఉద్యమం కారణంగా ప్రజల్లోనూ తిరగలేకపోతున్నారు. దీంతో ఉద్యమంపై వార్తలు, కథనాలు ప్రసారం చేస్తున్న మీడియాపై అక్కసును వెళ్లగక్కుతున్నారు. ‘‘ఈ పరిస్థితి అంతటికీ మీరే కారణం. మీడియా యాజమాన్యాలు సొంత ఎజెండాలు పట్టుకొని ముందుకు వెళ్తున్నాయి. సీమాంధ్రలో ఉద్యమాన్ని ఎగదోస్తున్నాయి. అక్కడ జరుగుతున్న దాన్ని మరింతగా చూపిస్తున్నాయి. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలోనూ మీడియా సంస్థలు ఇలాగే వ్యవహరించాయి. ఇది మంచిది కాదు. ప్రజలకు న్యాయం జరిగేలా మీడియా ఉండాలి’’ అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆక్రోశం వెళ్లగక్కారు. -
రాజకీయ లభ్దికోసమే సీఎం వివరం:మైసూరా
-
నాడు నోరెత్తలేదేం? : మైసూరారెడ్డి
ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన మైసూరారెడ్డి సీడబ్ల్యూసీ ముందు సమస్యలన్నింటినీ వివరించారా? మీరు చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా? మీ మాటల్ని ఖాతరు చేయకపోతే మీరెందుకు రాజీనామా చేయలేదు? రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటిపంపకాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలున్నాయంటున్నారు ఈ సమస్యలన్నీ కొద్దిరోజులుగా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ చెబుతున్నవే విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది? ఇతర పార్టీలవి దొంగనాటకాలంటున్నారు... అసలు మీ నాటకమేమిటి? రాష్ట్రాన్ని విభజిస్తే చాలా ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలిపోతాయి.. రాష్ట్ర విభజన నెపాన్ని వైఎస్‌పై నెట్టడం తగదు రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటి పంపకాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలున్నాయని మీకు తెలుసుకదా? మీరు చెప్పినా అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా?.. అయితే మీరెందుకు రాజీనామా చేయలేదు? విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది? రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటి పంపకాలు, విద్యుత్ సమస్యలు, ఉద్యోగులు, తదితర అంశాలపై సమస్యలున్నాయని చెప్తున్న ముఖ్యమంత్రి సీడబ్ల్యూసీ ముందు నోరెందుకు ఎత్తలేదని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం రాత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశానంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అన్ని విషయాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలేమిటో తెలిసే ఉంటుంది. విభజన ప్రకటనకు ముందు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మీరూ పాల్గొన్నారు. అప్పుడు ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావించారా? మీరు చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా? అలా చేసుంటే మీరు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుండాల్సింది. కానీ అలా చేయకుండా విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది?’’ అని నిలదీశారు. ఇతర పార్టీలవి దొంగ నాటకాలంటున్న కిరణ్... ఆయన ఆడుతున్న నాటకమేదో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది తాను మంచివాడినని చెప్పుకోవడం కోసమో లేదా ప్రజల ఆగ్రహావేశాలనుంచి పార్టీని కాపాడేందుకో సీఎం కిరణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికే ఆ కమిటీ.. ఆంటోనీ నేతృత్వంలో వేసిన హైలెవెల్ కమిటీకి సమస్యలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి సూచించడాన్ని మైసూరా తప్పుబట్టారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ అత్యున్నత కమిటీ. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సబ్ కమిటీ ఎలా సవరించగలుగుతుంది. యజమాని చేసిన నిర్ణయంపై గుమాస్తా పంచాయతీ చేయగలడా? ఒక పార్టీ వేసుకున్న కమిటీకి మిగతా పార్టీలు అభిప్రాయాలెందుకు చెప్తాయి? ఒకవేళ చెప్పినా చెవికెక్కుతుందా? ఎవరెన్ని చెప్పినా ఆఖరికి వారి అధినేత్రి సోనియా చెప్పిన విషయాలనే రిపోర్టులో పొందుపరుస్తారు’’ అని విమర్శించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య లక్ష్మణరేఖ ఉంటుంది. దాన్ని విస్మరించినట్లు కాంగ్రెస్‌పార్టీ ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. చట్టబద్ధంగా నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికనే తుంగలో తొక్కేసిన వారు ఎలాంటి అధికారాలు లేని ఆంటోనీ కమిటీ సూచనలను పాటిస్తారని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన కమిటీని నియమిస్తేనే అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు వినిపిస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యనెలా పరిష్కరిస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ చాలాకాలంగా ప్రశ్నిస్తోందని మైసూరా గుర్తుచేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కావేరీ, ఆల్మట్టి జల వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కావడంలేదు. ఈ సమస్యను హైపవర్ కమిటీ ఎలా పరిష్కరిస్తుందని నిలదీశారు. కాంగ్రెస్‌కు పది తలలుంటాయి... కాంగ్రెస్ పార్టీ పది తలల రావణాసురుడులాంటిదని, అందులో ఒక్కో తల ఒక్కొక్క మాట చెబుతోందని మైసూరా ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ తన వైఖరి చెప్పకుండా రాజకీయ దుష్టచింతనతో ప్రవర్తించింది. హోంమంత్రి షిండేతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా రెండు ప్రాంతాల ప్రతినిధులు రెండు రకాలు చెప్పారు. పార్టీ వాదన చెప్పాలని తాము నిలదీస్తే... అధిష్టానం చెప్పేదే అంతిమ నిర్ణయమని షిండే చెప్పారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే సీడబ్ల్యూసీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. దాన్ని చల్లార్చేందుకే కమిటీలంటూ నాటకాలాడుతోంది. తాజాగా సీఎం కిరణ్ మాట్లాడుతూ... విభజన పార్టీకే పరిమితం తప్ప, కేంద్రం నిర్ణయం కాదంటూ ఇరుప్రాంతాల్లో సమస్యను మరింత జఠిలం చేశారు. వారి వాలకం చూస్తుంటే ఎలాంటి నిర్ణయమైనా ముందు, వెన క్కి తీసుకునే సౌలభ్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఓట్లు, సీట్ల కోసమే ఎన్నికల ముందు ఎత్తులు వేస్తున్నారు’’ అని మైసూరా విమర్శించారు. ఇది రాజకీయ లబ్ధికోసం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారని తెలిపారు. మాది ఒకే మాట... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉందని మైసూరా చెప్పారు. ప్లీనరీ నుంచి షిండే ఏర్పాటు చేసిన అఖిలపక్షం వరకు ఒకే మాట చెప్పామని, ఒక తండ్రిలా సమస్యను పరిష్కరించాలని కోరామని వివరించారు. అవేవీ చేయకుండా ఇతరులపై బురద చల్లడం సరైంది కాదన్నారు. నీటి పంపకాలు, రాజధాని, ఉద్యోగులు తదితర అంశాలపై తాము వారం రోజులుగా అనునిత్యం మీడియా సమావేశంలో చెబుతున్న వాటినే సీఎం ప్రస్తావించారని చెప్పారు. రాష్ట్ర విభజన నెపాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై నెట్టడాన్ని మైసూరా తప్పుపట్టారు. ‘‘ఆనాడు ఎమ్మెల్యేలందరూ వెళ్లి సోనియాగాంధీని కలిసినప్పుడు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. రెండోఎస్సార్సీ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. అప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి అదే తీర్మానాన్ని అందజేసింది తప్ప అంతకుమించి మరేమీ జరగలేదు’’ అని మైసూరారెడ్డి వివరించారు. -
కాంగ్రెస్ ఇస్తుందన్న నమ్మకం లేదు: కిషన్‌రెడ్డి
మీట్ ది ప్రెస్‌లో బీజేపీ నేత కిషన్‌రెడ్డి తెలంగాణపై సోనియా, చంద్రబాబు నాటకం ఆడిస్తున్నారు కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణకు విఘాతమే సీమాంధ్రలో నిరసనలను చల్లార్చేందుకు పార్టీలు ప్రయత్నించాలి ఎల్లకాలం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కుదరదు సాక్షి, హైదరాబాద్: కుట్రలు, కుతంత్రాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఇప్పటికీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత 2009 నాటి పరిస్థితిని పునరావృతం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ, చంద్రబాబే ఈ నాటకం ఆడిస్తున్నారని, వీళ్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడయిందని విమర్శించా రు. ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణపై మాట తప్పని నేరానికి తమను సీమాంధ్రలో దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను ప్రకటించినప్పటికీ పార్లమెంటులో బిల్లు పెడితే తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లక తప్పదని, ఎటువంటి ఆప్షన్లు ఉండవని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రక్రియకు విఘాతమేనని పునరుద్ఘాటించారు. కేసీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు, నిరసనలు వ్యక్తమవుతున్న దశలో కేసీఆర్ సంయమనం పాటించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన విధివిధానాల మేరకు ఉద్యోగుల విభజన ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ప్రాణాలను అడ్డం పెట్టయినా తెలంగాణలోని సీమాంధ్రుల్ని కాపాడతామన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జరిగిన మరణాలకు బాధ్యులైన వారిపై కోర్టుల్లో ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉందని, ప్రజలు ఆ హక్కును ఉపయోగించుకుంటే సంతోషిస్తానని చెప్పారు. కలసికట్టుగా సముదాయిద్దాం: సీమాంధ్రలో నిరసనలను చల్లార్చేందుకు అన్ని పార్టీలు నడుంకట్టాలని కిషన్‌రెడ్డి పిలుపిచ్చారు. ‘‘రాష్ట్ర విభజన ఆవశ్యకతను తెలియజెప్పి, ఉద్యమకారులను బుజ్జగించేందుకు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఐ, బీజేపీ, టీడీపీల అధ్యక్షులు కలిసికట్టుగా సీమాంధ్రలో పర్యటించాలి. ప్రజల్లో అనుమానాలను పోగొట్టాలి. కేంద్ర సహకారంతో 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. 2 రాష్ట్రాలైతే లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. వేలాది పరిశ్రమలు వస్తాయి. రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు మంచి ప్యాకేజీ రాబడదాం. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదాకు కృషిచేద్దాం. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎల్లకాలం కొనసాగించడం కుదరదు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తామని కేంద్రం అంటే అప్పుడు స్పందిస్తాం’’ అని చెప్పారు. మీడియా సహకరిస్తే సీమాంధ్ర ఉద్యమకారుల్ని సముదాయించడం సులువేనని అభిప్రాయపడ్డారు. మజ్లిస్‌కు ఇష్టమున్నా లేకున్నా తెలంగాణ ఏర్పడితే బీజేపీదే అధికారమన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కుపోయాయన్నారు. 2014లో అధికారం తమదేనని, మోడీయే భావి ప్రధానిగా తమ పార్టీ ప్రకటించక మునుపే ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. సమావేశానికి టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షత వహించగా పల్లె రవికుమార్, క్రాంతికుమార్, పీవీ శ్రీనివాస్, శైలేష్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.