చాలా కాలం పడుతుంది: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
ఢిల్లీ నుంచి వచ్చాక రాష్ర్ట విభజనపై మంత్రులతో సీఎం వ్యాఖ్య
కేంద్రం ముందుకెళ్లాలంటే ఎటుచూసినా సమస్యలే
ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు యూటీ చేయాల్సిందే
‘371డి’ వంటి రాజ్యాంగ చిక్కుముడులూ ఉన్నాయి
నీటి సమస్యలకు పరిష్కారం చూపటమూ ఇబ్బందే
నవంబర్ తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి
బడ్జెట్ సమావేశాల వరకూ ముందుకు కదలదేమో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పూర్తికావటానికి చాలా సమయం తీసుకుంటుందని.. ఈలోగా జరిగే పరిణామాలతో అది ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఢిల్లీలో రెండు రోజుల పర్యటన ముగించుకుని గురువారం హైదరాబాద్ తిరిగివచ్చిన ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, విశ్వరూప్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మహీధర్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు కలిశారు. ఈ సందర్భంగా విభజనపై ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన చూచాయగా సహచరులకు వివరించినట్లు చెప్తున్నారు. విభజనపై కేంద్రం ముందుకు వెళ్లాలంటే ఎటుచూసినా అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయని కిరణ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
సీడబ్ల్యూసీ తీర్మానంలోనే రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్న విషయాన్ని సీఎం ప్రస్తావిస్తూ.. రెండు రాష్ట్రాల రాజధానిగా ఉన్న ప్రాంతం ఏదో ఒక ప్రభుత్వ పాలనలో ఉండటం సరైంది కాదని, పదేళ్ల పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వ కీలక వ్యవస్థలు, విభాగాలు హైదరాబాద్‌లో వేరే ప్రభుత్వ అధికార పరిధిలో పని చేయటం ఎక్కడా ఉండదని, ఉమ్మడి రాజధానిగా చేస్తే తప్పనిసరిగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం తప్ప మరో మార్గం ఉండదని అభిప్రాయపడినట్లు తెలిసింది. విభజనపై రాజ్యాంగపరమైన చిక్కుముడులు కూడా ఉన్నాయంటూ గతంలో రాజ్యాంగ సవరణ చేసి 371డి అధికరణ కింద రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించిన విషయాన్ని సీఎం ప్రస్తావించినట్లు చెప్తున్నారు. ఇప్పుడు మళ్లీ రాజ్యాంగ సవరణతో ఆ అధికరణాన్ని మార్చిన తర్వాతే విభజనపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ‘రాజ్యాంగ సవరణ కావాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మద్దతు లభించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏకు అంత బలం లేదు కనుక పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఏమేరకు ఉంటాయో తెలియదు’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
నీటి సమస్యలకు పరిష్కారం చూపించటమూ చాలా ఇబ్బందేనని.. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత కారణంగా ఇవన్నీ తేలాకనే విభజనపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో విభజనకు చాలా కాలం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ‘నవంబర్ వరకు ఉద్యమం తీవ్రంగా కొనసాగినా ఆ తరువాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. పార్టీ అధిష్టానం ఆ ఎన్నికల హడావుడిలో పడుతుంది.
ఆ తరువాత కూడా ఏవో సమస్యలు రాకతప్పదు. చివరకు బడ్జెట్ సమావేశాల వరకు రాష్ట్ర విభజన అంశం ముందుకు కదలకపోవచ్చు. అప్పటికి సాధారణ ఎన్నికలు దగ్గరపడతాయి. ఈలోగా రాజకీయంగా ఎన్ని పరిణామాలు మారుతాయో, కేంద్రంలో సమీకరణాలు ఎలా మారుతాయో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు విభజనకు ఎన్ని పార్టీలు అంగీకరిస్తాయో, ఎన్ని వ్యతిరేకిస్తాయో చెప్పలేం...’ అంటూ సీఎం మంత్రులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం.