యూటీకి కిరణ్ ఓకే!
రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆయన వేసుకున్న సమైక్యం ముసుగు క్రమంగా తొలిగిపోతోంది. సీమాంధ్రలో చాంపియన్ కావాలని కిరణ్ ఆడుతున్న నాటకాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి పోయినా లెక్కచేయబోనని, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఒప్పుకునేది లేదని కిరణ్ చెబుతున్న మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలేనని స్పష్టమవుతోంది. విభజనకు సహకరిస్తూ బయటకు మాత్రం సమైక్యం అంటున్నారని అర్థమవుతోంది. రాష్ట్ర విభజన జరగనీయబోమని చెబుతూనే లోలోన మాత్రం ఆ విషయంలో అధిష్టానానికి తన పూర్తి సహకారాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
తాను కరడుగట్టిన సమైక్యవాదినని ప్రతి వేదికపైనా కిరణ్ డబ్బా కొట్టుకుంటున్నారు. సమైక్యాంధ్ర కోసం పదవీ త్యాగానికి కూడా సిద్ధమని చెబుతున్నారు. సీఎం పోస్టు తనకో లెక్కకాదన్నట్టు లెక్చర్లు దంచారు. ఎన్నికల కోసం రాష్టాన్ని విభజించాలనుకోవడం సరికాదంటూ సన్నాయి నొక్కులు నొక్కాయి. సమైక్యాంధ్ర కొనసాగుతుందని, తన తర్వాత సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉంటారని జోస్యం చెప్పారు. బయటికి సమైక్యం అంటున్నా హైకమాండ్ ఒత్తిడికి ఆయన తలొగ్గినట్టు కనబడుతోంది. పైకి సమైక్యం అంటూనే విభజనకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే విభజనకు తనకెలాంటి అభ్యంతరమూ లేదని అధిష్టానికి కిరణ్ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు సీఎంతో ఫోన్‌లో మాట్లాడుతూ యూటీ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కేంద్ర మంత్రి జేడీ శీలం ఈ విషయాన్ని సూచాయగా వెల్లడించారు. హైదరాబాద్‌ను రెండేళ్లు యూటీ చేస్తే విభజనకు కిరణ్ అడ్డుచెప్పరని ఆయన చెప్పారు. ‘‘సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కనీసం రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. అందుకే అప్పటిదాకా హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నాం. మా ప్రతిపాదనకు అంగీకరిస్తే విభజన బిల్లుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలందరినీ ఒప్పిస్తాం’’ అని శీలం తెలిపారు. అంటే కిరణ్‌ను కూడా విభజనకు ఒప్పిస్తారా అని ప్రశ్నించగా, అందరిలో సీఎం కూడా ఒకరని బదులిచ్చారు.
విభజనపై కిరణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారని శీలం వ్యాఖ్యలతో తేలిపోయింది. అయితే ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ ఆడిస్తున్న నాటకమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకునే వ్యూహంలో భాగంగా కిరణ్తో సమైక్యం డ్రామా నడుపుతోందని అంటున్నాయి. మరోవైపు రాష్ట్రం విడిపోతే తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని భావిస్తున్న కిరణ్ సొంత పార్టీ పెట్టే యోచనలో కూడా ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. సమైక్య ముసుగులో కిరణ్ ఆడుతున్న నాటకాలపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. విభజనను అడ్డుకోవాలని కోరుతున్నారు.