చివరి దశకు చేరిన తెలంగాణ బిల్లు!
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు చివరిదశకు చేరింది. దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇవాళ నిర్వహించే సమావేశమే చివరిదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంశంలోఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. హైదరాబాద్ యూటీకి జీవోఎం నిరాసక్తత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైద్య, విద్య, ఉపాధి, శాంతి భద్రతల అంశాలు కేంద్రం చేతుల్లోకి తీసుకుని ఆ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. వివాదస్పదంగా మారిన భద్రాచలం తెలంగాణకే చెందుతుందని మంత్రుల బృందం తేల్చింది.
అయితే పోలవరం ముంపు గ్రామాలు మాత్రం సీమాంధ్రలో కలపాలని ప్రతిపాదించనున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లేకుంటే తెలంగాణలో అసంతృప్తి ఉంటుందని...అలా జరిగితే రాజకీయ లబ్ధి పూర్తిగా చేకూరదని జీవోఎం సభ్యులు వాదించినట్లు సమాచారం. దీనిపై బుధవారం ఉదయం నుంచి విస్తృతంగా మంతనాలు జరిగాయి.
మరోవైపు... జైరాంరమేష్, చిదంబరంలతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ అయ్యారు. ఇంతకాలం పోరాడతున్నామని బీరాలు పలికిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు పూర్తిగా చేతులెత్తేశారు రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు. ఇంకా సమైక్యంకోసం ప్రయత్నించడంలో ప్రయోజనం లేదని చెప్పారు. కావూరి, కిశోర్‌చంద్రదేవ్ ఈ తతంగానికి దూరంగా ఉన్నారు. తెలంగాణ నిర్ణయం కీలకదశలో ఉన్న సమయంలో కావూరి అమెరికా పర్యటన అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ఇక రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. జీవోఎం మరిన్ని భేటీలు నిర్వహిస్తుందని కేంద్ర హోంమంత్రి షిండే అంటూంటే ..... రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాత్రం జీవోఎం నివేదిక పూర్తి చేస్తుందంటున్నారు. నివేదికను కేబినెట్ భేటిలో చర్చించిన తరువాత అసెంబ్లీకి తెలంగాణ బిల్లు పంపుతామని దిగ్విజయ్ తెలిపారు. ఎలాంటి సవరణలు లేకుండా రాజ్యంగ పరిథిలోనే హైదరాబాద్‌ను పరిమిత కాలపు ఉమ్మడి రాజధానిగా చేస్తామన్నారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నిబద్దత కలిగిన నాయకుడంటూ కితాబిచ్చారు.