‘విడి’పోని వివాదాలు | ap,telangana issues not solved after six months of bifurcation | Sakshi
Sakshi News home page

‘విడి’పోని వివాదాలు

Published Mon, Dec 1 2014 1:16 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ap,telangana issues not solved after six months of bifurcation

* రాష్ట్ర విభజనకు నేటితో ఆరు నెలలు
* ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన వివాదాలెన్నో
* నీరు, విద్యుత్, విద్య వంటి కీలకమైన అంశాల్లో ఎవరి దారి వారిదే
* ఇంకా కొలిక్కిరాని ఉద్యోగుల పంపిణీ... కార్పొరేషన్లపైనా పీటముడి
* ఉమ్మడి గవర్నర్ వద్ద పంచాయితీ జరిగినా పరిష్కారం కాని ‘పరీక్షలు’
* రెండు రాష్ట్రాల మధ్య పెరుగుతున్న వివాదాలు.. పట్టించుకోని కేంద్రం
* ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని హామీలనూ నెరవేర్చలేదు

సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయి వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. కానీ.. విభజన సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలివున్నాయి. ఇంకా కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. వాటికీ పరిష్కారం లభించడం లేదు. ఉద్యోగుల పంపిణీ జరగలేదు. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపూ పూర్తికాలేదు. విద్యుత్, విద్య, జల వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న గవర్నర్ ముంగిట పలు అంశాలపై పంచాయితీ జరిగినా.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర ప్రభుత్వం ముందు తమ వాదనలు వినిపించినా.. ఏ ఒక్క అంశంలోనూ ముందడుగు పడలేదు. విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఒక్క అడుగూ కదలలేదు.

పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014 మేరకు ఈ ఏడాది జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. సాంకేతికంగా భౌగోళికంగా వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడి సోమవారానికి ఆరు నెలలు అవుతున్నప్పటికీ.. ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. విభజన తొలినాళ్లలోనే ఇరు రాష్ట్రాల మధ్య వివిధ అంశాల్లో మొదలైన కొన్ని వివాదాలు ఈ ఆర్నెల్లలో మరింతగా ముదిరాయి.

పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలకు అదనంగా అన్నట్టు ఇరు రాష్ట్రాలు ఆయా సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు సైతం చిక్కు సమస్యలు తెచ్చిపెట్టాయి. ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్పు, 1956కు ముందున్న వారే స్థానికులుగా నిర్ధారిస్తామంటూ తెలంగాణ ప్రకటించడం, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నాక్)కు డీజీని నియమించడం, దాన్ని రెండు ప్రభుత్వాలు పునర్‌వ్యవస్థీకరిస్తూ ఎవరికి వారు ఆదేశాలు జారీ చేయడం, కార్మిక సంక్షేమ శాఖ నిధుల మళ్లింపు, ఎవరికి వారు వేర్వేరుగా ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూలును ప్రకటించడం.. ఇలా అనేక విషయాల్లో ఆయా ప్రభుత్వాల నిర్ణయాలు రెండు రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచాయి.

ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. వీటికి తోడు పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10వ షెడ్యూలులో పొందుపరిచిన సంస్థలు ఏ రాష్ట్రానికి చెందుతాయన్న దానిపైనా వివాదం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ కోసం నియమించిన కమల్‌నాథన్ కమిటీ, ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపునకు సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇంకా ఎటూ తేల్చకపోవడం వంటి అంశాలు ఇరు రాష్ట్రాలకూ ఇబ్బందికరంగానే పరిణమించింది.

ముదిరిన విద్యా వివాదాలు...
ఉన్నత విద్యా సంస్థలను ఉమ్మడి జాబితాలో చేర్చడంతో ఈ సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారం కాకపోగా మరింత ముదిరి పాకానపడ్డాయి. వీటిని త్వరితంగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగానే కొనసాగాలని కోరుతోంది. ఈ వివాదంతో ఆయా సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. అక్కడి ఉద్యోగులు కూడా రెండు ప్రాంతాల వారీగా చీలిపోవడంతో సంస్థల వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగడం లేదు.

ఉన్నత విద్యా మండలితో మొదలు...
రాష్ట్ర విభజన తొలి రోజుల్లో వివాదం తలెత్తింది ఉన్నత విద్యామండలిపైనే. ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహణను ఏపీ విద్యామండలి చేపట్టబోగా.. తమ రాష్ట్రంలోని కాలేజీల ప్రవేశాలకు కౌన్సెలింగ్ తామే నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. తమ రాష్ట్ర ఉన్నత విద్యామండలిని ప్రకటించింది. చివరకు ఏపీ ఉన్నత విద్యామండ లి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది.

కౌన్సెలింగ్ నిర్వహణలోనూ వివాదం ఏర్పడటంతో చివరకు ఉన్నత విద్యామండళ్లతో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖల కమిషనర్లు కన్వీనర్, కో-కన్వీనర్లుగా వ్యవహరించి కౌన్సెలింగ్‌ను పూర్తిచేశారు. ప్రస్తుతం ఏపీ ఉన్నత విద్యామండలి ఉన్న భవనంలోనే పై అంతస్తులో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటయింది. నిధులు, ఉద్యోగుల అంశంపై ఇరు మండళ్ల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. మరోవైపు వచ్చే ఏడాది ఎంసెట్ ఉమ్మడిగా చేపట్టాలా? వేర్వేరుగా చేపట్టాలా? అన్న అంశంపైన కూడా రెండు మండళ్ల మధ్య భిన్నాభిప్రాయాలుఉన్నాయి.

తేలని ఇంటర్ పరీక్షల పంచాయతీ...
ఇంటర్‌మీడియట్ బోర్డుపై కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతోంది. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉమ్మడిగా జరగాలని ఏపీ పేర్కొంటుండగా.. తమ రాష్ట్ర పరీక్షలు తాము వేరుగా పెట్టుకుంటామని తెలంగాణ స్పష్టం చేస్తోంది. ఏపీ ఉమ్మడి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించగా తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్ర ఇంటర్ బోర్డు పేరుతో ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఇరు రాష్ట్రాల విద్యాశాఖల మంత్రుల చర్చల్లోనూ పరిష్కారం లభించకపోవడంతో చివరకు గవర్నర్ వద్దకు ఈ వివాదం చేరింది. ఇంటర్ పరీక్షలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలపై పట్టువీడకపోవడంతో సమస్య అలాగే ఉండిపోయింది. దీంతో గవర్నర్ కేంద్రంతో, ఇతర రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆదివారం తనను కలసిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు హామీ ఇచ్చారు.

ఆరు యూనివర్సిటీలపైనా...
విభజన నేపథ్యంలో ఆరు యూనివర్సిటీలను పదో షెడ్యూల్‌లో చేర్చారు. వీటికి సంబంధించి విభజన వెంటనే జరగాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే పదేళ్ల పాటు ఉమ్మడిగానే ఉండాలని ఏపీ స్పష్టం చేస్తోంది. దీనిపై విద్యాశాఖల కార్యదర్శులు, మంత్రుల స్థాయిలో చర్చ జరిగినా పరిష్కారం లభించలేదు. ఉమ్మడి జాబితాలో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ), జవహర్‌లాల్‌నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ద్రవిడ వర్సిటీ, శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

ద్రవిడ వర్సిటీ, పద్మావతీ వర్సిటీలు మినహా తక్కినవి హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ వర్సిటీలు ఏపీలో లేనందున అవి ఏర్పడే వరకు పదేళ్ల వరకు ఉమ్మడిగా ఉండాలని ఏపీ అంటోంది. అయితే.. హైదరాబాద్‌లోని వర్సిటీలు తమ రాష్ట్రానికే చెందాలని, ఏపీలో ఉన్న రెండు వర్సిటీల్లో తమకు భాగస్వామ్యం అక్కర్లేదని తెలంగాణ అంటోంది. హైదరాబాద్‌లోని వర్సిటీల్లో తమకు వాటా ఉందని ఏపీ భావిస్తే ఆ వాటా ప్రకారం విభజన చేయడానికి తమకు అభ్యంతరం లేదని కూడా స్పష్టంచేసింది. ఆస్తులు, ఉద్యోగుల వివరాల జాబితా కూడా రూపొందించినా విభజనపై ఏదీ తేలలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, హిందీ, తెలుగు, సంస్కృత అకాడమీలు కూడా ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. వీటి పరిస్థితీ అదే మాదిరిగా ఉంది.

పాఠశాల విద్యాశాఖ పరిధిలో...
పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కొన్ని సంస్థలు కూడా ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అయితే ఉన్నత విద్యను పదేళ్ల పాటు కొనసాగించాలని చట్టంలో పేర్కొన్నందున ఈ సంస్థల విభజనపై వివాదాలను పరిష్కరించుకుంటున్నారు. రాజీవ్ విద్యా మిషన్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ ట్రయినింగ్ తదితరాలను విభజించుకొని ఎవరి కార్యకలాపాలు వారు నిర్వహించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement