విభజన తర్వాతే పొత్తుల మాట
రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన తర్వాత ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే తాము కొన్ని సవరణలు కోరుతామని ఆయన చెప్పారు.
హైదరాబాద్ సహా సీమాంధ్ర ప్రాంతానికి కూడా పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా ఈ సవరణలు ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సవరణలను ఆమోదించేలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతామని, వీటిని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకొంటుందన్న ఆశాభావంతోనే తామున్నామని ఆయన చెప్పారు. ఒకవేళ తాము ప్రతిపాదించిన సవరణలకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని అన్నారు. తెలంగాణపై బీజేపీ వైఖరి ఏమాత్రం మారలేదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.