నిజాంను మరిపిస్తున్న కేసీఆర్ : కిషన్‌రెడ్డి
పటాన్‌చెరు: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిజాంను మరిపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం మెదక్ జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయొద్దు, టీవీలు ఉండొద్దు’ అనే విధానాన్ని అనుసరిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలి పారు. రానున్న రోజుల్లో కేంద్రం తెలంగాణకు రూ.లక్ష కోట్లు కేటాయించనుందని వెల్లడించారు. రామగుండంలో ఫిబ్రవరిలో రూ.5,300 కోట్లతో స్థాపించనున్న ఎరువుల ఫ్యాక్టరీ శంకుస్థాపనకు, రూ. 9 వేల కోట్లు కేటాయించిన ఎన్‌టీపీసీ విద్యుత్ ప్లాంట్ పని ప్రారంభానికి ప్రధాని నరేం ద్రమోదీ వస్తారని చెప్పారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.43,500 కోట్లు వచ్చాయన్నారు. ‘మేం సహకరించకపోతే తెలంగాణలో అభివృద్ధే లేదు. మా సహకారం లేకుండా పాలన చేయగలవా..?’ అని సీఎంను కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.