భువనగిరిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతున్న లక్ష్మణ్. చిత్రంలో కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ
సాక్షి, యాదాద్రి : ‘ఎవరెవరికో అధికారం ఇచ్చారు. తెలంగాణలో ఈసారి మాకు అవకాశం ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మార్పుకోసం పేరిట శనివారం బీజేపీ జన చైతన్యయాత్రను యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభించారు. ముందుగా పార్టీ నాయకులు యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి సన్నిధిలో పూజలు చేశారు. అనంతరం గుట్ట నుంచి భువనగిరికి ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్ మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమే తమ పార్టీ జన చైతన్యయాత్రను ప్రారంభించిందన్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు, మోదీ పాలనలో విజయాలు, కేంద్ర పథకాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో దగా పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో నవ్వులపాలవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రానికి కోట్లాది నిధులను మంజూరు చేసిందని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే ప్రారంభమైందన్నారు. అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం ప్రకటించిందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కేసీఆర్, చంద్రబాబుల తర్వాత వారి పార్టీల ఉనికి ప్రశ్నార్థకమన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల రక్తాన్ని కాంట్రాక్టర్లు జలగల్లా తాగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏ టీఆర్‌ఎస్‌లోకి బదిలీ అయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నీతివంతమైన పాలన అందిస్తున్నారన్నారు. బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మజ్లిస్ చెప్పుచేతల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్ నుంచి అధికారాన్ని తమకు ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తామన్నారు. సమా వేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ నాయకులు పేరాల చంద్రశేఖర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment