jana chaitanya yatra
-
మునిగిపోయే పడవ టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మునిగిపోయిన నావ అయితే టీఆర్ఎస్ మునిగిపోతున్న పడవ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యా నించారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మూస విధానాలను సమూలంగా మార్చడానికి జన చైతన్య యాత్రను 14 రోజులపాటు 22 జిల్లాలు, 14 పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించామన్నారు. ఈ యాత్రలో ప్రజలు అనేక సమస్యలను పార్టీ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఈ విజ్ఞప్తులు, ప్రజా ఆలోచనల మేరకు మేనిఫెస్టో ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీట్ తయారు చేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రాజెక్టుల్లో కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌పై, టీఆర్ఎస్పై అన్ని వర్గాలకు విశ్వాసం పోయిందని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రం రాక ముందున్న బాధలు, సమస్యలన్నీ ఇప్పుడూ అలాగే ఉన్నాయన్నారు. చేపలు, బర్రెలు, గొర్రెల పంపిణీ అంతా దగా, మోస మని విమర్శించారు. ఈ యాత్రతో టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని, రూ.2 లక్షల రుణమాఫీ, ఉచిత బోర్లు, రైతుల అప్పులపై వడ్డీ మాఫీ లాంటి హామీలను ఇచ్చామన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు జరిగే వరకు యాత్ర ఆగదన్నారు. వచ్చే ఎన్నికల్లో వ్యూహం, అభ్యర్థుల ఎంపిక కోసం ఈ యాత్ర ఉపయోగపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన, వ్యవహార శైలి సరిగా లేకపోవడంతోనే విభజన హామీలు కొన్ని అమలు కాలేదన్నారు. ముందస్తు ఎన్నికలను తాము కోరుకోవడం లేదని, అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో 60 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ‘మిషన్–60’పేరుతో పనిచేస్తామని వివరించారు. కేసీఆర్‌వి పగటికలలు ఫామ్‌హౌజ్‌లో, ప్రగతిభవన్‌లో కూర్చుని కేసీఆర్ పగటికలలు కంటున్నాడన్నారు. అయితే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కేసీఆర్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని అధికారపార్టీ ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ ముందస్తు అనడం కాదు, ముందుగా ఎన్నికలు వస్తే కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి ప్రజలే ఎదురు చూస్తున్నారని అన్నారు. అన్ని మూస పార్టీల ప్రభుత్వాలను ఇప్పటిదాకా ప్రజలు చూశారని, మార్పు కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీని దీవించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై అన్నీ తప్పుడు లెక్కలు, అబద్ధాలు చెబుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించి, తమ గొప్పగా టీఆర్ఎస్ పేర్కొంటోందని ఆరోపించారు. కేంద్ర నిధుల దుర్వినియోగంపై టీఆర్ఎస్ చర్చకు సిద్ధమా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. -
13 తర్వాత మళ్లీ యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ చేపట్టిన జనచైతన్య యాత్ర మంచి ఫలితాన్ని ఇచ్చిందని పార్టీ కోర్‌కమిటీ అభిప్రాయపడింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతోందని, ఈ నెల 13న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన తర్వాత మళ్లీ యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ కోర్‌కమిటీ, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాత్ర అనుభవాలు, అమిత్‌షా పర్యటనపై ప్రధానంగా చర్చించారు. అమిత్‌షా పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కమలనాథులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో ఆ రోజున 7 నుంచి 8 వేల మంది శక్తి ప్రముఖ్‌లతో జరిగే సమావేశంతో పాటు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు నియమించిన పార్టీ హోల్టైమర్లను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు. అదే రోజున మళ్లీ కోర్‌కమిటీ, జనరల్ సెక్రటరీలతో సమావేశం జరుగుతుందని పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే..
సాక్షి, హన్మకొండ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ గల్లంతు కావటం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం జన చైతన్య యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట నుంచి మోగించిన యుద్ధభేరికి టీఆర్ఎస్ పార్టీ భయపడుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కాచెల్లెళ్లను ఆదుకునే బతుకమ్మ.. కవితమ్మ పాలైందని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు జన చైతన్య యాత్రకు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల మద్ధతుతో విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు. దళిత మేధావి అయిన బీఆర్ అంబేద్కర్‌ను రాజకీయంగా ఎదగనీయకుండా కాంగ్రెస్ నేతలు కుట్రలు చేసి ఓడించారని విమర్శించారు. బతుకమ్మ చీరలను ఛీత్కరించినట్లుగానే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపిస్తారని అభిప్రాయపడ్డారు. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వం అంటున్న టీఆర్ఎస్.. సొంత పార్టీ నేతల అవినీతి, బెదిరింపు రాజకీయాలను ముందు సరి చూసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో భవిష్యత్ ఇక పేద వారిదేనని, నరేంద్ర మోదీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉంటామని కె.లక్ష్మణ్ భరోసా ఇచ్చారు. -
తెలంగాణలో ఇంకా కుటుంబ పాలనే!
సాక్షి, తుంగతుర్తి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికాంలోకి వచ్చాక దేశంలో 40 ఏళ్ల కుటుంబ పాలనను పారదోలారు.. కానీ తెలంగాణలో ఇంకా కుటుంబ పాలనే సాగుతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగన బీజేపీ జన చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. తొలుత తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన జవదేకర్ కార్యకర్తలను ఉత్సహపరిచారు. ఆయన మాట్లాడుతూ.. ‘పంచపాండవులైన బీజేపీ ఎమ్మెల్యేలు.. 100 మంది ఉన్న టీఆర్ఎస్ కౌరవులతో యుద్ధం చేస్తే గెలుపు ఎవరిదో ఆలోచించండి. మోదీ 14 పంటలకు మద్దతు ధర పెంచడం ద్వారా రైతుల 50 ఏళ్ల కలను సాకారం చేశారు. పెంచిన ధరల ప్రకారం ఎకరా వరికి 6 వేల రూపాయలకు పైగా పెంపు వర్తిస్తోంది. తెలంగాణలో 24 గంటల కరెంటు రావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం. గతంలో ముడుపులు లేనిదే ఏ పని జరిగేది కాదు.. కానీ మోదీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 100 రూపాయలు పంపిస్తే ప్రజల వద్దకు 15 రూపాయలు చేరేవి. మోదీ వచ్చాక 100కు వంద రూపాయలు చేరుతున్నాయి. ఉజ్వల పథకం క్రింద తుంగతుర్తిలో 2000మందికి గ్యాస్ కనెక్షన్లు వచ్చాయని ఇక్కడి ప్రజలు చెప్పారు. గత ఎన్నికల్లో సంకినేని వెంకటేశ్‌కు టిక్కెట్ ఇవ్వలేకపోయాం. కానీ ఈ సారి వెంకటేశ్ ఘన విజయం సాధిస్తారు. టీడీపీతో మేం స్నేహంగానే ఉన్నప్పటికీ.. వాళ్లు మాకు వెన్నుపోటు పొడిచారు. ఇకముందు పొడుస్తారు. జనచైతన్య యాత్ర విజయవంతగా సాగుతోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లాగానే, బీసీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో అమోదిస్తే.. రాజ్యసభలో కొందరు అడ్డుకున్నారు. వచ్చే సమావేశాల్లో ఈ బిల్లును పాస్ చేస్తాం. జన చైతన్య యాత్ర ఇంతటితో ఆగిపోదు.. సంవత్సరమంతా కొనసాగుతోంది. ఈ యాత్రతో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తోంద’ని తెలిపారు. -
కేసీఆర్ పాలనలో దగా
హన్మకొండ: వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పంట ఉత్పత్తులకు పెద్ద ఎత్తున మద్దతు ధర ప్రకటించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన జనచైతన్య యాత్ర బహి రంగసభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో దగా పడిన తెలంగాణ ప్రజలకు అండగా ఉండేందుకు జన చైతన్యయాత్ర చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో గరీబోళ్ల రాజ్యం తీసుకురావడానికి అన్ని వర్గాల ప్రజలు కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కంచుకోటలు, కమ్యూనిస్టుల ఎర్రకోటలు బద్దలయ్యాయని, ఇక టీఆర్ఎస్ గడీలు బద్దలు కావాలన్నారు. రామమందిరం నిర్మాణం ఆకాంక్ష నెరవేరాలన్నా, మజ్లిస్ ఆగడాలు ఆగాలన్నా ప్రజలు బీజేపీతో కలసి రావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే కొలువులు వస్తాయని, ఇంటికో ఉద్యోగం లభిస్తుందని, కేజీ టూ పీజీ విద్య అందిస్తామని, దళితులకు మూడెకరాల భూమి కొనిస్తామని, పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని చేసిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసమే మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు చేపట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేంద్రం 1.88 లక్షల ఇళ్లు కేటాయిస్తే.. ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా పేదలను వంచించారని దుయ్యబట్టారు. ప్రజలు తాగు, సాగునీరు కావాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఊరూ రా బెల్టు షాపులు పెట్టి కుటుంబాల్లో అశాంతిని రేకెత్తిస్తోందని విమర్శించారు. రైతు సమస్యలకు రైతుబంధు పరిష్కారమే అన్నట్లు విస్తృత ప్రచారంగా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ముందస్తు..: రాంమాధవ్ ప్రధాని మోదీ దెబ్బకు కొట్టుకుపోతామని భయపడి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముం దస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందని బీజేపీ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఏ పార్టీకి కూడా మోదీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేదన్నారు. ఫ్రంట్లు, స్టంట్లు ఏమి చేయవన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. మోదీకి ఏ స్ట్రోక్ బాధ లేదని, కేసీఆర్‌కు సన్‌స్ట్రోక్.. సన్ ఇన్లా స్ట్రోక్.. డాటర్ స్ట్రోక్ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు దేశంలో గత్యంతరం లేదని, ప్రాంతీయ పార్టీల ఎదుట అతి పెద్ద జూనియర్ పార్టీగా మారిం దని విమర్శించారు. ఇక భవిష్యత్ బీజేపీదేనన్నారు. 2022 నాటికి దేశంలోని ప్రతి పేదవాడు పక్కా సొంతిళ్లు కలిగి ఉండాలన్నదే ప్రధాని ఆకాంక్ష అని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను స్వాతంత్య్రం దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రజలు కోరుతుంటే.. టీఆర్ఎస్ మాత్రం స్వాతంత్య్ర ఉత్సవం లేదు, ఒక్క ఒవైసీ ఉత్సవం ఉంటే చాలన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దొంగలంతా టీఆర్ఎస్లో చేరారని, కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం ఫుల్‌టైమ్ మిషన్‌ను కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. -
పేదరిక నిర్మూలన మోదీతోనే సాధ్యం
వరంగల్ రూరల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం రాక ముందు..వచ్చాక ఎలాంటి మార్పు రాలేదని, తెలంగాణాలో కానీ దేశంలో కానీ పేదరిక నిర్మూలన జరగాలంటే ఒక్క మోదీతోనే సాధ్యం తప్ప టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో కాదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు. జనచైతన్య యాత్రలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిందని, అయినా కూడా ఇక్కడి ప్రజలు పనుల నిమిత్తం ముంబై వెళ్లాల్సి వచ్చిందంటే.. ఈ ప్రాంతాన్ని ఎలా అణగదొక్కారో అర్ధం అవుతుందన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా..పంటకు మద్ధతు ధర ప్రకటించి.. నా ద్వారా మోదీ ఇక్కడి ప్రజలకు సందేశం పంపించారని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో పట్టణాల్లో ఉన్న ప్రజలు జీవిస్తున్నట్లుగా.. రైతులు కూడా ఉండాలని అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబంలో ఏ ఎక్కరైనా అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరస్థితి ఏర్పడుతుందని.. ఆ పరిస్థితి మారేందుకు ఆయుష్మాన్ భవ పథకం తీసుకురాబోతున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఇక్కడి ప్రభుత్వం కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితి మారాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. వరంగల్‌తో జనసంఘ్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే..ఈ జిల్లాకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఇప్పించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం వరంగల్ ప్రజలు ముందుంటారు కాబట్టి మీరంతా బీజేపీ జెండా పట్టుకుని మద్ధతుగా నిలవాలని కోరారు. తాను ఇక్కడ పుట్టనప్పటికీ..తనను ఈ తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపి మంత్రిని చేసినందుకు మీకు రుణపడి ఉంటానని తెలిపారు. -
కౌలు రైతులకు పెన్షన్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ప్రకటించారు. అలాగే పంట రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ జన చైతన్య యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల మాదిరిగా పంటలకు మద్దతు ధర విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. కేసీఆర్ సర్కారు మజ్లిస్ ఎజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు. రామ మందిర నిర్మాణంపై సీఎం కేసీఆర్ తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసింది.. నూతన పెన్షన్ విధానం సీపీఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసింది వాస్తవం కాదా ? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇప్పుడు సీపీఎస్ కేంద్రం పరిధిలోని అంశమంటూ ఉద్యోగులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. టీచర్ల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయ డం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను అన్యా యం చేశారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ సర్కారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్న లక్ష్మణ్, చివరకు బతుకమ్మ చీరల్లో కూడా రూ.200 కోట్ల అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఫాం హౌస్ నుంచి పాలన చేస్తున్న సీఎం కేసీఆర్, ప్రగతిభవన్‌లో పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు, కబ్జాకోరులను తన పంచన చేర్చుకుని.. రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులను కించపరుస్తున్నారని నిప్పులు చెరిగారు. రైతు సమన్వయ సమితుల్లో టీఆర్ఎస్ నాయకులకు పదవులు కట్టబెట్టి రైతులను కించపరుస్తున్నారన్నారు. ఎంపీ కవిత మాట తప్పారు.. నిజామాబాద్ ఎంపీ కవిత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని లక్ష్మణ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. బీడీ కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. గల్ఫ్ బాధితులకు కేంద్రం అండగా నిలుస్తోందని, వారిని స్వస్థలాలకు రప్పించడంలో ప్రత్యేక చొరవ చూపు తోందని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్, పార్టీ నేతలు లోక భూపతిరెడ్డి, పల్లె గంగారెడ్డి, ధర్మపురి అర్వింద్ ఈ సభలో పాల్గొన్నారు. -
‘గడీల పాలన కూల్చి.. రామ రాజ్యం స్థాపిద్దాం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో కలపాలని చూసిన నిజాం నవాబును సీఎం కేసీఆర్ పొగుడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ చేపట్టిన జనచైతన్య యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచుకుంద్ద మార్కెట్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిజాంను పొగుడుతుంటే ఆయన కూతురు కవిత అసలు తెలంగాణ భారత భూభాగమే కాదని అంటున్నారని తెలిపారు. భారత దేశంలో ఉంటు జైహింద్ అనని ఒవైసీతో కేటీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. దేశ ద్రోహుల పాలన కావాలా.. దేశ భక్తిగల బీజేపీ పాలన కావాలా మీరే నిర్ణయించుకోండని ప్రజలకు సూచించారు. ‘పేదవాడైన ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన చూసి ఓర్వలేక కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్నారు. ఈ గడీల రాజ్యాన్ని కూల్చీ గరిబోళ్ల రాజ్యం వచ్చేలా అందరూ సహకరించాలి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెపితే.. దానిని అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు కుట్రలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రామరాజ్యం స్థాపిస్తాం. బీజేపీ అధికారంలోకి రాగానే కౌలు రైతు చట్టాన్ని పునరుద్ధరిస్తాం. కేవలం భూస్వాములకు లబ్ధి చేకుర్చాలనే రైతు బంధు పథకం తెచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. -
కేసీఆర్.. ఇలా ఉలిక్కిపడితే ఎలా?
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వారి పథకాల మీద నమ్మకం లేకనే ఇతర పార్టీ నేతలను కొంటున్నారని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. జనచైతన్య యాత్రలో భాగంగా ఇబ్రహింపట్నం చేరిన ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ‘బీజేపీ కార్యకర్తల బలం చూసి కేసీఆర్ ఓర్వలేక పోతున్నారు. అందుకే రెండు గంటలకు పైగా ప్రెస్ మీటింగులు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ప్రజాకోర్టులో టీఆర్ఎస్ని నిలబెట్టేందుకే బీజేపీ జనచైతన్య యాత్రను చేపట్టింది. బోగస్ సర్వేలతో 100 సీట్లు గెలుస్తామని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ని మట్టికరిపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష కోట్ల రూపాయలు పక్క దారి పట్టించారు. వాటితో ఇతర నేతలను కొంటున్నారు. బీజేపీ చేపట్టిన యాత్రను చూసి కేసీఆర్ ఉలిక్కిపడ్డారు. మూడు రోజుల యాత్రకే ఇలా ఉలిక్కిపడితే ఎలా.. మున్ముందు ఉంది ముసళ్ళ పండుగ. కేసీఆర్‌ను తరిమికోట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది బీజేపీ యాత్ర కాదు, ప్రజల తరుపున ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా.. అని సవాలు చేస్తున్న ముఖ్యంమంత్రి ముందుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి మా సత్తా ఎంటో చూపిస్తాం. ప్రగతిభవనకు బందీ అయిన కేసీఆర్ నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. రోడ్లకు గుంతలు పడినట్లు సమాచారం ఇస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పిన కేటీఆర్.. ప్రస్తుతం ఉన్న రోడ్లు చూస్తే రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఇచ్చినా సరిపోదు. కమీషన్ల్ కోసమే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. 1300 కోట్ల రూపాయలు పెద్దవారి ఇళ్లకు ఇస్తే వాటి పేరు మార్చి.. ఎర్రవల్లిలో 10 ఇళ్లు మాత్రమే కట్టించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేంద్రం ఒక్క కుటుంబానికి 12 వేల రూపాయలు ఇస్తే వాటిని ఉపయోగించడం లేదు. కాంగ్రెస్ వంచన చేరి మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్, చంద్రబాబు కర్ణాటకలో విషప్రచారం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ విజయయాత్ర చేస్తుంది. కర్ణాటకలో జరిగినట్లు తెలంగాణలో కూడా అపవిత్ర కూటమి ఏకం కాబోతోంది. కాంగ్రెస్ ఎన్ని బస్సు యాత్రలు చేసిన ఆ పార్టీ గాలి పోతోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. చెన్నారెడ్డి గూడెంలో మరణించిన రైతు కుటుంబాలను ఆదుకుని వారికి పరిహారం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. -
రెండు లక్షల రుణమాఫీ చేస్తాం
సాక్షి, నల్గొండ : కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బతుకమ్మ పండుగ ఇప్పుడు కవితమ్మ పండగగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం అసువులు బాసిన బీజేపీ కార్యకర్త మైసయ్య ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి అని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి అమరుడైతే, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఏలుతోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కమీషన్ కోసమే మిషన్ కాకతీయ, భగీరథ చేపట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్, ఆయన మంత్రులు ఉస్మానియాలో అడుగుపెట్టాలంటే వణుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ శవాలతో రాజకీయాలు రకం అంటూ లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. భారత దేశాన్ని తమ కుటుంబమే ఏలాలని నెహ్రూ కుటుంబం చూస్తోందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మోడీని చూసి ఓర్వలేక పోతోందని, కావాలనే ప్రధాని కులం, తినే ఆహారం పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మోడీ విజయాల జైత్రయాత్ర సాగితే తమ ఉనికి పోతోందని కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు బయపడుతున్నాయని విమర్శించారు. ఫ్లోరైడ్ బాధితులు ఇబ్బందిపడున్నా కేసీఆర్ పట్టించుకోకుండా ఉన్నారని, ఫ్లోరైడ్ నిర్మూలణకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం 350 కోట్లు ఇస్టే వాటిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ, ఒక్క టీచర్ నియామకాలను చేపట్టలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క మహిళకు చోటు ఇవ్వలేదంటే మహిళలపై ఉన్న గౌరవం ఎంటో అర్థం అవుతోందన్నారు. సుకన్య సంవృద్ధి యోజన కింద కోట్ల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. తల్లి పడ్డ కష్టాలు చూసిన మోదీ ఏ మహిళా కష్టాలు పడకూడదని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని వెల్లడించారు. జనచైతన్య యాత్ర టీఆర్ఎస్ పతనానికి నాంది పలుకుతోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చిన 350 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేశారో టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో మొక్కల పెంపకానికి ఇచ్చిన 47 కోట్ల రూపాయలు ఏమయ్యాయని లక్ష్మణ్ నిలదీశారు. ఎన్నికల కోసమే రైతు బంధు పథకం కేసీఆర్ తెచ్చారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదని, ఊరు ఉరా బార్లు తెరిచి ఆదాయం పొందుతున్నారని దయ్యబట్టారు. జిల్లాకు ఇచ్చిన 543 కోట్ల రూపాయలు లెక్కలేకుండా పోయాయని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వమన్న లక్ష్మణ్, అధికారంలోకి వస్తే రైతులకు రూ 2లక్షల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిరైతుకు చితంగా బోర్లు వేయిస్తామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీని కూడా బీజేపీ కడుతుందని అన్నారు. -
మాకోసారి అవకాశం ఇవ్వండి
-
మాకోసారి అవకాశం ఇవ్వండి
సాక్షి, యాదాద్రి : ‘ఎవరెవరికో అధికారం ఇచ్చారు. తెలంగాణలో ఈసారి మాకు అవకాశం ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మార్పుకోసం పేరిట శనివారం బీజేపీ జన చైతన్యయాత్రను యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభించారు. ముందుగా పార్టీ నాయకులు యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి సన్నిధిలో పూజలు చేశారు. అనంతరం గుట్ట నుంచి భువనగిరికి ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమే తమ పార్టీ జన చైతన్యయాత్రను ప్రారంభించిందన్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు, మోదీ పాలనలో విజయాలు, కేంద్ర పథకాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో దగా పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో నవ్వులపాలవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రానికి కోట్లాది నిధులను మంజూరు చేసిందని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే ప్రారంభమైందన్నారు. అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం ప్రకటించిందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కేసీఆర్, చంద్రబాబుల తర్వాత వారి పార్టీల ఉనికి ప్రశ్నార్థకమన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల రక్తాన్ని కాంట్రాక్టర్లు జలగల్లా తాగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ టీఆర్ఎస్లోకి బదిలీ అయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నీతివంతమైన పాలన అందిస్తున్నారన్నారు. బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మజ్లిస్ చెప్పుచేతల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. టీఆర్ఎస్ నుంచి అధికారాన్ని తమకు ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తామన్నారు. సమా వేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ నాయకులు పేరాల చంద్రశేఖర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బాటలోనే టీఆర్ఎస్ పనిచేస్తోంది: కిషన్ రెడ్డి
సాక్షి, భువనగిరి(యాదాద్రి): బడుగు బలహీన వర్గాలను, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ బాటలోనే టీఆర్ఎస్ పనిచేస్తుందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మార్పు కోసం బీజేపీ జనచైతన్య యాత్ర కార్యక్రమంలో బాగంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మతోన్మాద పార్టీ ఎంఐఎంను పోషిస్తోందని అన్నారు. ఎంఐఎం నేతలు కనిపిస్తే టీఆర్ఎస్ నేతలు వంగి వంగి సలామ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు అన్ని పార్టీలకు ఓటు వేశారు.. ఇప్పుడు బీజేపీకి ఓటువేసి మార్పు తీసుకురండని ప్రజలని కిషన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణాను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. కేసీఆర్ కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. -
జనచైతన్య యాత్రకు బీజేపీ సిద్ధం
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలను వివరించేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన జన చైతన్యయాత్ర ప్రారంభ సభకు జిల్లా నాయకులు సర్వం సిద్ధం చేశారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జన చైతన్యయాత్ర ప్రారంభోత్సవ సభ జిల్లా కేంద్రమైన భువనగిరిలో నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా కార్యవర్గం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం 2.30గంటలకు బీజేపీ నేతలు యాదగిరిగుట్టకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం 3గంటలకు భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందులో భాగంగా స్థానిక ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. అంబేద్కర్ చౌరస్తాలో కోలాటం, లంబాడీ నృత్యాలతో ర్యాలీగా కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. వివేకానందుడి విగ్రహం వద్ద హారతి, బోనాలు, బతుకమ్మలతో నేతలందరికీ స్వాగతం పలుకుతారు. తొలి బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. 8వేల నుంచి 10వేల వరకు జనం వస్తారని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ రాక జనచైతన్యయాత్ర ప్రారంభోత్సవ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా బహిరంగ సభలో పాల్గొనవచ్చని బీజేపీ నాయకులు అంటున్నప్పటికీ ఇంకా ఖరారు కాలేదు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, శాసనసభాపక్ష బీజేపీ నేత కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వంటి పలువురు నేతలు సమావేశానికి హాజరవుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌రావు తెలిపారు. ఏర్పాట్ల పరిశీలన జూనియర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించే బీజేపీ జన చైతన్యయాత్ర సభాస్థలిని జిల్లా కార్యవర్గం శుక్రవారం పరిశీలించింది. జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు ఆధ్వర్యంలో సభా వేదికతో పాటు సభకు హాజరయ్యే జనానికి అవసరమయ్యే ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి వేముల నరేందర్‌రావు, నాయకులు వేముల అశోక్, నర్ల నర్సింగరావు, పడమటి జగన్మోహన్రెడ్డి, కోళ్ల భిక్షపతి, కురాం పరమేశ్, సూరకంటి రంగారెడ్డి, పంచెద్దుల బలరాం, రత్నపురం బలరాంలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
సాక్షి, నిజమాబాద్ : జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, 100 మంది యువకులు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు నాగదేశి రవికుమార్, పుల్లారెడ్డి, సంజీవ రావ్, బొడ్డు సాయినాథ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట రమణ సమక్షంలో వారు పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. తెలంగాణలో వైఎస్సార్సీపీ బస్సు యాత్ర చేపట్టనుందని వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా.. జూన్ మొదటి వారంలో చేవెళ్ల నుంచి జన చైతన్య బస్సు యాత్రను చేపట్టనున్నట్టు నేతలు తెలిపారు. ఈ బస్సు యాత్ర 54 నియోజకవర్గాలో కొనసాగుతుందని వారు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ప్రజలకు వివరిస్తామన్నారు. మాటల గారడీ చేస్తున్న సీఎం కేసీఆర్.. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ నిలబెట్టుకోలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి విషయంలో కూడా సీఎం వారికి అన్యాయం చేశాడని విమర్శించారు. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ నీరుగార్చారని వారు పేర్కొన్నారు. -
నోట్ల రద్దుతో నేతల విలవిల
► ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజాప్రతినిధులు ► అర్ధంతరంగా నిలిపివేసిన జనచైతన్యయాత్రలు ► అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు సైతం దూరం విశాఖపట్నం : పెద్ద నోట్ల రద్దు దెబ్బకు అధికార పార్టీ నేతలు విలవిల్లాడిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు ఏదో రూపంలో నిత్యం ప్రజల్లో ఉండే టీడీపీ నేతలు ప్రస్తుతం పూర్తిగా ఇళ్లకే పరిమితమై పోతున్నారు. మంత్రులు సైతం ప్రజల్లో తిరగలేక గెస్ట్‌హౌస్‌లను విడిచిపెట్టడం లేదు. ఏరోజుకారోజు పెరుగుతున్న నోట్ల కష్టాలతో పెల్లుబికుతున్న వ్యతిరేకతను ఎదర్కోలేక ముఖం చాటేస్తున్నారు. పెద్దనోట్లు రద్దు ప్రకటన వెలువడి 40 రోజులైంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ నిర్ణయాన్ని సానుకూల స్పందన రావడంతో మాకు ఇక తిరుగులేదని మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు జబ్బలు చరిచారు. ఆరంభంలో ఎక్కడకెళ్లినా నల్లకుబేరులను ఎరివేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని.. నల్లధనం వెనక్కి రప్పించాలంటే ఇలాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఊరువాడా చెప్పుకొచ్చారు. కానరాని యాత్రలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహోద్యమంలో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్‌కు పోటీగా తలపెట్టిన జన చైతన్య యాత్రల పేరిట ఆరంభంలో హడావుడి చేశారు. సెప్టెంబర్‌లో గ్రామగ్రామాన యాత్రల పేరిట హల్చల్ చేసిన టీడీపీ నేతలు నవంబర్‌లో రద్దు ప్రకటన వెలువడిన తర్వాత నెమ్మదించారు. నవంబర్ 15వ తేదీ వరకు అడపదడపా యాత్రలు చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం వాటికి స్వస్తి చెప్పారు. ఆరంభంలో పెద్ద నోట్ల రద్దుకు వచ్చిన సానుకూలత ఆవిరైపోయింది. పైగా రోజు రోజుకు నోట్ల కష్టాలు పెరుగుతూ వచ్చాయి. చిల్లర నోట్లు దొరక్క.. రూ.2వేలు నోటు మార్చుకునే దారిలేక తొలి పదిహేను రోజులు అష్టకష్టాలు పడ్డారు. ఆ తర్వాత జీతాలు జమైనప్పటికీ చేతికి సొమ్ములందక కష్టాలు రెట్టింపయ్యాయి. దెబ్బతిన్న వ్యాపారాలు సామాజిక పింఛన్‌దారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నగదు కొరత కారణంగా ప్రజలు పొదుపు మంత్రాన్ని జపించడంతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సంక్రాంతి ముందు నెల కావడంతో డిసెంబర్లో జోరుగా సాగాల్సిన అమ్మకాలు మచ్చుకైనా కన్పించకపోవడంతో చాలా వ్యాపార సంస్థలు దివాళా తీసే పరిస్థితికి చేరాయి. మరో పక్క నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి బారులుతీరి నిల్చోవల్సిన పరిస్థితులు ఏర్పడడంతో ప్రజలు పనిపాటలను మానుకొని పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు నోట్ల కష్టాలతో కాలం గడిచిపోతుంది. మరో వైపు వాస్తవాలను పట్టించుకోకుండా నగదు రహిత లావాదేవీలంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊదరగొట్టేస్తుండడం ప్రజలు జీర్ణీంచు కోలేకపోతున్నారు. దీంతో తొలుత పెద్దనోట్ల రద్దు నిర్ణయం, నగదు రహిత లావాదేవీలపై ఎక్కడపడితే అక్కడ మాట్లాడే అధికార పార్టీ నేతలు నేడు పెదవి విప్పేందుకు కూడా సాహసించలేకపోతున్నారు. 50 రోజుల్లో కష్టాలన్నీ తొలగిపోతాయని కేంద్రం ప్రారంభంలో ప్రకటించింది. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మరో రెండు మూడు నెలలైనా ఈ కష్టాలు తీరే అవకాశాలు కనుచూపు మేరలో లేకపోవడంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. చీటికిమాటికి జిల్లాకు రావడం.. సమీక్షలు, సమావేశాలు, అభివృద్ధి, శంకుస్థాపనలంటూ హడావుడి చేసే మంత్రులు సైతం గడిచిన నెల రోజులుగా ముఖం చాటేశారు. ఉంటే హైదరాబాద్‌లో లేదా.. వైజాగ్ వస్తే ఇళ్లకు పరిమితమవడం తప్ప ప్రజల్లో తిరిగలేకపోతున్నారు. గడిచిన 40 రోజుల్లో విశాఖ ఎంపీ హరిబాబు ఒకటి, రెండుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. అంతర్గత సంభాషణల్లో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు నోట్ల రద్దు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాత్తు బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు నోట్ల రద్దు వల్ల తానే స్వయంగా తీవ్ర అసహానికి లోనయ్యాయని వ్యాఖ్యానించడం.. ఆ తర్వాత ఎక్కడా జనంలో కన్పించకపోవడం గమనార్హం. వారానికోసారి వచ్చే సీఎం కూడా గడిచిన 40 రోజుల్లో రెండుసార్లు మాత్రమే జిల్లాకు రావడం..పైగా ఎక్కడా నగదు కష్టాలపై పెద్దగా మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాల ఆందోళన బాట మరో పక్క నోట్ల కష్టాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ, వామపక్ష నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 22న వామపక్ష నేతలు బ్యాంకుల ఎదుట సత్యాగ్రహదీక్షలు చేయనున్నారు. ప్రజలు ఇక్కట్లను పట్టించుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ప్రతిపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. -
జన చైతన్య యాత్ర పేరిట దాడులు చేసిన టీడీపీ
-
జనాల్ని చితగ్గొట్టారు
జన చైతన్య యాత్ర పేరిట దాడులు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, అనుచరులు నరసాపురం రూరల్: పోలీసుల సాయంతో మగవాళ్లను గృహ నిర్బంధం చేశారు. అనంతరం అధికార ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చెల రేగిపోరుున రౌడీలు మహిళలపై దాష్టీకానికి తెగబడ్డారు. ముగ్గురు మహిళల్ని తీవ్రంగా గాయపరిచారు. విధ్వంసం సృష్టించి.. చివ రకు అదంతా ప్రజలే చేశారంటూ తప్పుడు కేసులు బనారుుంచారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కె.బేతపూడిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మంగ ళవారం సాయంత్రం జన చైతన్య యాత్ర నిర్వహించేందుకు కె.బేతపూడికి చేరుకున్నా రు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మా ణాన్ని ఆ గ్రామస్తులంతా వ్యతిరేకి స్తుండటంతో ఈ సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి గ్రామంలోని పురుషులందరినీ పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల పహారా నడుమ గ్రామంలో శిలా ఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఎమ్మెల్యేను నిలదీసేందుకు ప్రయత్నించగా.. మాధవ నాయుడు అనుచరులు, వారితో వచ్చిన రౌడీమూకలు పోలీసుల సమక్షంలోనే మహళలపై దాడికి తెగబడ్డారు. సుమారు అరగంట పాటు విధ్వంసం సృష్టించారు. రౌడీమూకల దాడిలో సముద్రాల సత్యవాణి, పాలి లక్ష్మి తీవ్రంగా గాయపడగా, బెల్లపు వరలక్ష్మి అనే మహిళకు స్వల్ప గాయాలయ్యారుు. గాయపడిన మహిళలను నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళలపై దాడి చేసిన రౌడీ మూక లను వదిలేసి, గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. -
జన చైతన్య యాత్రలో బాబు ముఖాముఖి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ గ్రౌండ్స్‌లో టీడీపీ కార్యకర్తలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. కార్యకర్తలు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. పెన్షన్లు, నీరు-చెట్టు, ఇంకుడు గుంతలు, మరుగు దొడ్ల నిర్మాణ బిల్లులు అందడం లేదని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 225 కు పెరుగుతాయని చంద్రబాబు చెప్పారు. -
చీరాలలో జన చైతన్య చిచ్చు
• టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు • ఆమంచికి పోటీగా జన చైతన్య యాత్రలు ప్రారంభించిన మరోవర్గం • అనుమతి లేదంటూ సునీత, పాలేటి వర్గీయులను అడ్డుకున్న పోలీసులు • కొనసాగిస్తే కేసులు పెడతామంటూ హెచ్చరిక • తామూ ప్రజాప్రతినిధులమేనంటూ నేతల వాగ్వాదం • పట్టు వీడకుండా గ్రామాల్లో యాత్రల నిర్వహణ • ఎమ్మెల్యే ప్లెక్సీలు చించి వేసిన ఆగంతకులు చీరాల : అంతర్గత కుమ్ములాటలతో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు బజారుకెక్కుతున్నారు. విభేదాలు రచ్చకెక్కడంతో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ చీలికలు,పీలికలైంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఒంగోలు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులను చక్కదిద్దుతారని అంద రూ భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. చీరాలలో సీఎం జిల్లా పర్యటన ముగించుకు వెళ్లిన రెండోరోజే పార్టీ నేతల్లో చిచ్చు రేగింది. ఆది నుంచి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను వ్యతిరే కిస్తున్న పోతుల సునీత, పాలేటి రామారావు వర్గీయులు జన చైతన్యయాత్రలను వేదికగా మలుచుకుని పోటీ ప్రచారం ప్రారంభించారు. ఓవైపు ఎమ్మెల్యే జన చైతన్యయాత్రలను ప్రారంభించి, నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తుండగా గురువారం రెండో వర్గం చీరాల మండలంలోని ఈపూరుపాలెం, విజయనగర్ కాలనీ పంచాయతీల్లో ఆయనకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. పార్టీ సూచన మేరకే యాత్ర.. మాజీ జడ్పీటీసీ సభ్యుడు చంద్రమౌళి, ఈపూరుపాలెం సర్పంచ్ జి.సరోజిని ఇంటి నుంచి జన చైతన్యయాత్రను ప్రారంభించగా సమాచారం తెలుసుకున్న ఈపూరుపాలెం ఎస్సై డి.ప్రసాద్, పోలీసులు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే మాత్రమే జనచైతన్య యాత్రలు చేసుకోవచ్చని, మీరు సొంతగా యాత్రలు చేయాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్సై చెప్పారు. దీనిని రెండోవర్గం వ్యతిరేకించింది. తామంతా ప్రజాప్రతినిధులమని, తమకు జిల్లా పార్టీ పదవులు ఉన్నాయని ఎంపీపీ గవిని శ్రీనివాస్, జడ్పీటీసీ మెంబర్ పృథ్వీ అరుణ, సర్పంచ్ పృథ్వీ ఛాందినీ, ఎంపీటీసీలు, పలు గ్రామాల సర్పంచ్‌లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జన చైతన్యయాత్ర నిర్వహించుకోమని తమ పార్టీ ఆదేశించిందని స్పష్టం చేశారు. వాదోపవాదాల మధ్య ఈపూరుపాలెం పంచాయతీ కార్యాలయం వరకు యాత్రను నిర్వహించారు. విజయనగర్ కాలనీలో ముందస్తు యాత్ర.. అలాగే విజయన గర్ కాలనీలో చేపట్టిన జనచైతన్య యాత్రను టూటౌన్ పోలీసులు అడ్డుకున్నారు. విజయనగర్‌కాలనీలో శుక్రవారం ఎమ్మెల్యే జనచైతన్య యాత్రను నిర్వహించాల్సి ఉండగా గురువారం రాత్రే ఆమంచి వ్యతిరేకవర్గం నిర్వహించడం విశేషం. గతంలో ఈగ్రామంలో ఇరువర్గాలు దాడులు చేసుకుని శాంతిభద్రతలకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా యాత్ర కొనసాగిస్తే కేసులు పెడతామని టూటౌన్ సీఐ ఫిరోజ్ హెచ్చరించి యాత్రను అడ్డుకున్నారు. ఈ చైతన్య యాత్రలో ఎంపీపీ గిని శ్రీనివాస్, జడ్పీటీసీ అరుణ, సర్పంచ్‌లు చాందినీ, సరోజిని, రూపవతి, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు మస్తాన్, వార్డు సభ్యులు, గ్రామ టీడీపీ నాయకులు ఉన్నారు. ప్లెక్సీల చించివేత.. చీరాల పట్టణంలోని 8వ వార్డులోని లూథరన్ బ్రాంచి చర్చి వద్ద జన చైతన్య యాత్రల నేపథ్యంలెఓ ఆమంచి ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గురువారం రాత్రి ఆగంతకులు చింపివేశౠరు. ఈ ఘటన పార్టీలో విభేదాలకు అద్దం పడుతోంది. -
అడుగడుగునా నిలదీత
శ్రీకాకుళం : ప్రభుత్వ పథకాలపై గ్రామస్థాయిలో ప్రచారం చేసేందుకు తెలుగుదేశం చేపట్టిన జనచైతన్య యాత్రలకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ యాత్రల్లో పాల్గొన్న నేతలను ప్రజలు అడుగడుగునా నిలదీశారు. సంక్షేమ పథకాల అమలులో వివక్షపై పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన టెక్కలిలోని పెదరోకళ్లపల్లిలో గ్రామస్తులు జనతచైతన్య బృందాన్ని నిలదీశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును విమర్శించారు. రేషన్ దుకాణాల్లో వేలిముద్ర వ్యవస్థ సక్రమంగా సరుకులు అందడం లేదని మండిపడ్డారు. పాఠశాల లోపలి నుంచి మురుగు కాలువ తవ్వడంపై ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సర్పంచ్ భర్త ధర్మారావుతో వాగ్వాదానికి దిగారు. నరసన్నపేట నియోజకవర్గంలోని వనవిష్ణుపురంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని గ్రామస్తులు నిలదీశారు. నౌతలలో ప్రజల నుంచి స్పందన లేకపోగా తామరాపల్లిలో సీఐ, ఎస్ఐల పర్యవేక్షణలో యాత్ర కొనసాగింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో శాసనసభ్యుడు కిమిడి కళా వెంకటరావు గైర్హాజరు కాగా ఆయన కుమారుడు మల్లిక్ హాజరయ్యారు. పాతపట్నం నియోజకవర్గంలో జరిగిన జనచైతన్య యాత్రలకు ఆ పార్టీ ముఖ్య నాయకులు డుమ్మా కొట్టారు. పలాస నియోజకవర్గంలోని మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో ప్రజల నుంచి స్పందన కరువైంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. పాలకొండ నియోజకవర్గంలోని వెలగవాడలో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. పీఆర్ రాజుపేటలో జరిగిన కార్యక్రమంలో ఓ వృద్ధురాలు తనకు పింఛను ఇవ్వడం లేదని అధికారులను నిలదీసింది. రాజాం నియోజకవర్గంలోని బుచ్చిం పేట, ఆగూరులో ఇళ్లు మంజూరు చేయకపోవడంపై పలువురు మహిళలు ఎమ్మెల్సీ ప్రతిభాభారతిని ప్రశ్నించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో జనచైతన్య యాత్రలకు విప్ రవికుమార్ గైర్హాజరయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి మునిసిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో జరిగిన జనచైతన్య యాత్రను ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ప్రారంభించారు. -
టీడీపీ జనచైతన్యయాత్రకు చుక్కెదురు!
కడప: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలు చేపట్టిన జనచైతన్య యాత్రకు వైఎస్ఆర్ కడప జిల్లాలో చుక్కెదురైంది. జనచైతన్య యాత్రలో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి ఎమ్మెల్యే జయరాములు వెళ్లారు. రామేశ్వరం గ్రామస్తులు మాత్రం ఎమ్మెల్యే జయరాములును తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకుని నిరసన వ్యక్తంచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు పూర్తికావస్తున్నా తమ తాగునీటి సమస్య తీర్చలేదని రామేశ్వరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ సభ్యత్వం రెన్యువల్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నారు. అయితే పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ స్థలాలు వాడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం రామేశ్వరం గ్రామస్తులు తాగునీటి సమస్యలపై విన్నవిస్తున్నా నేతలు ఏ మాత్రం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు, స్థానికులకు అక్కడ కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. కొన్ని రోజుల్లో తప్పకుండా సమస్యలు తీర్చుతామని హామీ ఇవ్వడంతో చివరికి గ్రామస్తులు శాంతించారు. -
టీడీపీ నేతలలో జనచైతన్య యాత్ర టెన్షన్!
-
తెలుగు తమ్ముళ్ల తన్నులాట
విజయవాడ: కృష్ణా జిల్లాలో టీడీపీ రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన ఆదివారం నూజివీడు మండలం జంగంగూడెంలో చోటుచేసుకుంది. జంగంగూడెంలో అధికార టీడీపీ చేపట్టిన జనచైతన్య యాత్ర వేదికగా టీడీపీ నేతలు వల్లభనేని భాస్కర్, పొట్లురి రవి వర్గీయులు పరస్మరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల నేతల కొట్లాటలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని నూజివీడులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అధికార మత్తులో జోగుతున్న టీడీపీ ప్రజాప్రతినిధులు
అధికార మత్తులో జోగుతున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల కళ్లు బైర్లు కమ్మేలా జిల్లాలో జన చైతన్యం వెల్లివిరుస్తోంది. ఎంతగా అంటే.. ఎమ్మెల్యేలను వెంటపడి తరిమేలా, నాయకులపై ఎక్కడికక్కడ తిరగబడేలా జనాగ్రహం వెల్లువెత్తింది. 18 నెలల టీడీపీ పాలనలో ఒరిగిందేమీ లేదన్న వాస్తవంతోపాటు ఎన్నికల హామీలు నమ్మి నయవంచనకు గురయ్యామన్న ఆగ్రహం ప్రజల్లో కట్టలు తెంచుకుంటోంది. అందుకే జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలపై అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే పేరుతో తెలుగుదేశం పార్టీ ఈ నెల 1నుంచి 14వ తేదీ వరకు జనచైతన్య యాత్రలు నిర్వహిస్తోంది. ఏడాదిన్నర కాలంలో రైతులు, మహిళలు, యువకులు, శ్రామికులు.. ఇలా ఏ ఒక్కవర్గానికీ న్యాయం జరగకపోవడంతో జనం ఎక్కడికక్కడ నేతలను నిలదీస్తున్నారు. ముఖ్యంగా రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, పింఛన్లు, ఇళ్లస్థలాలు, స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రజలు టీడీపీ నేతలను, ప్రజాప్రతినిధులను నిలదీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. చేతికి వచ్చిందనుకున్న ఖరీఫ్ పంట అకాల వర్షాలతో దెబ్బతిన్నా పాలకులు కనీస కనికరం చూపించకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎన్నికల తర్వాత ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులకు జనచైతన్య యాత్రలో అడుగడుగునా ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. సీఎం చంద్రబాబునాయుడు నియోజకవర్గాల్లో పర్యటనకు వచ్చినప్పడు, ఎప్పుడైనా మీడియాలో కవరేజీ కోసం ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప గ్రామాలు, డివిజన్లలో కానరాని ఎమ్మెల్యేలు జనచైతన్య యాత్రల కోసం మాత్రం బయటకు వచ్చారు. అదును కోసం చూస్తున్న జనం ఒక్కసారిగా వారిపై విరుచుకుపడుతున్నారు. చివరకు తన చేష్టలతో ఒకింత ఉద్రిక్త వాతావరణం సృష్టించే ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను సైతం దెందులూరు నియోజకవర్గ ప్రజలు నిలదీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కూచింపూడి, న్యాయంపల్లి గ్రామాల్లో సౌకర్యాలపై మహిళలు చింతమనేనితో వాదనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీనిచ్చి ఇప్పటివరకు కనిపించలేదంటూ ఏలూరులోని 10వ డివిజన్ మహిళలు ఎమ్మెల్యే బడేటి బుజ్జిని నిలదీయగా.. ఏం మాట్లాడాలో అర్థంకాని పరిస్థితిలో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాలకొల్లు మండలం పెదమామిడిపల్లిలో మద్యనిషేధం కోరుతూ ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్‌ను గ్రామస్తులు చుట్టుముట్టగా, ఆయన ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి నిష్ర్కమించారు. అరుదుగా అరుదెంచితే అంతే మరి చాలా అరుదుగా ప్రజల మధ్యకు వెళ్లే భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును జనచైతన్య యాత్రలో చూసిన జనం ఎక్కడికక్కడ సమస్యలపై నిలదీస్తున్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ తుందుర్రు గ్రామస్తులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇళ్ల స్థలాల సమస్యపై ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు గ్రామస్తులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను అడ్డుకుంటే ఆయన దౌర్జన్యానికి దిగడం కలకలం రేపింది. నరసాపురం మండలం వేములదీవిలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడును జనం వెంటపడి తరిమినంత పనిచేశారు. స్థానిక యువకులైతే ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారంటే ఏ రీతిన జనాగ్రహం పెల్లుబికిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా.. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వందలాది హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వం.. ప్రజలకు ఏ మేలూ చేయని తెలుగుదేశం పార్టీ 13 రోజులుగా కొనసాగిస్తున్న చైతన్య యాత్రల ‘ప్రహసనం’ టీడీపీ నేతలకు ‘అసహనం’ మిగిల్చిందనే చెప్పాలి. సాక్షి ప్రతినిధి, ఏలూరు -
'యాత్రలతో కాలక్షేపం చేస్తున్నారు'
కమలాపురం: టీడీపీ ప్రభుత్వం జన చైతన్య యాత్రల పేరుతో కాలయాపన చేస్తోంది తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తోందని, అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదన్నారు. ఇన్నాళ్లూ రాజధాని పేరుతో కాలయాపన చేసిన నేతలు ఇప్పుడు జన చైతన్య యాత్రల పేరుతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. -
నారా లోకేష్‌ను నిలదీసిన మహిళలు
-
నారా లోకేష్‌ను నిలదీసిన మహిళలు
చోడవరం (విశాఖపట్నం జిల్లా) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు లోకేష్‌బాబుకు మహిళల నుంచి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం చీడికాడ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి వెళ్లిన లోకేష్‌ను.. తమకు హుద్‌హుద్ తుఫాను నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదంటూ అక్కడి మహిళలు నిలదీశారు. మరికొందరు మహిళలు తమకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు కాలేదని వాపోయారు. అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వటం లేదని మరికొందరు వృద్ధులు లోకేష్‌కు తెలిపారు. -
ఎంపీ మాగంటి వ్యాఖ్యలతో రగిలిన చిచ్చు
కొయ్యలగూడెం : అధికార టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన చైతన్యయాత్రలు జనానికి ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయన్న మాట అటుంచితే.. ఆ పార్టీలోని వర్గ విభేదాలను మాత్రం బహిర్గతం చేస్తున్నాయి. పోలవరం నియోజకవర్గంలోని ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న విభేదాలకు కన్నాపురంలో శని వారం నిర్వహించిన జనచైతన్య యాత్ర వేదికగా నిలిచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కన్నాపురంలో జనచైతన్యయాత్ర నిర్వహిస్తున్న సందర్బంగా మెయిన్సెంటర్లోకి చేరుకున్న ర్యాలీని ఉద్దేశించి ఎంపీ మాగంటి బాబు బహిరంగ ప్రసంగం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి సూటిగా విమర్శకు దిగడంతో పార్టీ శ్రేణులు విస్తుపోయాయి. ఏం జరుగుతుందో తెలియక పార్టీ నాయకులు , కార్యకర్తలు తలో దిక్కుకు సర్దుకున్నారు. ఎంపీ మాటలపై విస్మయం చెందిన ఎమ్మెల్యే మొడియం జనచైతన్య కార్యక్రమం నుంచి అర్థంతరంగా తప్పుకోగా ఎంపీ సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి కన్నాపురం జనచైతన్య యాత్రలో ఏలూరు ఎంపీ మాగంటిబాబు పార్టీ నాయకులను అవినీతి అక్రమార్కులుగా అభివర్ణించడంపై ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తన అనుయాయులు వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పలు ఉన్నత పదవులు నిర్వహించిన మాగంటి బహిరంగ సభలో సొంత పార్టీ వ్యక్తులపై ఇలా విరుచుకుపడడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి దెందులూరు పర్యటన సమయంలో పార్టీ ఆదేశానుసారం తాను జీలుగుమిల్లి జనచైతన్యయాత్రలో పాల్గొన్నానని, ఆ విషయం మరిచి ఎంపీ తప్పుగా పేర్కొనడం తనను బాధించినట్లు ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, జెడ్పీవైస్ చైర్మన్ చింతల వెంకటరమణల వద్ద వాపోయినట్లు తెలిసింది. అదే విధంగా ఒకప్పటి కాంగ్రెస్ వాది అయిన మాగంటి తీరు టీడీపీ విషయంలో అనుమానాస్పదంగా ఉందని కూడా ఆయన అన్నట్లు ప్రచారం జరుగుతోంది. తీవ్ర మనోవేదనకు గురైన మొడియం జరిగిన విషయం అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సమాయాత్తమవుతున్నట్లు సమాచారం. కన్నాపురం జనచైతన్య యాత్రలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ‘ఈ నెల 3వ తేదీన దెందులూరు పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాగా మీరు(ఎమ్మెల్యే) హాజరు కాలేదు. ఇది భావ్యం కాదు. అలాగే పోలవరం నియోకవర్గంలో అవినీతి పెచ్చుమీరుతోంది. ప్రతి విషయంలో టీడీపీ నాయకులు దందాల వైఖరి అవలంభిస్తున్నారు. ఇసుక మాఫీయా నుంచి భూ తగాదాల వరకు కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారు. అర్అండ్ఆర్ ప్యాకేజీలో లక్షకు రూ.20 వేలు నియోజకవర్గ టీడీపీ నాయకులు రైతుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. ఎన్ని గొడవలు జరుగుతున్నా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తన నియోజకవర్గంలో సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఏలూరు ఎంపీగా గర్విస్తున్నాను. ఎంపీగా మీరు అభివృద్ధికి ఏం చేస్తున్నారని దెందులూరు పర్యటనలో సీఎం నన్ను ప్రశ్నించారు. ఇప్పటికే పోలవరంలో జరుగుతున్న అవినీతి అక్రమాల చిట్టా అంతా తన వద్ద ఉందని, త్వరలోనే అందరి సంగతి తేల్చుతానని ఆయన హెచ్చరించారు.’ -
టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
-
టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
ఏలూరు: తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ వీరంగం సృష్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఇల్లందుపర్రులో శుక్రవారం జరిగిన జన చైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు. అయితే, తమకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలను కేటాయించాలని టీడీపీ ఎమ్మెల్యేను ఈ సందర్భంగా మహిళలు నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. గ్రామస్తులు, మహిళలపై పార్టీ కార్యకర్తలను ఉసిగొలిపి వారిని అక్కడి నుంచి నెట్టివేయించారు. ఏడాది నుంచి వేడుకుంటున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించి తమపై దౌర్జన్యానికి దిగడంపై మహిళలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వినర్ కారుమురి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. -
’పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తాం’
-
పదేపదే అదే సీన్ రిపీట్!
ఏలూరు (మెట్రో) : ముఖ్యమంత్రి చంద్రబాబు అదే సీన్ రిపీట్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో 21 సార్లు పర్యటించిన ఆయనకు వచ్చిన ప్రతిసారీ జిల్లా రుణం తీర్చుకోలేనిది అంటూ మాట్లాడటం అలవాటుగా మారింది. దెందులూరులో గురువారం నిర్వహించిన జనచైతన్య యాత్రల్లోనూ ఇదే మాట వల్లెవేశారు. జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘ఈ జిల్లాపై నాకో అభిమానం ఉంది, జిల్లాపై నాకో బాధ్యత ఉంది. పశ్చిమగోదావరి జిల్లా రుణం తీర్చుకోలేనిది’అంటూనే జిల్లాకు ఒక్క వరాన్నీ ప్రకటించలేదు. జిల్లాలో అందరు ఎమ్మెల్యేలనూ గెలిపించారు, అన్ని మునిసిపాలిటీలను ఇచ్చారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సొసైటీలు ఇలా ప్రతి ఒక్కదానిలో తెలుగుదేశాన్ని దీవించిన జిల్లా రుణం తీర్చుకోలేనిది అంటూ ప్రసంగించారు. అభివృద్ధికి అధ్యయనం చేయండి జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఎమ్మెల్యేలు, నాయకులు, మేయరు అందరూ అధ్యయనం చేయాలని కోరారు. అధ్యయనం అనంతరం ఏమి కావాలో చెబితే అది చేస్తానంటూ ఏ వరమూ ప్రకటించకుండానే ప్రసంగం ముగించారు. ఆక్వాకల్చర్ కింద జిల్లాకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి, అభివృద్ధి అవుతుందని అన్నారు. జిల్లాలో అభివృద్ధి జరగాలంటే రోడ్లు, మురుగునీటి పారుదల ప్రక్రియ వంటివి అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఇళ్లు కట్టించడం పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే భూముల విలువ పెరిగిపోయింది. దీంతో ఇళ్ల నిర్మాణాలపై ఆలోచన చేస్తున్నాం అన్నారు. త్వరలోనే జిల్లాలోని పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కొల్లేరుపైనా దాటవేత కొల్లేరులో చాలామంది పేదలున్నారు. వారికి న్యాయం చేయాలి అని మాట్లాడిన చంద్రబాబు ఏళ్లనాటి కొల్లేరు సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పలేదు. నిట్ కోసం సేకరించిన 400 ఎకరాల స్థలంలో మంచి ఇండస్ట్రీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. జిల్లాలో ఉన్న కృష్ణాడెల్టా పరిధిలో గోదావరి జలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ముందుగా దెందులూరుకు హెలికాప్టర్లో చేరుకున్న చంద్రబాబు హెలిపాడ్ నుంచి సైకిల్ తొక్కుతూ దళితవాడలోకి వెళ్లారు. దళితవాడ మొత్తం పాదయాత్ర చేశారు. సభావేదిక వద్దకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ మహిళలకు పురుషులతో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కృషి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీయే అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రెడ్డి సుబ్రహ్మణ్యం, అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, నిమ్మల రామానాయుడు, ముప్పిడి వెంకటేశ్వరరావు,పులపర్తి రామాంజనేయులు, బండారు మాధవ నాయుడు, పితాని సత్యనారాయణ, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రికి కలెక్టర్ కె.భాస్కర్, ఎస్పీ భాస్కర్భూషణ్లు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. -
అధ్యక్షుడి ఫొటో ఏదీ!
దెందులూరు : జనచైతన్య యాత్ర తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు నాయుడు గురువారం దెందులూరులో పర్యటించారు. పర్యటన అనంతరం జెడ్పీ హైస్కూల్ వద్ద బహిరంగ సభ జరిగింది. వేదికపై భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానిపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఫొటో లేకపోవడం గమనార్హం. చంద్రబాబునాయుడు, ఎంపీ మాగంటి బాబు, జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , జిల్లా పార్టీ పరిశీలకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఫొటో లేకపోవడం చర్చనీయాంశమైంది. -
మంత్రి పీతల యాత్ర.. పోలీసుల యాతన
జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత జన చైతన్యయాత్రలో భాగంగా చేసిన మోటార్ సైకిల్ ర్యాలీ పోలీసులకు, గన్మన్లకు ఇబ్బందిగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం మంత్రి జన చైతన్యయాత్రలో పాల్గొన్నారు. బైపాస్‌రోడ్డు జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్, పాతబస్టాండ్, గంగానమ్మ గుడిసెంటర్, కొత్తబస్టాండ్, బోసుబొమ్మసెంటర్, జేపీ సెంటర్ వరకు ఐదు కిలోమీటర్లు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సుజాత స్కూటర్ నడిపారు. మంత్రి వెంట ఇద్దరు గన్మన్లు, జంగారెడ్డిగూడెం ఎస్సై ఆనందరెడ్డి, ఇతర పోలీసులు సుమారు ఐదు కిలోమీటర్లు పరిగెత్తడానికి నానా అవస్థలు పడ్డారు. స్థానిక ఏలూరు రోడ్డులోకి వచ్చేసరికి మంత్రి గన్‌మన్ గంగాధర్ పరిగెడుతూ తూలి పడిపోయారు. వెనుక వచ్చిన మోటార్ సైకిళ్లను కంట్రోల్ చేయడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆయన మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు.