సాక్షి, తుంగతుర్తి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికాంలోకి వచ్చాక దేశంలో 40 ఏళ్ల కుటుంబ పాలనను పారదోలారు.. కానీ తెలంగాణలో ఇంకా కుటుంబ పాలనే సాగుతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగన బీజేపీ జన చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. తొలుత తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన జవదేకర్ కార్యకర్తలను ఉత్సహపరిచారు. ఆయన మాట్లాడుతూ.. ‘పంచపాండవులైన బీజేపీ ఎమ్మెల్యేలు.. 100 మంది ఉన్న టీఆర్‌ఎస్ కౌరవులతో యుద్ధం చేస్తే గెలుపు ఎవరిదో ఆలోచించండి. మోదీ 14 పంటలకు మద్దతు ధర పెంచడం ద్వారా రైతుల 50 ఏళ్ల కలను సాకారం చేశారు. పెంచిన ధరల ప్రకారం ఎకరా వరికి 6 వేల రూపాయలకు పైగా పెంపు వర్తిస్తోంది. తెలంగాణలో 24 గంటల కరెంటు రావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం.
గతంలో ముడుపులు లేనిదే ఏ పని జరిగేది కాదు.. కానీ మోదీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 100 రూపాయలు పంపిస్తే ప్రజల వద్దకు 15 రూపాయలు చేరేవి. మోదీ వచ్చాక 100కు వంద రూపాయలు చేరుతున్నాయి. ఉజ్వల పథకం క్రింద తుంగతుర్తిలో 2000మందికి గ్యాస్ కనెక్షన్‌లు వచ్చాయని ఇక్కడి ప్రజలు చెప్పారు. గత ఎన్నికల్లో సంకినేని వెంకటేశ్‌కు టిక్కెట్ ఇవ్వలేకపోయాం. కానీ ఈ సారి వెంకటేశ్ ఘన విజయం సాధిస్తారు. టీడీపీతో మేం స్నేహంగానే ఉన్నప్పటికీ.. వాళ్లు మాకు వెన్నుపోటు పొడిచారు. ఇకముందు పొడుస్తారు. జనచైతన్య యాత్ర విజయవంతగా సాగుతోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లాగానే, బీసీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో అమోదిస్తే.. రాజ్యసభలో కొందరు అడ్డుకున్నారు. వచ్చే సమావేశాల్లో ఈ బిల్లును పాస్ చేస్తాం. జన చైతన్య యాత్ర ఇంతటితో ఆగిపోదు.. సంవత్సరమంతా కొనసాగుతోంది. ఈ యాత్రతో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తోంద’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment