సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధరణి పోర్టల్ పేరుతో భారీ భూ కుంభకోణ జరిగిందని, ఇది కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్దదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి భూ యజమానులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 30న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ సర్కార్ ధరణిని సర్వరోగ నివారిణి అని గొప్పగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సిన వీఆర్వోల వ్యవస్థను లేకుండా చేసి, ఆ భూ రికార్డులను ప్రభుత్వం తీసేసుకుని వాటిని ఎవరికీ అందకుండా చేశారని ఆరోపించారు.
ధరణిలో రెవెన్యూ రికార్డులను మార్చేసి.. పట్టేదార్, పొసెషన్ (అనుభవదారు)ల స్థానంలో బినామీ, అక్రమ చొరబాటుదారు అని పేర్లు చేర్చారన్నారు. భూ రికార్డులను పూర్తిగా గందరగోళం చేశాక కేంద్రం ఇచ్చిన నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చారని ఆరోపించారు. దీంతో భారీమొత్తంలో భూ రికార్డులు తారుమారయ్యాయని ఆరోపణలు వచ్చాయన్నారు.
విదేశీ కంపెనీ చేతిలోకి ధరణి వివరాలు
విశ్వసనీయ వర్గాలు, నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఓ విదేశీ కంపెనీ రూపొందించిన యాప్ (మొబైల్ అప్లికేషన్) ధరణిలోని డిజిటల్ డాక్యుమెంట్స్‌ను యాక్సెస్ చేసినట్లు తెలుస్తోందని జవదేకర్ అన్నారు. ప్రభుత్వ డేటాను ఓ ప్రైవేటు కంపెనీ పరిశీలించడం సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే తెలంగాణలో మాత్రం దీనికి విరుద్ధంగా ప్రభుత్వ కీలక డేటా ఓ ప్రైవేటు కంపెనీకి అందుబాటులో ఉందని ఆరోపించారు.
వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, గ్రామసభలను నిర్వహించకుండా భూ రికార్డుల వ్యవస్థను తారుమారు చేశారని ధ్వజమెత్తారు. దీంతో భూములకు సంబంధించిన చాలా సర్వే నంబర్లు గల్లంతయ్యాయని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లక్షల ఎకరాలను నిషేధిత విభాగంలో చూపిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment