సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అభ్యర్థుల ఖరారు కసరత్తు కొలిక్కి వస్తోంది. శుక్రవారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో 60 స్థానాల్లో అభ్యర్థులపై (19 ఎస్సీ, 12 ఎస్టీ సీట్లు మినహాయించి) ఒక అభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సీట్లకు సంబంధించి మరోసారి చర్చించి, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని జాబితాల ను పంపాలని నిర్ణయించినట్టు వివరిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఆయా స్థానాల్లో ప్రాధాన్యతలు, ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను కీలక నేతలు అందజేయడంతో.. భేటీలో అన్నింటినీ సరిచూసి, కామన్‌గా ఉన్న పేర్లను ముసాయిదా జాబితా కోసం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సంఘ్‌పరివార్ క్షేత్రంలోని వారితోనూ పార్టీ నేతలు సమావేశమై, ఆయా సీట్లకు పేర్లపై స్పష్టత తీసుకున్నట్టు తెలిసింది. కసరత్తు పూర్తయ్యాక 40–45 మందితో తొలిజాబితాను ఢిల్లీలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీనేతలు చెప్తున్నారు.
పలు స్థానాలపై స్పష్టత
శుక్రవారం జరిగిన భేటీలో హైదరాబాద్ నగరంలోని రెండు ముఖ్యమైన స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. అంబర్‌పేట నుంచి పోటీకి కిషన్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయగా.. ముషీరాబాద్ నుంచి బరిలో ఉండేందుకు కె.లక్ష్మణ్ విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ముందుకొచ్చినట్టు తెలిసింది.
ఈ నియోజకవర్గంలో ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లు ఉండగా.. ఒకరు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. మిగతా నలుగురు కూడా తమకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుతున్నారు. దీంతో ఈసారి కార్పొరేటర్లకు టికెట్ అవకాశం కల్పించరాదని నిర్ణయించినట్టు తెలిసింది. అందరూ కలసికట్టుగా పనిచేస్తే పార్టీ విజయానికి మార్గం సుగమం అవుతుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు టికెట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment