ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్‌లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.
తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.
ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్‌కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..
ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేబినెట్‌లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment