డాక్టర్ లక్ష్మణ్ (ఫైల్ పోటో)
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వారి పథకాల మీద నమ్మకం లేకనే ఇతర పార్టీ నేతలను కొంటున్నారని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. జనచైతన్య యాత్రలో భాగంగా ఇబ్రహింపట్నం చేరిన ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ‘బీజేపీ కార్యకర్తల బలం చూసి కేసీఆర్ ఓర్వలేక పోతున్నారు. అందుకే రెండు గంటలకు పైగా ప్రెస్ మీటింగులు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ప్రజాకోర్టులో టీఆర్‌ఎస్‌ని నిలబెట్టేందుకే బీజేపీ జనచైతన్య యాత్రను చేపట్టింది. బోగస్ సర్వేలతో 100 సీట్లు గెలుస్తామని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ని మట్టికరిపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష కోట్ల రూపాయలు పక్క దారి పట్టించారు. వాటితో ఇతర నేతలను కొంటున్నారు.
బీజేపీ చేపట్టిన యాత్రను చూసి కేసీఆర్ ఉలిక్కిపడ్డారు. మూడు రోజుల యాత్రకే ఇలా ఉలిక్కిపడితే ఎలా.. మున్ముందు ఉంది ముసళ్ళ పండుగ. కేసీఆర్‌ను తరిమికోట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది బీజేపీ యాత్ర కాదు, ప్రజల తరుపున ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా.. అని సవాలు చేస్తున్న ముఖ్యంమంత్రి ముందుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి మా సత్తా ఎంటో చూపిస్తాం. ప్రగతిభవనకు బందీ అయిన కేసీఆర్ నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. రోడ్లకు గుంతలు పడినట్లు సమాచారం ఇస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పిన కేటీఆర్.. ప్రస్తుతం ఉన్న రోడ్లు చూస్తే రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఇచ్చినా సరిపోదు. కమీషన్ల్ కోసమే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ.
1300 కోట్ల రూపాయలు పెద్దవారి ఇళ్లకు ఇస్తే వాటి పేరు మార్చి.. ఎర్రవల్లిలో 10 ఇళ్లు మాత్రమే కట్టించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేంద్రం ఒక్క కుటుంబానికి 12 వేల రూపాయలు ఇస్తే వాటిని ఉపయోగించడం లేదు. కాంగ్రెస్ వంచన చేరి మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్, చంద్రబాబు కర్ణాటకలో విషప్రచారం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ విజయయాత్ర చేస్తుంది. కర్ణాటకలో జరిగినట్లు తెలంగాణలో కూడా అపవిత్ర కూటమి ఏకం కాబోతోంది. కాంగ్రెస్ ఎన్ని బస్సు యాత్రలు చేసిన ఆ పార్టీ గాలి పోతోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. చెన్నారెడ్డి గూడెంలో మరణించిన రైతు కుటుంబాలను ఆదుకుని వారికి పరిహారం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment