చీరాలలో జన చైతన్య చిచ్చు
• టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
• ఆమంచికి పోటీగా జన చైతన్య యాత్రలు ప్రారంభించిన మరోవర్గం
• అనుమతి లేదంటూ సునీత, పాలేటి వర్గీయులను అడ్డుకున్న పోలీసులు
• కొనసాగిస్తే కేసులు పెడతామంటూ హెచ్చరిక
• తామూ ప్రజాప్రతినిధులమేనంటూ నేతల వాగ్వాదం
• పట్టు వీడకుండా గ్రామాల్లో యాత్రల నిర్వహణ
• ఎమ్మెల్యే ప్లెక్సీలు చించి వేసిన ఆగంతకులు
చీరాల : అంతర్గత కుమ్ములాటలతో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు బజారుకెక్కుతున్నారు. విభేదాలు రచ్చకెక్కడంతో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ చీలికలు,పీలికలైంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఒంగోలు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులను చక్కదిద్దుతారని అంద రూ భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. చీరాలలో సీఎం జిల్లా పర్యటన ముగించుకు వెళ్లిన రెండోరోజే పార్టీ నేతల్లో చిచ్చు రేగింది.
ఆది నుంచి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను వ్యతిరే కిస్తున్న పోతుల సునీత, పాలేటి రామారావు వర్గీయులు జన చైతన్యయాత్రలను వేదికగా మలుచుకుని పోటీ ప్రచారం ప్రారంభించారు. ఓవైపు ఎమ్మెల్యే జన చైతన్యయాత్రలను ప్రారంభించి, నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తుండగా గురువారం రెండో వర్గం చీరాల మండలంలోని ఈపూరుపాలెం, విజయనగర్ కాలనీ పంచాయతీల్లో ఆయనకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.
పార్టీ సూచన మేరకే యాత్ర..
మాజీ జడ్పీటీసీ సభ్యుడు చంద్రమౌళి, ఈపూరుపాలెం సర్పంచ్ జి.సరోజిని ఇంటి నుంచి జన చైతన్యయాత్రను ప్రారంభించగా సమాచారం తెలుసుకున్న ఈపూరుపాలెం ఎస్సై డి.ప్రసాద్, పోలీసులు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే మాత్రమే జనచైతన్య యాత్రలు చేసుకోవచ్చని, మీరు సొంతగా యాత్రలు చేయాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్సై చెప్పారు. దీనిని రెండోవర్గం వ్యతిరేకించింది. తామంతా ప్రజాప్రతినిధులమని, తమకు జిల్లా పార్టీ పదవులు ఉన్నాయని ఎంపీపీ గవిని శ్రీనివాస్, జడ్పీటీసీ మెంబర్ పృథ్వీ అరుణ, సర్పంచ్ పృథ్వీ ఛాందినీ, ఎంపీటీసీలు, పలు గ్రామాల సర్పంచ్‌లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జన చైతన్యయాత్ర నిర్వహించుకోమని తమ పార్టీ ఆదేశించిందని స్పష్టం చేశారు. వాదోపవాదాల మధ్య ఈపూరుపాలెం పంచాయతీ కార్యాలయం వరకు యాత్రను నిర్వహించారు.
విజయనగర్ కాలనీలో ముందస్తు యాత్ర..
అలాగే విజయన గర్ కాలనీలో చేపట్టిన జనచైతన్య యాత్రను టూటౌన్ పోలీసులు అడ్డుకున్నారు. విజయనగర్‌కాలనీలో శుక్రవారం ఎమ్మెల్యే జనచైతన్య యాత్రను నిర్వహించాల్సి ఉండగా గురువారం రాత్రే ఆమంచి వ్యతిరేకవర్గం నిర్వహించడం విశేషం. గతంలో ఈగ్రామంలో ఇరువర్గాలు దాడులు చేసుకుని శాంతిభద్రతలకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా యాత్ర కొనసాగిస్తే కేసులు పెడతామని టూటౌన్ సీఐ ఫిరోజ్ హెచ్చరించి యాత్రను అడ్డుకున్నారు. ఈ చైతన్య యాత్రలో ఎంపీపీ గిని శ్రీనివాస్, జడ్పీటీసీ అరుణ, సర్పంచ్‌లు చాందినీ, సరోజిని, రూపవతి, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు మస్తాన్, వార్డు సభ్యులు, గ్రామ టీడీపీ నాయకులు ఉన్నారు.
ప్లెక్సీల చించివేత..
చీరాల పట్టణంలోని 8వ వార్డులోని లూథరన్ బ్రాంచి చర్చి వద్ద జన చైతన్య యాత్రల నేపథ్యంలెఓ ఆమంచి ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గురువారం రాత్రి ఆగంతకులు చింపివేశౠరు. ఈ ఘటన పార్టీలో విభేదాలకు అద్దం పడుతోంది.