టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులు
నాటి నుంచి నేటి వరకు అదే తీరు
2020లో కాజ టోల్‌గేట్ వద్ద పిన్నెల్లిపై దాడి
విజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబు
ఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీ
అభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, నరసరావుపేట : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు పల్నాడుపై పగపట్టారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా వరుసగా చావు దెబ్బ తింటున్న తెలుగుదేశం ఎలాగైనా పల్నాడులో ఫ్యాక్షనిజాన్ని ఎగదోసి, వర్గ వైషమ్యాలను పెంచి పోషించడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకునేందుకు శతధా ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగా వరుస దాడులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు పల్నాడు ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మాచర్ల నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన జూలకంటి దుర్గాంబ గెలుపొందారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2009, 2012 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తున్నారు.
కాగా దుర్గాంబ కుమారుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో మాచర్లలో సైకిల్ మూలన పడింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది.
టీడీపీ బలోపేతమంటూ...
మాచర్లలో టీడీపీని బలోపేతం చేయాలంటే పిన్నెల్లిని అడ్డు తొలగించడమే మార్గం అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు.. అందుకు అనుగుణంగా దాడుల ప్రణాళిక రచించారు. అందులో భాగంగా 2020 జనవరి ఏడో తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మంగళగిరికి సమీపంలోని కాజ టోల్‌ప్లాజా వద్ద టీడీపీ శ్రేణులతో భారీ ఎత్తున దాడి చేయించారు. ఎమ్మెల్యే వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. గన్‌మెన్ గాయాలపాలయ్యారు. అయితే ఆ రోజు ఎమ్మెల్యే బయటపడ్డారు. ఆ క్రమంలో భాగంగా రౌడీలు, గూండాలనే గుర్తింపున్న బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు మందీ మార్భలాన్ని తోడిచ్చి విజయవాడ నుంచి 2020 మార్చి 11న మాచర్లకు పంపారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు, స్థానికులు తిరగబడి బొండా, బుద్దా బృందాలను వెంటపడి తరిమేశారు. దీంతో చంద్రబాబు.. ఫ్యాక్షనిజం, హత్యల నేపథ్యమున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మళ్లీ రంగంలోకి దింపుతూ 2021 డిసెంబర్‌లో మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. 2010 మార్చి పదో తేదీన ఆత్మకూరు వద్ద ఏడుగురి హత్య కేసులో జూలకంటి ప్రథమ ముద్దాయి. చివరకు తన బాబాయి కుమారుడైన సాంబిరెడ్డి పొలాల్లో దాక్కుని ఉండగా హత్య చేయించారని అందరూ చెప్పుకుంటారు.
పోలేపల్లి శివారెడ్డి హత్య కేసులోనూ జూలకంటిది ప్రధాన పాత్ర అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మాచర్ల ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వరుస దాడులు, దొమ్మీలు, హత్యా ప్రయత్నాల పరంపర కొనసాగుతోంది. ఈ ఎన్నికల తర్వాత అది శ్రుతి మించింది. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విచ్చలవిడిగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి.
వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోనూ టీడీపీ దాడులకు తెగబడింది. మాచర్ల నియోజకవర్గంలో అశాంతికి ప్రధాన కారణం పోలీసులేనని, ప్రధానంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కారంపూడి సీఐ నారాయణస్వామి తీరు వల్లే గొడవలు పెరిగాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగా నిప్పులు చెరగడం పల్నాడులో పరిస్థితికి అద్దం పడుతోంది.
పదుల సంఖ్యలో ఊళ్లలో విధ్వంసం
» మాచర్ల రూరల్ మండలంలోని కొత్తూరు, కంబంపాడు, భైరవునిపాడు, వెల్దుర్తి మండలం లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సంపేట, రెంటచింతల మండలం రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి, దుర్గి మండలం ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ దాడులు కొనసాగాయి.
» దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లోని కేశానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, బ్రాహ్మణపల్లి, పెద అగ్రహారం, జానపాడు, వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం, సత్తెనపల్లి నియోజకవర్గంలోని పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుంట్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్లలోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేశారు.
» నరసరావుపేట టౌన్, దొండపాడు, పమిడిపాడు, పెదకూరపాడు మండలం యర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు, చిలకలూరిపేటలోని అప్పాపురం గ్రామాల్లో టీడీపీ దాడులకు తెగబడింది.
అభివృద్ధిలో పోటీ పడలేకే విధ్వంసం
చంద్రబాబు ఏలుబడిలో అభివృద్ధి ఊసే లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పల్నాడులో అభివృద్ధి పరుగెత్తుతోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ రూపు దిద్దుకుంటోంది. వరికపూడిసెలకు మోక్షం కలిగింది. గురజాల నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో తాగునీటి వసతి కలిగింది.
నరసరావుపేటలో జేఎన్‌టీయూ కాలేజీకి శాశ్వత భవనాలు ఒనగూరాయి. రొంపిచర్ల, మాచర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. పులిచింతల ప్రాజెక్టు దిగువన మాదిపాడు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. తద్వారా అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, గుంటూరు వరకు, మరోవైపు జగ్గయ్యపేటకు రవాణా వసతి మెరుగు పడనుంది.
కొండమోడు–పేరేచర్ల, సాగర్– దావుపల్లి, మాచర్ల– దాచేపల్లి, నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు.. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు చేయిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment