సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ప్రకటించారు. అలాగే పంట రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ జన చైతన్య యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
తాము అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల మాదిరిగా పంటలకు మద్దతు ధర విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. కేసీఆర్ సర్కారు మజ్లిస్ ఎజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు. రామ మందిర నిర్మాణంపై సీఎం కేసీఆర్ తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసింది..
నూతన పెన్షన్ విధానం సీపీఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసింది వాస్తవం కాదా ? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇప్పుడు సీపీఎస్ కేంద్రం పరిధిలోని అంశమంటూ ఉద్యోగులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. టీచర్ల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయ డం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను అన్యా యం చేశారని ధ్వజమెత్తారు.
టీఆర్‌ఎస్ సర్కారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్న లక్ష్మణ్, చివరకు బతుకమ్మ చీరల్లో కూడా రూ.200 కోట్ల అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఫాం హౌస్ నుంచి పాలన చేస్తున్న సీఎం కేసీఆర్, ప్రగతిభవన్‌లో పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు, కబ్జాకోరులను తన పంచన చేర్చుకుని.. రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులను కించపరుస్తున్నారని నిప్పులు చెరిగారు. రైతు సమన్వయ సమితుల్లో టీఆర్‌ఎస్ నాయకులకు పదవులు కట్టబెట్టి రైతులను కించపరుస్తున్నారన్నారు.
ఎంపీ కవిత మాట తప్పారు..
నిజామాబాద్ ఎంపీ కవిత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని లక్ష్మణ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. బీడీ కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. గల్ఫ్ బాధితులకు కేంద్రం అండగా నిలుస్తోందని, వారిని స్వస్థలాలకు రప్పించడంలో ప్రత్యేక చొరవ చూపు తోందని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్, పార్టీ నేతలు లోక భూపతిరెడ్డి, పల్లె గంగారెడ్డి, ధర్మపురి అర్వింద్ ఈ సభలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment