హన్మకొండ: వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పంట ఉత్పత్తులకు పెద్ద ఎత్తున మద్దతు ధర ప్రకటించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన జనచైతన్య యాత్ర బహి రంగసభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో దగా పడిన తెలంగాణ ప్రజలకు అండగా ఉండేందుకు జన చైతన్యయాత్ర చేపట్టామని చెప్పారు.
రాష్ట్రంలో గరీబోళ్ల రాజ్యం తీసుకురావడానికి అన్ని వర్గాల ప్రజలు కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కంచుకోటలు, కమ్యూనిస్టుల ఎర్రకోటలు బద్దలయ్యాయని, ఇక టీఆర్‌ఎస్ గడీలు బద్దలు కావాలన్నారు. రామమందిరం నిర్మాణం ఆకాంక్ష నెరవేరాలన్నా, మజ్లిస్ ఆగడాలు ఆగాలన్నా ప్రజలు బీజేపీతో కలసి రావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే కొలువులు వస్తాయని, ఇంటికో ఉద్యోగం లభిస్తుందని, కేజీ టూ పీజీ విద్య అందిస్తామని, దళితులకు మూడెకరాల భూమి కొనిస్తామని, పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని చేసిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
కమీషన్ల కోసమే మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు చేపట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేంద్రం 1.88 లక్షల ఇళ్లు కేటాయిస్తే.. ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా పేదలను వంచించారని దుయ్యబట్టారు. ప్రజలు తాగు, సాగునీరు కావాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఊరూ రా బెల్టు షాపులు పెట్టి కుటుంబాల్లో అశాంతిని రేకెత్తిస్తోందని విమర్శించారు. రైతు సమస్యలకు రైతుబంధు పరిష్కారమే అన్నట్లు విస్తృత ప్రచారంగా చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ముందస్తు..: రాంమాధవ్
ప్రధాని మోదీ దెబ్బకు కొట్టుకుపోతామని భయపడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముం దస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందని బీజేపీ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఏ పార్టీకి కూడా మోదీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేదన్నారు. ఫ్రంట్‌లు, స్టంట్‌లు ఏమి చేయవన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.
మోదీకి ఏ స్ట్రోక్ బాధ లేదని, కేసీఆర్‌కు సన్‌స్ట్రోక్.. సన్ ఇన్‌లా స్ట్రోక్.. డాటర్ స్ట్రోక్ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు దేశంలో గత్యంతరం లేదని, ప్రాంతీయ పార్టీల ఎదుట అతి పెద్ద జూనియర్ పార్టీగా మారిం దని విమర్శించారు. ఇక భవిష్యత్ బీజేపీదేనన్నారు. 2022 నాటికి దేశంలోని ప్రతి పేదవాడు పక్కా సొంతిళ్లు కలిగి ఉండాలన్నదే ప్రధాని ఆకాంక్ష అని పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను స్వాతంత్య్రం దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రజలు కోరుతుంటే.. టీఆర్‌ఎస్ మాత్రం స్వాతంత్య్ర ఉత్సవం లేదు, ఒక్క ఒవైసీ ఉత్సవం ఉంటే చాలన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దొంగలంతా టీఆర్‌ఎస్‌లో చేరారని, కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం ఫుల్‌టైమ్ మిషన్‌ను కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment