చేసేదే చెబుతాం! | Laxman comments on Rahul Gandhi | Sakshi
Sakshi News home page

చేసేదే చెబుతాం!

Published Sat, Nov 18 2023 4:50 AM | Last Updated on Sat, Nov 18 2023 4:50 AM

Laxman comments on Rahul Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిపై (యూనిఫాం సివిల్‌ కోడ్‌) నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ శుక్రవారం నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బీజేపీ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెబుతుందని స్పష్టం చేశారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, దీనికి అనేక చట్టపరమైన ఇబ్బందులున్నాయని పేర్కొన్నారు.

అందువల్ల వాటిని ఎలా అధిగమించాలనే అంశంపై దృష్టి పెట్టి, నిజమైన బీసీలకు న్యాయం చేసే దిశగా ఆలోచిస్తున్నామన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీసీ గణన నిర్వహించినా ఆ వివరాలు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. పండిట్‌ నెహ్రూ మొదలుకొని రాహుల్‌గాంధీ వరకు అందరూ బీసీ వ్యతిరేకులేనని లక్ష్మణ్‌ ఆరోపించారు. బీజేపీ బీసీ సీఎంను చేస్తామంటే ఎద్దేవా చేసి.. ఓబీసీలను అవమానించిన రాహుల్‌గాంధీ ఇప్పుడు వారిపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.

దీనిపై ఏడుగురు న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటు చేసినందున రాజకీయంగా, చట్టపరంగా ఎలా చేయాలన్న అంశంపై కేంద్ర ప్రభు త్వం దృష్టి పెట్టిందని వివరించారు. కాంగ్రెస్‌ నుంచి 2014లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏడుగురు, 2018 లో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారని, ఈరోజు కాకపోతే భవిష్యత్‌లోనైనా ఆ పార్టీ బీఆర్‌ఎస్‌తో కలవక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పాలించేందుకు కాంగ్రెస్‌కు 11సార్లు అవకాశమిచ్చారని, గతంలో టీడీపీకి, ఇప్పుడు పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినందున ఈసారి బీజేపీకి అవకాశమివ్వాలని ప్రజలకు లక్ష్మణ్‌ విజ్ఞప్తి చేశారు. 

అధికారమిస్తే యోగి యూపీ మోడల్‌  
బీజేపీ అధికారంలోకి వస్తే యోగి ఆదిత్యనాథ్‌ యూపీ నమూనాను ఇక్కడ అమలు చేస్తామని లక్ష్మణ్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో మాదిరి గా బీజేపీ ఎన్నికల ప్రణాళికలోనూ ఉచితాలు ఉంటాయా? అన్న ఓ విలేకరి ప్రశ్నకు లక్ష్మణ్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ఇస్తున్న గ్యారంటీలన్నీ కూడా ఓట్ల కోసం వేస్తున్న గాలాలే తప్ప మరొకటి కాదన్నారు.

ఇప్పటికే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇది రుజువైందని గుర్తు చేశారు. ఉచితాలు, సరైన పద్ధతిలో సంక్షేమ పథకాల అమలుతో పేదలకు లబ్ధి చేకూర్చడం మధ్య వ్యత్యాసం ఉందన్నారు. హంతకుడే క్షమాపణలు చెప్పినట్టు.. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలున్నాయని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement