మాట్లాడుతున్నకె.లక్ష్మణ్
సాక్షి, హన్మకొండ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే టీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్ గల్లంతు కావటం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం జన చైతన్య యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట నుంచి మోగించిన యుద్ధభేరికి టీఆర్‌ఎస్ పార్టీ భయపడుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కాచెల్లెళ్లను ఆదుకునే బతుకమ్మ.. కవితమ్మ పాలైందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నాయకులు జన చైతన్య యాత్రకు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల మద్ధతుతో విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు.
దళిత మేధావి అయిన బీఆర్ అంబేద్కర్‌ను రాజకీయంగా ఎదగనీయకుండా కాంగ్రెస్ నేతలు కుట్రలు చేసి ఓడించారని విమర్శించారు. బతుకమ్మ చీరలను ఛీత్కరించినట్లుగానే రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపిస్తారని అభిప్రాయపడ్డారు. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వం అంటున్న టీఆర్‌ఎస్.. సొంత పార్టీ నేతల అవినీతి, బెదిరింపు రాజకీయాలను ముందు సరి చూసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో భవిష్యత్ ఇక పేద వారిదేనని, నరేంద్ర మోదీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉంటామని కె.లక్ష్మణ్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment