
ముచ్చర్ల గ్రామం, కళ్లు సేకరిస్తున్న దృశ్యం
నేత్రదానంతో ఇతరుల జీవితాల్లో వెలుగులు
ఆదర్శంగా నిలుస్తున్న ముచ్చర్ల, సర్వాపూర్ గ్రామాలు
‘మరణించిన వ్యక్తి నేత్రదానం చేయడం ద్వారా వారి కళ్లు జీవించే ఉంటాయి. మరణానంతరం కూడా మన కళ్లు మరో ప్రపంచాన్ని చూస్తాయి. మట్టిలో కలిసిపోయే ముందు మరొకరి జీవితంలో వెలుగు నింపితే.. వారి ఆనందాన్ని మన నయనాలు నింపుకుంటాయి’. అనే సిద్ధాంతంతో ఓ రిటైర్డ్ ఇంజనీరు మొదలెట్టిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్లలో మొదలైన నేత్రదాన ఉద్యమం.. పరకాల డివిజన్ సర్వాపూర్‌కు వ్యాప్తి చెందింది.
సాక్షి ప్రతినిధి, వరంగల్: నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఈగా పనిచేసిన మండల రవీందర్ 12 ఏళ్ల క్రితం ముచ్చర్లలో నేత్రదాన ఉద్యమం మొదలెట్టారు. ‘అంధులకు కార్నియా ఆపరేషన్లు చేయడం ద్వారా కంటిచూపును ప్రసాదించవచ్చు’ అనే ఉద్దేశంతో చనిపోయిన వారి కళ్లతో సప్తవర్ణాలను చూపేందుకు ఆ రోజే బాటలు పడ్డాయి. ఒక్కరితో మొదలైన బృహత్‌కార్యంలో గ్రామస్తులు మనసారా భాగస్వాములయ్యారు. నేత్రదానం (Eye Donation) చేస్తామని ప్రతినబూని ముందుకు సాగుతున్నారు. మూడువేల పైచిలుకు జనాభా కలిగిన ముచ్చర్ల (వరంగల్ నగర పాలక సంస్థలో విలీనమైంది)లో ఇప్పటివరకు 46 మంది నేత్రదానం చేశారు.
ముచ్చర్ల బాటలో సర్వాపూర్
హనుమకొండ జిల్లా కేంద్రానికి 23.2 కి.మీ. దూరంలో ఉన్న చిన్న గ్రామం సర్వాపూర్‌కు నేత్రదాన ఉద్యమం పాకింది. 630 మంది జనాభా ఉన్న ఆ గ్రామం పరకాల డివిజన్ నడికుడ మండలం కిందకు వస్తుంది. ముచ్చర్లకు చెందిన మండల రవీందర్‌కు బావ వరుసైన తాజా మాజీ వార్డు సభ్యుడు భోగి రాములు నేత్రదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టగా.. సర్వాపూర్ గ్రామస్తులు సైతం సై అన్నారు. సర్వాపూర్‌లో రెండేళ్లలో 12 మంది నేత్రదానం చేయగా.. మరో 8 మంది హామీ పత్రాలు ఇచ్చినట్లు గ్రామస్తులు చెప్పారు.
చదవండి: అపురూపాల మంత్రపురి
లయన్స్ క్లబ్ హనుమకొండ, తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ (వరంగల్)కు సమాచారం ఇస్తే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్‌వీ ప్రసాద్ నేత్ర సేకరణ నిపుణులు నేత్రాలను స్వీకరిస్తున్నారు. ముచ్చర్లను ఆదర్శంగా తీసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలూ అదేబాటను అనుసరించారు. మృతిచెందిన 15 మంది కళ్లను దానం చేసేందుకు ఆయా గ్రామాల్లో వారి కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. పెంబర్తి, నాగారం, పలివేల్పుల, భీమారం, పెగడపల్లి, జమ్మికుంట, బావుపేటలో నేత్రదానంపై అవగాహన సదస్సులు ఉధృతంగా సాగుతున్నాయి.
సామాజిక బాధ్యత కూడా..
మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపు ఇచ్చిన వారమవుతామని అవగాహన కల్పిస్తూ నేత్రదాన ఉద్యమం చేస్తున్నాం. ఈ మహత్కార్యం సామాజిక బాధ్యత కూడా. మా తల్లిదండ్రుల నేత్రదానం ద్వారా మిగతా వాళ్లలో కూడా అవగాహన కల్పిస్తున్నాం. చాలా పల్లెలకు ఈ ఉద్యమం పాకడం సంతోషంగా ఉంది.
– మండల రవీందర్, ఉపాధ్యక్షుడు, తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్
మా ఆయన కళ్లు దానం చేసినం..
మా ఆయన భోగి కొమురమల్లు (92) రెండేళ్ల కింద చనిపోయిండు. మా ఊళ్లోనే ఉండే భోగి రాములు, ఇంకొంత మంది కళ్ల దానం గురించి చెప్పిండ్రు. ఇంట్లోళ్లం మాట్లాడుకుని కళ్లు వట్టిగ మట్టిల పోవుడు ఎందుకని దానం చేసినం. మా ఊళ్లో ఎవరు చనిపోయినా కళ్లను దానం చేస్తమని ముందుకు వస్త్రను.
– భోగి సమ్మమ్మ, సర్వాపూర్
Comments
Please login to add a commentAdd a comment