Eye donation
-
జంట గ్రామాల ‘ఐ’కమత్యం
సాక్షి, పెద్దపల్లి: ఆయుష్షు అరవై ఏళ్లు ఉందనుకుంటే.. మరణానంతరం మన కళ్లకు.. మరో అరవైఏళ్లు లోకాన్ని చూసే అదృష్టం కల్పించవచ్చని ఆలోచించారు ఆ జంట గ్రామాల ప్రజలు. పుట్టుకతో చూపు పోయినవారు కొందరు, ప్రమాదవశాత్తు కళ్లు పోయినవారు మరికొందరు.. వారికి జీవితమంతా చీకటే.ఇలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా.. చనిపోయిన తర్వాత కూడా కళ్లకు జీవితాన్నివ్వాలన్న గొప్ప ఆలోచన వారిలో తట్టింది. వెరసి ఆ ఊరు ప్రజలంతా మూకుమ్మడిగా నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఓదెల, అబ్బిడిపల్లి గ్రామాలపై స్ఫూర్తిదాయక కథనమిది. ఒక్కరి కృషితో.. ఒక్కొక్కొరుగా కదలివచ్చి పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఆర్ఎంపీ మేర్గు భీష్మాచారి స్థానికంగా ప్రాథమిక వైద్య చికిత్స చేస్తుండేవారు. ఆయన అత్తమ్మ చనిపోయినప్పుడు.. ఆమె కుమారులు నేత్రదానం చేశారు. నేత్రదానం అంటే.. పూర్తిగా కన్ను తీసుకుంటారనే అపోహలో ఉన్న ఆ ఆర్ఎంపీ.. కార్నియా సేకరణకు సహకరిస్తే.. మరొకరికి చూపు ఇచ్చిన వారవుతారని తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు కంటిచూపు పోయి ఇబ్బంది పడుతున్న ఎందరినో చూసిన ఆయన.. మరికొందరితో కలిసి 2015లో సదాశయం ఫౌండేషన్ స్థాపించారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తన వద్దకు వైద్య సాయం కోసం వచ్చేవారిని చైతన్యపరచటం ప్రారంభించారు. అదే స్ఫూర్తితో ప్రజలను చైతన్యపరుస్తూ ఇప్పటివరకు దాదాపు 2,000 మందితో నేత్రదానానికి హామీపత్రాలిచ్చేలా కృషి చేశారు. ఒకరిని చూసి మరొకరు.. తొలుత ఓదెల మేజర్ గ్రామపంచాయతీలో ఒక్కొక్కరుగా నేత్రదానం చేసేందుకు ముందుకురాగా, వారిని చూసి పక్కనే ఉన్న అబ్బిడిపల్లి గ్రామస్తులు సైతం ముందుకొచ్చారు. ఓదెల గ్రామంలో చనిపోయిన 190 మంది నేత్రదానం చేశారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్న సమీప అబ్బిడిపల్లి గ్రామస్తులు అదే స్ఫూర్తి కొనసాగిస్తున్నారు. 500. మంది ఉన్న గ్రామ జనాభా మూకుమ్మడిగా నేత్రదానం చేయడానికి సిద్ధమయ్యారు. నేత్రదానం చేస్తామని.. 2022లో గ్రామ పంచాయతీలో తీర్మానించారు. తీర్మానం ప్రతిని కలెక్టర్‌కు ఇచ్చి గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు. నేత్రదానంతోపాటు అవయవదానానికీ సదాశయం ఫౌండేషన్ ఆయా గ్రామాల్లో అవగాహన కలి్పస్తోంది. దీనికి కూడా ప్రజలు ముందుకు వస్తున్నారు.మా ఆయన కండ్లు ఇచ్చిన..మా ఆయన జింకిరి మల్లయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిండు. నాకు ఐదుగురు బిడ్డలు. మట్టిలో కలిసిపోవడం కంటే మరొకరికి కంటిచూపు ఇవ్వొచ్చని నా కొడుకు నిర్ణయించిండు. మా ఆయన కండ్లు దానం చేసినం. ఓదెల గ్రామానికి చెందిన సదాశయ ఫాండేషన్ వారికి అప్పగించినం. కళ్లదానం చేసేందుకు ఊరోళ్లందరం ఒక్కటైనం.– జింకిరి శాంతమ్మ, అబ్బిడిపల్లికొంటే దొరకనివి నేత్రాలు ఏది కొన్నా దొరుకుతుంది.. కానీ నేత్రాలు దొరకవు. అందుకే మా ఊరోళ్లందరం నేత్రదానం చేయాలని మూకుమ్మడిగా తీర్మానం చేసినం. ఈ క్రమంలో గ్రామంలో ఎవరు చనిపోయినా నేత్రదానం చేస్తున్నం. నేను కూడా నేత్రదానం చేస్తానని హామీ పత్రం ఇచ్చినసంస్మరణ సభలతో అవగాహననేత్రదానం, అవయవదానంపై ప్రజ ల్లోని అపోహలు తొలగించేందుకు మా సంస్థ కృషి చే స్తోంది. నేత్ర, అవయవ దానం చేసిన వారికి, దశ దినకర్మ రోజు మా సంస్థ సంస్మరణ సభలు నిర్వహిస్తోంది. అక్కడికి వచ్చే బంధువులు, మిత్రులకు అర్థమయ్యేలా వివరిస్తూ, మృతుల కుటుంబ సభ్యులను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందిస్తున్నాం. -
నవ దంపతుల నేత్రదానం
నెల్లూరు(అర్బన్): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నవ దంపతుల నేత్రాలను వారి కుటుంబ సభ్యులు దానం చేశారు. నెల్లూరు నగరానికి చెందిన కొప్పల ప్రశాంత్ – పుష్పలకు వివాహమై కేవలం నెల రోజులు కావస్తోంది. గురువారం జాతీయ రహదారిపై చెముడుగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ తమ బిడ్డల నేత్రాలను దానం చేసింది. ఏసీఎస్ఆర్ ప్రభుత్వ ఆస్పత్రి ఐ బ్యాంక్ సిబ్బంది వారి నేత్రాలను సేకరించి కుటుంబ సభ్యులకు నేత్రదాన సర్టిఫికెట్ అందించారు. శుక్రవారం నేత్ర సేకరణ టెక్నీషియన్ లాలేష్, నేత్రదాన మోటివేటర్ బాలాజీసింగ్ మాట్లాడుతూ ఇరువురి నేత్రదానం ద్వారా మరో నలుగురు అంధులకు చూపు లభిస్తుందన్నారు. నేత్రదానం చేయదలచిన వారు 99481 64781, 93471 11033 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. సీతాలక్ష్మి సైతం నెల్లూరులోని బారకాసు ప్రాంతానికి చెందిన సీతాలక్ష్మి(54) గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందగా కుటుంబసభ్యుల అనుమతితో నెల్లూరు ప్రగతి లయన్స్ క్లబ్ సహకారంతో సిబ్బంది ఆమె నేత్రాలను సేకరించారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులకు నేత్ర దాన సర్టిఫికెట్ అందించారు. -
చర్మ దాత సుఖీభవ
నేత్రదానం, రక్తదానం గురించి అందరికీ తెలుసు కానీ చర్మదానం గురించి తెలిసింది తక్కువే. కానీ నానాటికీ విస్తరిస్తున్న వైద్యరంగంలో చర్మం ప్రాధాన్యత ఎనలేనిది. మంచి చర్మం ఆరోగ్యానికి సూచిక. అలాగే కాలిన గాయాలు, ప్రమాదాలు, జబ్బుల వల్ల అనేకమంది రోగులకు కొత్త చర్మం అవసరమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు రాజధానిలోని విక్టోరియా ఆస్పత్రిలోని స్కిన్‌బ్యాంకు కొంతమేర ఆదుకుంటోంది. కర్ణాటక: రాష్ట్రంలో ప్రప్రథమంగా చర్మ నిధి (స్కిన్ బ్యాంక్) ప్రారంభమైన ఏడేళ్లలో దాతల సంఖ్య 200 కు చేరుకుంది. అయినప్పటికీ చర్మదానం గురించి సమాజంలో అవగాహన లోపించినందున దాతల సంఖ్య పెరగడం లేదు. బెంగళూరు వైద్య పరిశోధనా సంస్థ (బీఎంసీఆర్‌ఐ) ఆధ్వర్యంలోని విక్టోరియా ఆసుపత్రిలో రోటరీ ఆశీర్వాద్ సంయుక్త ఆధ్వర్యంలో 2016లో చర్మనిధి ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకు 197 మంది దాతలనుంచి త్వచాన్ని సేకరించారు. ప్రమాదాలు, జబ్బులకు గురైనవారికి చికిత్సకోసం చర్మానికి అధిక డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వినతులు కర్ణాటక మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఇంకా పలు రాష్ట్రాల నుంచి చర్మం కావాలని ఈ కేంద్రానికి వినతులు వస్తుంటాయి. కానీ అందులో 60 శాతం మాత్రమే సరఫరా సాధ్యమైందని తెలిపారు. కాలిన ప్రమాదాలలో గాయపడినవారికి స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్సకు చర్మం అవసరమని బీఎంసీఆర్‌ఐ ప్లాస్టిక్ సర్జరీ విభాగం చీఫ్ కేటీ.రమేశ్ తెలిపారు. ప్రస్తుతం చర్మ నిధిలో 12 వేల చదరపు సెంటీమీటర్ల చర్మం నిల్వలు ఉన్నాయి. చర్మదానం గురించి ప్రజల్లో జాగృతం చేయడానికి సోషల్ మీడియా ప్రచారం సహా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలను సందర్శించి వివరిస్తున్నామని తెలిపారు. చర్మదానానికి ఎందుకు వెనుకంజ ప్రజలు నేత్రదానం, ఇతర అవయవ దానం చేయడానికి ప్రమాణపత్రం ఇస్తారు. ఉత్సాహంగా రక్తదానం చేస్తారు. కానీ చర్మదానం చేయడం లేదని వైద్యులు తెలిపారు. చర్మం తీయడం బాధాకరంగా ఉంటుంది, శస్త్రచికిత్స చేస్తారు వంటి అపోహలే ఇందుకు కారణమన్నారు. చర్మదానం అంటే శరీర భాగమంతా చర్మం తీసుకోరు. తొడలు, కాళ్ల నుంచి కొన్ని సెంటీమీటర్ల చర్మం పొరను మాత్రమే తీసుకుంటారు. ఏర్పడిన చిన్నపాటి కోత త్వరలోనే మానిపోతుంది. కాలిన బాధితులకు కావాలి విక్టోరియా ఆసుపత్రిలో మహాబోధి కాలిన గాయాల వార్డులో అనేకమంది రోగులకు చర్మం అవసరం పడుతూ ఉంటుంది. ప్రతి నెల ఇక్కడ 220 మంది కాలిన గాయాలతో చేరుతుండగా వారిలో 70 శాతం కేసులు తీవ్రంగా ఉంటాయి. దీంతో ఎక్కువశాతం వీరి అవసరాలకే చాలడం లేదు. ఆరోగ్యవంతులు ఎవరైనా చర్మాన్ని ధారపోయవచ్చు. విరివిగా చర్మదానం చేయడం వల్ల ఎంతోమంది క్షతగాత్రుల జీవితాలకు సాయం చేసినట్లు అవుతుంది. దాతల్లో హెచ్చుతగ్గులు చర్మనిధికి 2016లో 18 మంది దాతలు రాగా, 2017లో 40 కి పెరిగింది. కానీ మళ్లీ తగ్గిపోయింది. 2018లో 33 మంది దాతలు ఉండగా ఆపై 17కు పడిపోయింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో 9 మంది మాత్రమే చర్మదానం చేశారు. 2021 నాటికి 18కి, 2022లో 40 కి పెరిగింది. ఈ ఏడాదిలో 22 మంది నుంచి చర్మం స్వీకరించారు. అలాగే 44 మంది రోగుల కోసం చర్మాన్ని పంపారు. ఇప్పటివరకు 310 మంది నుంచి వినతి వస్తే 194 మందికి మాత్రం సరఫరా చేశారు. వీరిలో నాలుగేళ్ల బాలుర నుంచి 85 ఏళ్లు వృద్ధుల వరకూ ఉన్నారు. అలాగే దాతల్లో 17 ఏళ్లు యువకుని నుంచి 98 ఏళ్లు వృద్ధుని వరకు 197 మంది దానం చేశారని చర్మనిధి పర్యవేక్షకుడు బీఎన్.నాగరాజ్ తెలిపారు. -
నేను మరణించలేదు..! అందరినీ చూస్తున్నా..!!
సంగారెడ్డి: బ్రెయిన్‌డెడ్ అయి ఓ యువకుడు మృతిచెందగా.. పుట్టెడు దుఃఖంలోనూ అతని నేత్రాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు కుటుంబ సభ్యులు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్‌పల్లికి చెందిన బబ్బూరి రాజులుగౌడ్(36) ఓ ప్రైవేట్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడు రోజుల కిత్రం బాత్రూంలో స్నానం చేస్తూ కళ్లు తిరిగి కిందపడిపోయాడు. అతన్ని వెంటనే గజ్వేల్‌కు, ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీకి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయి రాజులుగౌడ్ మృతి చెందాడు. ఆ బాధను దిగమింగుతూ మృతుడి నేత్రాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు నేత్రాలు తీసుకెళ్లారు. మృతుడు స్వయంగా మజీద్‌పల్లి గ్రామసర్పంచ్ లత భర్త శివరాములుగౌడ్‌కు సోదరుడు. కాగా, సోమవారం టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడి నేత్రదానం
సాక్షి, తిరుమల: తాను కన్నుమూసినా.. మరొకరికి చూపునివ్వాలన్న సంకల్పంతో టీటీడీ ఈఓ కుమారుడు నేత్రదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. టీటీ డీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి బుధవారం ఉదయం చెన్నై కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్‌తో కావేరి ఆస్పత్రిలో చికిత్సకోసం చేరారు. (టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఇంట్లో విషాదం.. గుండెపోటుతో కుమారుడు మృతి) క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆయన్ను కాపాడడానికి వైద్యులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళిరెడ్డి గతంలోనే నేత్రదానానికి అంగీకారం తెలుపు తూ సంతకం చేసినందువల్ల అతని కోరిక మేరకు ఆయన కళ్లను వైద్యులు సేకరించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నంద్యాల జిల్లా, నందికొట్కూరు సమీపంలోని పారు మంచ గ్రామంలో చంద్రమౌళిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చంద్రమౌళి రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చదవండి: (తుమ్మలగుంటకు సీఎం జగన్.. ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబానికి పరామర్శ) -
కన్నీళ్లు తెప్పించే ఘటన.. ‘సినీ గాడ్‌ఫాదర్’ను కళ్లారా చూడాలని.. ఇంతలోనే
అనంతపురం సప్తగిరి సర్కిల్: మెగాస్టార్ చిరంజీవి అంటే నిలువెల్లా ఆ యువకుడికి అభిమానం. కళ్లారా చూడాలన్న తాపత్రయం. సినీ గాడ్‌ఫాదర్‌ను హైదరాబాద్ వెళ్లి చూసే అవకాశం ఎలాగూ ఉండదు. బుధవారం అనంతపురం వస్తున్నారని తెలిసి.. మిత్రుడిని వెంటబెట్టుకొని గుత్తి నుంచి ద్విచక్ర వాహనంపై ఆత్రంగా బయల్దేరాడు. మరో పదినిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటాడు. అంతలోనే గార్లదిన్నె వద్ద మృత్యువు అతన్ని ప్రమాద రూపంలో కబళించింది. చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? అయితేనేం అభిమానం “చిరంజీవి’గా వెలుగునివ్వాలని అతని కుటుంబ సభ్యులు భావించారు. నేత్రాలను దానం చేస్తే.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తాడని భావించారు. అనుకున్నదే తడవుగా నేత్రాలను దానం చేశారు. గుత్తి పట్టణానికి చెందిన రాజశేఖర్ (22) కళ్లను అతని కుటుంబ సభ్యులు సాయిట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ద్వారా నేత్రాలను గురువారం సేకరించారు. కళ్లను సేకరించిన వారిలో సాయిట్రస్ట్ సభ్యులు విజయసాయి, నారాయణ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి టెక్నీషియన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నేత్రదానం.. ఎవరు చేయొచ్చు?.. కార్నియా ఎన్ని గంటల్లోపు...
సాక్షి, తూర్పుగోదావరి: వ్యక్తి మరణించిన తర్వాత కళ్లను దానం చేస్తే.. ఆ కళ్లు మరొకరి జీవితంలో వెలుగును ప్రసాదిస్తాయి. దాతల కళ్లు పునర్జన్మను సంతరించుకుని అంధకారాన్ని పారదోలే కాంతిపుంజంగా మారుతాయనడంలో సందేహం లేదు. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటారు. అంతటి ప్రధానమైన కళ్లను మరణించాక మట్టిపాలు చేసేకంటే, దానం చేయడం ఉత్తమం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకూ జాతీయ 37వ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. నేత్ర దానం ప్రాధాన్యం, ఆవశ్యతకను ప్రజలందరికీ తెలియజేయడం, ఔత్సాహికులకు దిశానిర్దేశం చేయడం ఈ పక్షోత్సవాల ముఖ్యోద్దేశం. కార్నియాల అవసరానికి, సేకరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి ఈ సందర్భంగా ప్రయత్నిస్తారు. కార్నియా ద్వారా అంధత్వానికి గురి కాకుండా ప్రజలను అప్రమత్తం చేయడం. ప్రజలను నేత్రదానానికి సన్నద్ధం చేయడం కూడా ఈ పక్షోత్సవాల్లో లక్ష్యాల్లో కొన్ని. కార్నియా దెబ్బతిని చూపు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. నేత్రదానం చేసే వారి సంఖ్య మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. ఈ వ్యత్యాసం ఏడాదికేడాదీ పెరుగుతోంది. నేత్ర దానానికి ముందుకు వచ్చిన వారిలో కొందరు మృత్యువాత పడిన సమయానికి వారి కళ్లను దానం చేయలేకపోతున్నారు. కొందరు బాధ, దుఃఖంలో మర్చిపోతే, మరికొందరి కళ్లను బంధువులు, కుటుంబ సభ్యులు మూఢనమ్మకాలతో దానం చేయడానికి ఇష్టపడడం లేదు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ లెక్కల ప్రకారం 2017 నుంచి ఇప్పటి వరకూ 2,611 మంది నుంచి కార్నియాలు సేకరించగా, 2,267 మందికి అమర్చారు. ఇది మరింత పెరగాలని, నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 40 శాతం మందికి కార్నియా సమస్యలు ►కంటి ముందు నల్లటి భాగాన్ని కప్పి ఉంచే పొరను కార్నియా అంటారు. ఏటా వందల మంది కార్నియా అంధులుగా మారుతున్నారు. ►వీరిలో 35 శాతం మంది యువతీ యువకులు, ఐదు శాతం చిన్నపిల్లలే. ►విటమిన్–ఎ లోపం, పౌష్టికాహార లేమి, ప్రమాదాలు, గాయాలు, శస్త్రచికిత్సలతో వచ్చే ఇన్ఫెక్షన్లతో కార్నియా అంధత్వం వస్తుంది. ►దీర్ఘకాలిక కాంటాక్ట్ లెన్స్ వాడే వారిలో కూడా కార్నియా అంధత్వం ఏర్పడే అవకాశముంది. ►కార్నియా అంధత్వానికి కార్నియా మార్పిడే మార్గం. ఆరు గంటల్లో సేకరించాలి మనిషి మరణిస్తే ఆరు గంటల్లోగా శరీరం నుంచి కార్నియాను సేకరించాలి. నేత్రదానం అనేది 15–20 నిమిషాల్లో పూర్తయ్యే సామాన్య ప్రక్రియ. మరణించిన వారి నుంచి కేవలం కార్నియాను మాత్రమే తీసుకుంటారు. మొత్తం కంటిని కాదనే విషయాన్ని గమనించాలి. చాలా మందిలో కన్ను మొత్తాన్ని తీసుకుంటారన్న అపోహ ఉంది. అది అవాస్తవం. నేత్రదానం తర్వాత ఎలాంటి వికృతం ఉండదు. ఎందుకంటే కళ్లను తొలగించిన వెంటనే సహజమైన కన్నుల మాదిరిగా కనిపించే కృత్రిమ కన్నులను వెంటనే మృతదేహానికి అమరుస్తారు. దీనివలన అంతిమ సంస్కారాలకు ఇబ్బంది ఉండదు. ముందుగా ఐ బ్యాంక్ వారికి సమాచారం ఇవ్వాలి. వారు వచ్చేలోగా నేత్ర దాత రెండు కనురెప్పలను మూసివేసి, దూది లేదా మెత్తటి వస్త్రాన్ని వాటిపై కప్పి ఉంచాలి. మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో పెట్టినా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాన్ గాలి కింద మృతదేహాన్ని ఉంచరాదు. ఆర్కే ద్రావకంలో సేకరించిన కార్నియాను భద్రపర్చి 28 రోజుల్లోగా వాడుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు మొదలు.. 18 ఏళ్లు నిండిన వారు వయస్సుతో సంబంధం లేకుండా నేత్రదానం చేయొచ్చు. ఏ వయస్సు వారైనా, కంటి అద్దాలు ధరించిన వారైనా, షుగర్ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు ఉన్న వారైనా మరణానంతరం నేత్రదానం చేయొచ్చు. ప్రమాదవశాత్తూ, గుండె జబ్బులు తదితర దీర్ఘకాలిక జబ్బులతో మరణించిన వారు, సహజ మరణం పొందిన వారు నేత్రదానం చేసేందుకు అర్హులు. ఎవరు అనర్హులంటే.. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు, హెచ్ఐవీ, కామెర్లు, కుష్ఠు వ్యాధి, రుబెల్లా, సిఫిలిస్ వంటి వ్యాధిగ్రస్తులు, కరోనా పాజిటివ్, హెపటైటిస్ ఉన్న వారు నేత్రదానానికి అనర్హులు. పాము, కుక్క కాటు వల్ల మరణించిన వారు, కంటి పాపపై తెల్లని మచ్చలు, కంటిలో నీటి కాసుల వ్యాధి ఉన్న వారు కూడా అనర్హులు. అవగాహన కల్పిస్తున్నాం కలెక్టర్ హిమాన్షు శుక్లా నేతృత్వంలో నేత్రదానంపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. మృతి చెందిన ప్రతి ఒక్కరి కళ్లకు సంబంధించిన కార్నియాను తీసుకుని అమరిస్తే ఇద్దరికి చూపు వస్తుంది. నేత్రదానానికి ప్రజలు ముందుకు వస్తున్నా.. మృతి చెందిన సమయంలో పలు కారణాలతో నేత్రాల సేకరణపై సమాచారం ఇవ్వడం లేదు. మరికొందరు ముందస్తు సమాచారం ఇవ్వకున్నా, మృతి తర్వాత మరో ఇద్దరికి చూపునివ్వాలని కళ్లను దానం చేస్తున్నారు. – డాక్టర్ మల్లికార్జునరాజు, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, అమలాపురం కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగే ఆస్పత్రులివే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కాకినాడ శ్రీకిరణ్ కంటి ఆస్పత్రి, రాజమహేంద్రవరం గౌతమీ నేత్రాలయంలో కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు. అలాగే కాకినాడ నయన, రాజమహేంద్రవరం అకిరా ఆస్పత్రుల్లో కూడా కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ద్వారానే కార్నియాలను గత పదేళ్లుగా సేకరిస్తున్నారు. -
95 ఏళ్ల వయసులో నేత్ర దానం
బంజారాహిల్స్: మరణానంతరం నేత్రాలు, అవయవాలు, శరీరదానం చేయడం వల్ల సొసైటీకి ఇంతకంటే చేసే మెరుగైన సేవ ఏదీ లేదనే ఉద్దేశంతో 95 సంవత్సరాల వయసులో మృతి చెందిన ఓ వృద్ధుడు తన మరణానంతరం నేత్రాలను దానం చేశారు. నందలాల్‌జీ పి.గుప్తా(95) గురువారం కన్నుమూశారు. బతికుండగానే ఆయన తన నేత్రాలను దానం చేయడంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు హైదరాబాద్‌కు చెందిన అమ్మ కంటి అవయవ శరీరదానం ప్రోత్సాహకుల సంఘం అధ్యక్షుడు గంజి ఈశ్వరలింగం ఆధ్వర్యంలో బజాజ్ ఐ బ్యాంక్‌కు అందజేశారు. 60 ఏళ్ల వయసులో... తాను చనిపోయినా మరొకరికి వెలుగునివ్వాలనే ఉద్దేశంతో వల్లభనేని నర్సింహారావు(60) మరణానంతరం తన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు అందజేశారు. బతికుండగానే ఆయన తన నేత్రాలను దానం చేయడంతో కుటుంబ సభ్యులు అమ్మ నేత్ర, అవయవ శరీరదాన ప్రోత్సాహకుల సంఘానికి సమాచారం అందించి ఆ మేరకు ఆస్పత్రికి అందజేశారు. -
‘పునీత్’ కళ్లు నలుగురికి చూపునిచ్చాయి
యశవంతపుర (బెంగళూరు): కన్నడ పవర్ స్టార్, యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ నేత్రాలను నలుగురికి అమర్చి చూపును ప్రసాదించారు వైద్యులు. పునీత్ శుక్రవారం గుండె వైఫల్యంతో బెంగళూరులో కన్ను మూసిన విషయం విదితమే. పునీత్ దేహం నుంచి కళ్లను ఆ రోజే నారాయణ నేత్రాలయ వైద్యులు సేకరించారు. ఆ కళ్లను శనివారం నలుగురు యువతకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్ డాక్టర్ భుజంగశెట్టి తెలిపారు. సోమవారం ఆయన వైద్య బృందంతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా రెండు కళ్లను ఇద్దరికే అమర్చుతామని, కానీ పునీత్ కళ్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పై పొర, లోపలి పొరగా రెండు భాగాలుగా విభజించామని తెలిపారు. వీటిని పైపొర సమస్యతో బాధపడుతున్న ఇద్దరు యువకులకు, లోపలి పొరను ఆ సమస్య ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి అమర్చామని వివరించారు. కొత్త కంటిని శరీరం తిరస్కరించే ప్రమాదాన్ని ఇది బాగా తగ్గిస్తుందని కూడా తెలిపారు. వాడకుండా మిగిలిపోయిన తెల్లగుడ్డు భాగం ద్వారా తమ ల్యాబ్‌లో కంటి మూల కణాలను ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. ఎవరికైనా ప్రమాదాల్లో తెల్ల గుడ్డుకు గాయాలైతే ఆ కణాల ద్వారా చికిత్స చేయవచ్చన్నారు. రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులు, వారి తనయుడు పునీత్ కళ్లను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. -
నలుగురికి ఉపయోగపడదాం
‘‘శరీరంలోని అన్ని అవయవాల్లో కళ్లు చాలా ప్రధానమైనవి. కళ్లతో చూస్తాం.. మాట్లాడతాం. అనంత సృష్టిలో ఉన్న దాన్ని కళ్లతో చూసి ఆనందిస్తాం. అలాంటి ఒక అద్భుతమైన వరాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. మనం మరణించిన తర్వాత మన కళ్లు వృథాగా పోకుండా నేత్రదానం చేసినట్లయితే మన రెండు కళ్లు నలుగురికి ఉపయోగపడతాయి. మరణించిన తర్వాత కూడా బతికుండాలంటే మనం నేత్రదానం చేద్దాం’’ అన్నారు బ్రహ్మానందం. ఇంకా మాట్లాడుతూ –‘‘మనం చనిపోయాక వ్యర్థ పదార్థంలా మట్టిలో కలిసిపోవడం కంటే మనలోని అవయవాలు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయంటే అంతకంటే కావాల్సింది ఏముంది. ఒక్క గుండె ఉంటేనే సరిపోదు.. కళ్లు కూడా ఎంతో ముఖ్యం. ‘కార్నియా అంధత్వ్ ముక్త్ భారత్ అభ్యాన్’ ద్వారా ‘సాక్షం సేవ’ అనే సంస్థవారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.. ఇందుకు వారికి హ్యాట్సాఫ్’’ అన్నారు బ్రహ్మానందం. -
నేత్రదానం చేస్తాను: ముఖ్యమంత్రి
చెన్నై: అంధత్వం లేని సమాజం నిర్మాణానికి కళ్లు దానం చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి. నేత్ర దానం చేయడంలో తాను కూడా భాగస్వామ్యం అవుతున్నానంటూ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన కళ్లను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా పళనిస్వామి తన కళ్లను దానం చేశారు. ఈ క్రమంలో కె పళనిస్వామికి తమిళనాడు రాష్ట్ర అంధత్వ నియంత్రణ సంఘం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యక్రమ అధికారి ఎస్.వి.చంద్రకుమార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చారు. (చదవండి: వారి కళ్లు మళ్లీ చూడబోతున్నాయ్! ) దానిలో ‘ఎడప్పాడి కె. పళనిస్వామి గర్వించదగిన కంటి దాత. ఆయన తన కళ్లని దానం ఇవ్వడం ద్వారా దేశాన్ని అంధత్వ రహితంగా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు’ అని సర్టిఫికెట్లో ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 మధ్య నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్‌నైట్ పాటిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా మరణం తరువాత ఒకరి కంటి చూపును ఇతరులకు దానం చేయడం గురించి అవగాహన కల్పిస్తున్నారు. -
నేత్రదానం చేయాలనుకుంటున్నా...
నేను నా మరణానంతరం నేత్రదానం చేయాలనుకుంటున్నాను. ఎవరెవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు, కళ్లను ఎలా తొలగిస్తారు వంటి వివరాలు చెప్పండి. నాకు బీపీ, షుగర్ ఉన్నాయి. నేను నేత్రదానం చేయవచ్చా? – ఎమ్. పరంధాములు, నకిరేకల్లు నేత్రదానం చేసిన వ్యక్తి కళ్లను సేకరించి వాటిని మరొకరికి అమర్చడం ద్వారా అంధులకు చూపు తెప్పిస్తారు. ఒక వ్యక్తి తాలూకు రెండు కళ్లను సేకరించడం ద్వారా ఇరువురికి చూపు రప్పించడం సాధ్యమవుతుంది. కాబట్టి ఒకరు నేత్రదానం చేయడం అంటే ఇద్దరికి చూపు ఇవ్వడమన్నమాట. మన కంటిలో కార్నియా అనే పారదర్శకమైన పొర ఉంటుంది. ఇది బయటి దృశ్యాలను కంటి లోపలికి చేరవేస్తుంది. కార్నియాలో పారదర్శకత లోపించినప్పుడు అది రెటీనాకు సరైన సమాచారాన్ని చేరవేయలేదు. అలా వచ్చే అంధత్వాన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే... పాడైన కార్నియాను తొలగించి ఆరోగ్యకరమైన కార్నియాను అమర్చాలి. ప్రస్తుతానికి కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్నవారికి మాత్రమే చూపు తెప్పించగలుగుతున్నారు. నేత్రదానం తర్వాత – దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కార్నియాను... అది (కంటి మీద ఉండే పారదర్శకమైన పొర) దెబ్బతినడం వల్ల అంధులైన వారికి అమరుస్తారు. ఈ ప్రక్రియను కార్నియా రీప్లేస్మెంట్ లేదా కెరటోప్లాస్టీ, కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటారు. మన సమాజంలో కార్నియా దెబ్బతినడం కారణంగా దృష్టిలోపంతో బాధపడుతున్న వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. కానీ స్వచ్ఛందంగా నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చేవారి సంఖ్య ఇప్పటికీ ఇంకా తక్కువే. చూపు అవసరమైన వారందరిలో ప్రస్తుతానికి కేవలం పది శాతం మందికి మాత్రమే కార్నియా లభ్యమవుతోంది. ఇక మరికొంతమందిలో స్కీ›్లరా అనే తెల్లగుడ్డు భాగాన్ని కూడా అమర్చి అంధత్వాన్ని నివారిస్తున్నారు. ఈ సర్జరీ చేయడానికి నేత్రదాత బ్లడ్‌గ్రూప్ – గ్రహీత బ్లడ్‌గ్రూప్ ఒకటే కావాల్సిన అవసరం లేదు. అంటే బ్లడ్గ్రూపులతో పనే లేదు. కార్నియా అమర్చడానికి ఎవరెవరు అర్హులు ♦ సూడోపేకిక్ బుల్లస్ కెరటోపతి ∙కెరటోకోనస్ ∙కార్నియాకు గాయాలు (కార్నియల్ ఇంజ్యురీస్) ∙కార్నియల్ డీ జనరేషన్ ∙కార్నియల్ అల్సర్స్ ∙ఎండోథీలియన్ డీ–కంపెన్సేషన్ ∙పుట్టుకతోనే తెల్లటి కార్నియా ఉండటం (కంజెనిటల్ కార్నియల్ ఒపాసిటీ) ∙కెమికల్ బర్న్స్ (అంటే రసాయనాల వల్ల కార్నియా దెబ్బతినడం) వంటి సమస్యలతో చూపు కోల్పోయిన వారికి కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా చూపు తెప్పించవచ్చు. నేత్రదానం... అపోహలు నేత్రదానం విషయంలో మన సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. వాస్తవానికి ఈ అపోహల కారణంగానే చాలామంది నేత్రదానానికి ముందుకు రావడం లేదు. అలాంటి కొన్ని అపోహలూ – అసలు వాస్తవాలను చూద్దాం. ♦ కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ల కళ్లు నేత్రదానానికి పనికిరావన్నది కొందరు అపోహ. వాస్తవానికి కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నా సరే... వారు కళ్లను దానం చేయవచ్చు ∙ఇక మరీ వృద్ధులైన వారి కళ్లు నేత్ర దానానికి పనికిరావనీ, వయసులో ఉన్న వాళ్ల కళ్లు మాత్రమే పనికివస్తాయని కొందరు అనుకుంటారు. ఇది కూడా అపోహే. ఏడాది వయసు నిండిన పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవరైనా సరే నేత్రదానం చేయవచ్చు ∙కొన్ని సినిమాల్లో చూపినట్లుగా తమ ఆప్తుల కోసం... బతికి ఉన్న వాళ్లు కూడా తమ కళ్లు దానం చేయవచ్చని కొందరు అపోహ పడుతుంటారు. నిజానికి చనిపోయినవారి నుంచి మాత్రమే కళ్లను స్వీకరిస్తారు. ఒకవేళ తమ దగ్గరి వారికి ఏదైనా సమస్య వచ్చి వారు చూపు కోల్పోతే... తల్లిదండ్రులు గానీ లేదా దగ్గరి బంధువులు గానీ తీవ్రమైన భావోద్వేగాలతో ముందుకు వచ్చినా వారి కళ్లను స్వీకరించరు. ∙ఇక మీరు చెప్పినట్లుగా మీకు బీపీ, షుగర్ ఉన్నా నేత్రదానం చేయవచ్చు. రక్తపోటు, డయాబెటిస్, ఉబ్బసం (ఆస్తమా), టీబీ వంటి వ్యాధులు ఉన్న వారు కూడా తమ కార్నియా ఆరోగ్యంగా ఉంటే తప్పక నేత్రదానం చేయవచ్చు. అలాగే రిఫ్రాక్టివ్ సమస్యల కారణంగా కళ్లజోడు ధరించేవారు కూడా నేత్రదానం చేయడానికి అర్హులే. ఎవరెవరు నేత్రదానం చేయకూడదంటే... ♦ ఎయిడ్స్, హెపటైటిస్, రుబెల్లా, సిఫిలిస్ వంటి అంటువ్యాధులున్న వారు, బ్లడ్ క్యాన్సర్, ట్యూమర్లు ఉన్నవారు నేత్రదానానికి అర్హులు కారు. ఈ సమస్యలు ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు చనిపోయిన వ్యక్తి నుంచి కంటితో పాటు, రక్తనమూనాలు సేకరిస్తారు. వైద్య పరీక్షలో అతడికి అనారోగ్యాలేవీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ల కార్నియాను ఉపయోగిస్తారు. ఇక విషం తీసుకుని మరణించిన వారి కళ్లు కూడా నేత్రదానానికి పనికిరావు. ఎలా సేకరిస్తారంటే... ♦ మరణానంతరం ఆరు గంటలలోపు కళ్లను సేకరించాలి. ♦ నేత్రదానం చేయదలచినప్పుడు మరణించిన వ్యక్తి కనురెప్పలను మూసి, కళ్ల మీద తడిగుడ్డ లేదా దూదిని లేదా ఐస్ ముక్కలను ఉంచాలి. ♦ తల ఎత్తులో ఉండేటట్లు, తల కింద రెండు తలగడలు ఉంచాలి. ♦ మృతదేహం ఉన్న గదిలో ఫ్యాన్ వేయకూడదు. దీనివల్ల కార్నియా బాగా పొడిగా మారి చెడిపోయే అవకాశం ఉంది. ఫ్యాన్ వేయకూడదుగానీ గది వీలైనంత వరకు చల్లగా (లో–టెంపరేచర్‌తో) ఉండేలా చూడాలి. ♦ ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞానంతో కేవలం కంటి నల్లగుడ్డు మీద ఉండే కార్నియాను మాత్రమే సేకరిస్తున్నారు. కాబట్టి నేత్రదానం చేసినా కంటి ఆకారంలో ఎలాంటి మార్పూ కనిపించదు. ఒకవేళ పాత పద్ధతిలో కంటిని మొత్తంగా తీసేసినా కూడా ఆ స్థానంలో కృత్రిమ కంటిని అమర్చుతారు. ఫలితంగా పార్థివ దేహం మామూలుగా కళ్లు మూసుకుని ఉన్నట్లే కనిపిస్తుంది. ♦ కార్నియాను సేకరించిన తర్వాత దాన్ని ఐ–బ్యాంకులో ఉంచుతారు. ఆ తర్వాత వీలైనంత త్వరగా మరొకరికి అమర్చుతారు. ♦ వీలైనంత త్వరగా కంటిని సేకరించేందుకు వీలుగా ఐ–బ్యాంక్ ప్రతినిధులు, వైద్యనిపుణులు వచ్చేలోపే... మరణించిన వ్యక్తి తాలూకు డెత్ సర్టిఫికేట్, మరణానికి కారణాలు తెలిపే (కాజ్ ఆఫ్ డెత్) ధ్రువీకరణ పత్రాలు, మెడికల్ రికార్డ్స్ కూడా సిద్ధంగా ఉంచడం మంచిది. ♦ మరణించిన వ్యక్తికి వారసులు ఉంటే వారి అనుమతితో మాత్రమే కళ్ల సేకరణ జరుగుతుంది.-డాక్టర్ రవికుమార్ రెడ్డికంటి వైద్య నిపుణులు,మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్. -
అలా నటించడానికి అస్సలు వెనుకాడను
సినిమా : అలా చేస్తే వ్యక్తిగత విమర్శల దాడి చేస్తారని తెలుసు. అయినా ఐ డోంట్‌కేర్ అంటోంది నటి ఆండ్రియా. సంచలనాలకుకేంద్రబిందువు ఆండ్రియా అంటారు. ఆమె చర్యలు కూడా అలానే ఉంటాయి. అయితే మల్టీ టాలెంటెడ్ నటి ఈ బ్యూటీ. ఈమెలో నటి మాత్రమే కాకుండా మంచి గాయనీ, గీత రచయిత ఉన్నారు. అదే విధంగా బహుభాషా నటి కూడా. తనకు పాత్ర నచ్చితే అది ఏ తరహాదైనా నటించడానికి వెనుకాడదు. ఇటీవల వడచెన్నైలో ఏ హీరోయిన్ చేయడానికి సాహసించని పాత్రను చేసి మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు మారిన ఈ అమ్మడితో చిన్న చిట్‌చాట్. ప్ర: బిడ్డకు అమ్మగా, మద్యం అలవాటు, దమ్ము కొట్టే అమ్మాయి, బూతులు మాట్లాడే మగువ లాంటి పాత్రలో నటిస్తున్నారు. విమర్శల వలయంలో చిక్కుకుంటారని భయం లేదా? జ: నాకు కథా పాత్ర నచ్చితే ఇక దేని గురించి ఆలోచించను. నటించడానికి అస్సలు వెనుకాడను. నెగటీవ్ టచ్ ఉన్న పాత్రల్లో నటిస్తే నాపై వ్యక్తిగత విమర్శల దాడి చేస్తారని తెలుసు. అయినా అలాంటి వాటి గురించి భయపడను. ఒక్కసారి నటించాలని కమిట్ అయితే ఏ తరహా పాత్రనైనా చేయాలన్నది నా అభిప్రాయం. ఇమేజ్ గురించి ఆలోచిస్తే, ఆ చట్రంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ప్ర:కమలహాసన్‌తో వరుసగా చిత్రాలు చేశారు. అంత పెద్ద నటుడితో నటించేటప్పుడు కంగారు, భయం లాంటివి ఎదుర్కొనేవారా? జ: కమలహాసన్ నటుడిగానూ, రాజకీయనాయకుడిగానూ కొనసాగుతున్నారు. ఆయనంటే నాకెంతో గౌరవం. కమల్ ఉత్తమ నటుడు. అయితే సాధారణంగా నేను ఎక్కవ చిత్రాలు చూడను. నా పాత్రల్లో ఎలా నటించాలన్న దాని గురించే అలోచిస్తాను. అంతే కానీ సహ నటుల నటన గురించి ఎప్పుడూ భయపడింది లేదు. ఇక కమలహాసన్‌తో నటిస్తున్నప్పుడు, జంకు గానీ, భయం కానీ కలగదు. అదే విధంగా నేను కమల్ చిత్రాలు చూస్తూ ఎదిగిన నటిని కాదు. అందుకని ఆయనంటే భయం లేదు. ప్ర: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మీటూ కలకలం సృష్టించడంపై మీ స్పందన? జ:నిజం చెప్పాలంటే మీటూ గురించిన వార్తలను నేను సరిగా చదవలేదు. అయితే అన్ని కాలాల్లోనూ ఈ సమస్య ఉంది. ఇప్పుడే మహిళలకు తమకు జరిగిన అక్రమాల గురించి బహిరంగంగా చెప్పే ధైర్యం, బలం వస్తున్నాయి. భయం కారణంగానే ఇంతకాలం చాలా మంది మహిళలు నోరు మెదపకుండా ఉన్నారు. ఈ తరం వారు ఆ భయాన్ని దాటి మాట్లాడటానికి ధైర్యం చూపుతున్నారు. ఇది మంచి విషయమే. అయితే పది మంది కథలు చెబుతుంటారు. ఇద్దరు ముగ్గురే నిజం చెబుతుంటారు. అలాంటి వారిని మనం గౌరవించాలి. ప్ర: నేత్రదాన అవగాహన కృషి చేస్తున్నారట? జ: అవును. అందరూ నేత్ర దానం చేసేందుకు ముందుకు రావాలి. నేత్రదానం చేయడం మన బాధ్యత. మన జీవితం తరువాత అవి ఇతరులకు జీవితాన్నిస్తాయి. నేనిప్పటికే నేత్రదానం చేశాను. -
నవ దంపతుల నవ్య ఆలోచన
కర్ణాటక, మండ్య: వివాహంతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన నవదంపతులు సమాజానికి ఉత్తమ సందేశం అందించారు.నేత్రదానానికి తమపేర్లు నమోదు చేసి స్ఫూర్తిగా నిలిచారు. జిల్లాలోని పాండవపుర తాలూకా ఈరేనగౌడనకొప్పలు గ్రామానికి చెందిన శృతి, మద్దూరు తాలూకా అబలవాడికి చెందిన తిమ్మేశ్లకు ఆదివారం మండ్యలోని చంద్రదర్శన్ భవనంలో వివాహం జరిగింది. వివాహ కార్యక్రమం ముగిసిన వెంటనే 30వ జాతీయ నేత్రదాన దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన నేత్రదాన నమోదు కార్యక్రమంలో నవదంపతులు పాల్గొని పేర్లు నమోదు చేసుకున్నారు.కొత్త దంపతులు నేత్రదానికి ముందుకు రావడాన్ని అభినందించిన బంధువులు,స్నేహితులు కూడా నేత్రదానంలో పేర్లు నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా తమ వివాహానికి హాజరైన బంధువులు,స్నేహితులకు మొక్కలు అందించారు. -
మరణించి.. మరొకరికి వెలుగునిచ్చి..
పెందుర్తి: మరణంలోనూ ఆమె మరొకరికి వెలుగునిచ్చింది. పెందుర్తి మండలం పినగాడిలో మంగళవారం విద్యుదాఘాతంతో ఓ మహిళ మృత్యువాత పడింది. ఇంటిపై ఉతికిన దుస్తులు ఆరేస్తుండగా సమీపంలోని విద్యుత్ వైర్లు తగలడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. మృతురాలి కళ్ళను కటుంబసభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలివి.. పినగాడి బీసీ కాలనీలో వంటాకుల నాగమణి(48) కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంది. మంగళవారం ఉదయం 8.40 సమయంలో ఉతికిన బట్టలు ఆరబెట్టేందుకు మేడ మీదకు వెళ్ళింది. ఈ క్రమంలో సమీపంలోని విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు నాగమణి చేయి తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న పెందుర్తి సీఐ పి.సూర్యనారాయణ, ఎస్ఐ రామారావు ఘటనాస్థలికి వెళ్ళి వివరాలు సేకరించారు. కేజీహెచ్ ఐబ్యాంక్ ప్రతినిధులు కుటుంబసభ్యులకు నేత్రదానం గురించి వివరించగా నాగమణి నేత్రాలను ఇచ్చేందుకు అంగీకరించారు. వైద్యులు ఆమె కళ్ళను సేకరించారు. -
మాజీ క్రికెటర్ వాగ్ధానభంగం
సాక్షి, చెన్నై: నేత్రదానంపై మాజీ క్రికెటర్ సయిద్ కిర్మాణీ మనసు మార్చుకున్నారు. మతపరమైన విశ్వాసాల కారణంగా కళ్లు దానం చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. చెన్నైలో శనివారం రోటరీ రాజన్ ఐ బ్యాంక్, మద్రాస్ రోటరీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో కిర్మాణీ పాల్గొన్నారు. నేత్రదానం చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. అయితే ఈ వాగ్దానాన్ని వెనక్కు తీసుకున్నట్టు సోమవారం ప్రకటించారు. ‘నాకు భావోద్వేగాలు, నమ్మకాలు ఎక్కువ. అవయవదానంపై డాక్టర్ మోహన్ రాజ్ చేస్తున్న చైతన్య కార్యక్రమాలు నచ్చి నేత్రదానం చేస్తానని వాగ్దానం చేశాను. మత విశ్వాసాల కారణంగా నా ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేకపోతున్నాను. కానీ అందరూ కళ్లు దానం చేయాలని కోరుకుంటున్నాన’ని కిర్మాణీ పేర్కొన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టుకు అనధికారిక అంబాసిడర్‌గా ఉన్న తాను ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రికెటర్ల అంకితభావం ఎంతోగానో ఆకట్టుకుందని, అందుకే నేత్రదానానికి ముందుకు వచ్చానని చెప్పారు. అయితే మతవిశ్వాసాల కారణంగా మాటను నిలుపుకోలేకపోతున్నానని కిర్మాణీ వెల్లడించారు. -
భూమా నేత్రాలు దానం
నూనెపల్లె: నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందగా ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో నేత్రదానం చేసినట్లు ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.విజయ్‌భాస్కర్ రెడ్డి తెలిపారు. నేత్రదానం అనంతరం ఆదివారం ఆయన సురక్ష ఆసుపత్రిలో మాట్లాడారు. గతంలో రామకృష్ణా డిగ్రీ కళాశాలలో నేత్రదానం వారోత్సవాల్లో ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పాల్గొని తాను నేత్రాలను దానం చేస్తానని చెప్పారన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాలు సమర్పించారన్నారు. ఆ మేరకు ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ భూమా కుటుంబ సభ్యులతో ఈ విషయంపై చర్చించి నేత్రదానానికి ఒప్పించారన్నారు. భూమా మృతి తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు నేత్రాలు తీసుకున్నట్లు చెప్పారు. సేకరించిన కళ్లను హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి పంపుతామన్నారు. నేత్రాలను ఆళ్లగడ్డ, కర్నూలు ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, ఎస్.వి.మోహన్‌రెడ్డి, కుమార్తె నాగ మౌనికలు డాక్టర్ విజయ భాస్కర్‌రెడ్డికి అందజేశారు. -
ఒక జన్మ రెండు జీవితాలు
మనిషి ఒకసారి పుట్టి ఒక్కసారే చనిపోతాడు మనలోని అవయవాలు మనతోపాటు పుట్టి మనతోపాటు మరణించవు... మరొకరికి కూడా జీవితాన్నిస్తాయి. ఒక మనిషికి చూపునిచ్చిన రెండు కళ్లు... ఆ వ్యక్తి మరణించిన తర్వాత మరో ఇద్దరికి చూపునిస్తాయి అందుకు... నేత్రదానం అనే ఒక మహోన్నతమైన గుణంతో పాటు కార్నియా రీప్లేస్మెంట్ అనే అత్యంత నైపుణ్యమైన చికిత్స తోడవ్వాలి. నేత్రదానం అంటే... కళ్లను దానం చేయడం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి కళ్లను తీసి మరొకరికి అమర్చడం అన్నమాట. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రెండు కళ్లలో ఒక్కొక్క కంటిని ఒక్కొక్కరికి అమరుస్తారు. కాబట్టి ఒకరు నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛందంగా జరుగుతున్న మహోన్నత కార్యక్రమం. సమాజంలో కార్నియా దెబ్బతినడం కారణంగా దృష్టిలోపంతో బాధపడుతున్న వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. నేత్రదానం ప్రతిజ్ఞ చేసిన వారు తక్కువమంది ఉన్నారు. ఏడాదికి రెండు లక్షల కార్నియాల అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం ఏడాదికి దాదాపు 45వేలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. పేషెంటుకి దెబ్బతిన్న కార్నియా (కంటి మీద ఉండే పారదర్శకమైన పొర)ను తొలగించి, దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కార్నియాను అమరుస్తారు. దీనిని కార్నియా రీప్లేస్మెంట్ లేదా కెరటోప్లాస్టీ, కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటారు. ఈ సర్జరీ చేయడానికి నేత్రదాత బ్లడ్‌గ్రూప్ – గ్రహీత బ్లడ్‌గ్రూప్ ఒకటే కావాల్సిన అవసరం లేదు. అంటే ఆ రెండూ మ్యాచ్ కావాల్సిన అవసరం లేదన్నమాట. కార్నియా పారదర్శకంగా ఉంటూ బయటి దృశ్యాలను కంటి లోపలికి చేరవేస్తుంది. కార్నియాలోని పారదర్శకత లోపించినప్పుడు అది రెటీనాకు సరైన సమాచారాన్ని చేరవేయలేదు. దానిని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే... పాడైన కార్నియాను తొలగించి ఆరోగ్యకరమైన కార్నియాను అమర్చడమే మార్గం. దాత నుంచి సేకరించిన తర్వాత కంటి వైద్యనిపుణులు కార్నియాను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇన్నర్ లేయర్ (ఎండోథీలియమ్) శక్తిని పరీక్షిస్తారు. అది సరిగ్గా ఉంటే ....ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ ద్వారా, దానిని అవసరమైన వారికి అమరుస్తారు. ఎవరెవరికి అవసరం ∙సూడోపేకిక్ బుల్లస్ కెరటోపతి ∙కెరటోకోనస్ ∙కార్నియాకు గాయాలు (కార్నియల్ ఇంజ్యురీస్) ∙కార్నియల్ డీ జనరేషన్ ∙ కార్నియల్ అల్సర్స్ ∙ఎండోథీలియల్ డీ–కంపెన్సేషన్ ∙పుట్టుకతోనే తెల్లటి కార్నియా ఉండటం (కంజెనిటల్ కార్నియల్ ఒపాసిటీ) ∙కెమికల్ బర్న్స్ (అంటే రసాయనాల వల్ల కార్నియా దెబ్బతినడం). ఇలా సేకరిస్తారు! ∙మరణానంతరం ఆరు గంటలలోపు కళ్లను సేకరించాలి ∙అంతవరకు మృతుని కనురెప్పలను మూసి, కళ్ల మీద తడిగుడ్డ లేదా దూదిని లేదా ఐస్ ముక్కలను ఉంచాలి ∙తల ఎత్తులో ఉండేటట్లు చూడాలి, తలకింద రెండు తలగడలు ఉంచాలి ∙మృతదేహం ఉన్న గదిలో ఫ్యాన్ వేయకూడదు. దీనివల్ల కార్నియా డ్రైగా మారి చెడిపోయే అవకాశం ఉంది. కానీ గది వీలైనంత వరకు చల్లగా (లో–టెంపరేచర్‌తో) ఉండాలి ∙అధునాతనమైన పరికరాలు అందుబాటులో ఉన్న ప్రస్తుత నేపథ్యంలో కంటి నల్లగుడ్డు మీద ఉండే కార్నియాను మాత్రమే సేకరిస్తున్నారు. కాబట్టి నేత్రదానం చేసినా కంటి ఆకారంలో మార్పు కనిపించదు. ఒకవేళ పాత పద్ధతిలో కంటిని మొత్తంగా తీసినట్లయితే ఆ స్థానంలో కృత్రిమ కంటిని అమర్చుతారు. పార్థివ దేహం మామూలుగా కళ్లు మూసుకుని ఉన్నట్లే కనిపిస్తుంది ∙కార్నియాను సేకరించిన తర్వాత దాన్ని కార్నియా బ్యాంకు (ఐ–బ్యాంకు)లో ఉంచుతారు. ఆ తర్వాత మరొకరికి అమర్చుతారు ∙వీలైనంత త్వరగా కంటిని సేకరించేందుకు వీలుగా ఐ బ్యాంక్ ప్రతినిధులు, వైద్యనిపుణులు వచ్చేలోపే... మరణించిన వ్యక్తి తాలూకు డెత్ సర్టిఫికేట్, మెడికల్ రికార్డ్స్ సిద్ధంగా ఉంచడం మంచిది ∙మృతునికి వారసులుంటే వారి అనుమతి తప్పనిసరి. ఆపరేషన్ తర్వాత వచ్చే సాధారణ సమస్యలు ఇవి... ఆపరేషన్ తర్వాత గాయం మానే సమయంలో కొందరికి ఐసైట్లో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ∙ఫారిన్బాడీని దేహం అనుమతించనప్పుడు కొత్త కార్నియాకు వ్యతిరేకంగా బతికి ఉన్న దేహం రియాక్ట్ అయితే (గ్రాఫ్ట్ రిజెక్షన్) ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ కాదు. సాధారణంగా ఎదురయ్యే సమస్య ఇదొక్కటే ∙కార్నియల్ గ్రాఫ్ట్ ఇన్ఫెక్షన్... ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత కంటిలోపల ఇన్ఫెక్షన్ వస్తే సర్జరీ లక్ష్యం నెరవేరదు. అయితే ఈ సమస్య ఇటీవల కనిపించడం లేదు ∙గ్లకోమా... కార్నియల్ రీప్లేస్మెంట్ తర్వాత రోగిలో గ్లకోమా లక్షణాలు కనిపిస్తే, కంటి నరాల్లో ఒత్తిడి పెరిగి ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటుంది. అప్పుడు చూపును తిరిగి తీసుకురావడం కష్టం. అయితే. ఇది తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. వీటన్నింటిని అధిగమించ గలిగిన టెక్నాలజీ అభివృద్ధి చెందింది. దీనిని లామెల్లార్ కెరటోప్లాస్టీ అంటారు. కాబట్టి ఆపరేషన్ తర్వాత ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని, వాటిని నివారించగలిగిన చికిత్స విధానాలు కూడా ఇటీవల బాగా అభివృద్ధి అయ్యాయి. అపోహలు–వాస్తవాలు 1. అపోహ:కళ్లను దానం చేసి... కళ్లు లేని దేహాన్ని ఖననం లేదా దహనం చేస్తే మరుసటి జన్మలో కళ్లు లేకుండా పుడతారని, అందుకు మతాలు ఒప్పుకోవనేది ఒక అపోహ. వాస్తవం: ఇది నిరాధారమైన అపోహ మాత్రమే. నిజానికి ఏ మతమైనా దాతృత్వాన్నే ప్రబోధిస్తుంది. 2. అపోహ:కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ల కళ్లు నేత్రదానానికి పనికిరావు. వాస్తవం: కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నా సరే... కళ్లను దానం చేయవచ్చు. 3. అపోహ: ముసలివాళ్ల కళ్లు దానానికి పనికిరావు. వయసులో ఉన్న వాళ్ల కళ్లు మాత్రమే పనికివస్తాయి. వాస్తవం: ఏడాది వయసు నిండిన పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవరైనా సరే... అందరూ నేత్రదానం చేయవచ్చు. 4. అపోహ: బతికి ఉన్న వాళ్లు కూడా జీవించి ఉండగానే కళ్లు దానం చేయవచ్చా? వాస్తవం: కేవలం చనిపోయినవారి నుంచి మాత్రమే కళ్లను స్వీకరిస్తారు. ఒకవేళ తమ దగ్గరి వారికి ఏదైనా సమస్య వచ్చి వారు కళ్లను కోల్పోతే... తల్లిదండ్రులు లేదా ఎంత దగ్గరి బంధువులైనా భావోద్వేగాలతో ముందుకు వస్తే... వారి కళ్లను బతికి ఉండగా స్వీకరించరు. నేత్రదానం ఎవరెవరు చేయవచ్చు? ⇔ నేత్రదానం చేయాలనుకున్న వాళ్లు సంబంధిత సంస్థలను సంప్రదించి ప్రతిజ్ఞ చేయాలి. అలాగే ప్రతిజ్ఞ చేయకుండా మరణించిన వారి కళ్లను కూడా వారి పిల్లలు, న్యాయ/చట్టపరమైన వారసులు దానం ఇవ్వవచ్చు. ⇔ నేత్రదానానికి వయసుతో నిమిత్తం లేదు. నేత్రదానానికి వార్ధక్యం ఏ మాత్రం అడ్డుకాదు. ⇔ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారు, కళ్లజోడు ధరించేవారు, బీపీ, షుగర్, ఉబ్బసం, టీబీ వంటి వ్యాధులు ఉన్న వారు కూడా కార్నియా ఆరోగ్యంగా ఉంటే నేత్రదానం చేయవచ్చు. వీళ్లు చేయకూడదు! ⇔ ఎయిడ్స్, హెపటైటిస్, రుబెల్లా, మలేరియా, సిఫిలిస్ వంటి అంటువ్యాధులున్న వారు, క్రెజ్డ్ఫోల్డ్ జాకబ్ డిసీజ్, అల్జీమర్స్, మల్టిపుల్ స్కెర్లోసిస్, బ్లడ్ క్యాన్సర్, ట్యూమర్లు ఉన్నవారు, మత్తుపదార్థాలు వాడేవారు నేత్రదానానికి అర్హులు కారు (నేత్రదానం కోసం ప్రతిజ్ఞ చేసే నాటికి పై సమస్యలు లే కున్నా, ఆ తర్వాత సంక్రమించే ప్రమాదం ఉంది కాబట్టి... ప్రతిజ్ఞ చేసి చనిపోయిన వ్యక్తి నుంచి కార్నియాతోపాటు రక్తాన్నీ సేకరిస్తారు. రక్తపరీక్షలు చేసి పై అనారోగ్యాలేవీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ కార్నియాకు రీప్లేస్‌మెంట్‌కి అర్హత వస్తుంది. ⇔ విషప్రభావంతో మరణించిన వారి కళ్లు పనికిరావు. వాటిని సేకరించే ప్రయత్నం కూడా జరగదు. - డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
నేత్రదానంతో అంధులకు వెలుగునిద్దాం
నెల్లూరు(అర్బన్):ప్రతి ఒక్కరూ నేత్ర దానం చేయడం ద్వారా చీకట్లో మగ్గుతున్న అంధులకు వెలుగునిద్దామని జెసీ–2 రాజ్‌కుమార్ పేర్కొన్నారు. నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం స్థానిక గాంధీబొమ్మ వద్ద నుంచి మద్రాసు బస్టాండ్ వరకు నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని జేసీ–2 ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి మరణించి కూడా ఇద్దరి జీవితాలకు వెలుగును పంచే మహత్తర పుణ్యకార్యక్రమం నేత్రదానమని తెలిపారు. కుటుంబ సంప్రదాయంగా నేత్రదానం ర్యాలీ అనంతరం మద్రాసుబస్టాండ్ వద్ద ఉన్న రెడ్‌క్రాస్ భవనంలో నేత్రదాన ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎం.మంజులమ్మ మాట్లాడారు. నేత్రదానాన్ని కుటుంబ సంప్రదాయంగా మార్చుకుందామని తెలిపారు. అనంతరం నేత్రదాన మోటివేటర్లను జ్ఞాపికలతో సత్కరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు అధ్యక్షత వహించిన ఈ సభలో పెద్దాస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల, డీసీహెచ్ డాక్టర్ సుబ్బారావు, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీదేవి, బ్లడ్ బ్యాంకు చైర్మన్ డాక్టర్ ఏవీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులకు ప్రశంసా పత్రాలు
కర్నూలు: నేత్రదానం చేయడానికి కృషి చేసిన పోలీసు అధికారులకు ఎల్.వి.ప్రసాద్ ఐ–ఇన్స్టిట్యూట్ పంపిన ప్రశంసా పత్రాలను ఎస్పీ ఆకే రవికృష్ణ సిబ్బందికి అందజేశారు. నేత్రదాన పక్షోత్సవాలు చివరిరోజు సందర్భంగా గురువారం సీఐలు మధుసూదన్‌రావు, నాగరాజారావు, ఎస్ఐలు మల్లికార్జున, చంద్రబాబు నాయుడు, మహేష్‌కుమార్, ఏఎస్ఐ రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజు, ఎస్.ఎం.బాషా, శ్రీనివాసులు, మాస్టర్ సుకుమార్ తదితరులు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు. రామయమ్మ అంతర్జాతీయ నేత్ర నిధి డిపార్ట్మెంట్ వారికి నేత్రదానం కోసం పోలీసు అధికారులు సహకరించినందుకు ఎల్.వి.ప్రసాద్ ఐ–ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ద్వారా గుర్తించిన సిబ్బందికి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ప్రశంసాపత్రాలను అందజేశారు. నేత్రదానంపై త్వరలో హిందీ పాట రాసి స్వయంగా విడుదల చేసి ఇతర రాష్ట్రాలకు తెలిసేలా యువతను చైతన్యపరచనున్నట్లు ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. నేత్రదానం పాటకు కృషి చేసిన డైరెక్టర్ శశిధర్‌రెడ్డి, మ్యూజిక్ ఫయూం, జుబేర్ అహ్మద్‌లను ఎస్పీ అభినందించారు. -
నేత్రదానానికి 400 మంది అంగీకారం
కర్నూలు(హాస్పిటల్) : స్థానిక మారుతినగర్లో ఉన్న ప్రతిభ డీఎడ్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు 400 మంది నేత్రదానానికి ముందుకు రావడం అభినందనీయమని కర్నూలు మెడికల్æకాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ అన్నారు. కాలేజీలో గురువారం నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. నేత్రదానంతో ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు. మరణించిన తర్వాతే నేత్రాలను సేకరిస్తారని, దీనిపై అపోహలను తొలగించుకోవాలన్నారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు నేత్రదానం చేస్తూ అంగీకార పత్రాలను అందజేశారు. ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ కె.ఆంజనేయులు, ప్రతిభ డీఎడ్ కళాశాల గౌరవ సలహాదారు అరుణాచలంరెడ్డి పాల్గొన్నారు. -
కుటుంబ సాంప్రదాయంగా నేత్రదానం
నెల్లూరు(అర్బన్): కుటుంబ సాంప్రదాయంగా నేత్రదానాన్ని మారుద్దామని జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ మంజుల అన్నారు. నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని శనివారం స్థానిక కరంటాఫీసు సెంటర్లోని వెంకటేశ్వర ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా మంజుల మాట్లాడారు. తాను మరణించినా మరో ఇద్దరి అంధులకు దృష్టి దానం చేసే మహత్తర పుణ్య కార్యక్రమం నేత్రదానమన్నారు. మన పక్కనుండే శ్రీలంక దేశస్థులు విరివిగా నేత్రదానం చేస్తూ ప్రపంచంలో ముందు వరసలో ఉన్నారన్నారు. శ్రీలంక నుంచే ఎక్కువగా విదేశాలకు నేత్రాలకు చెందిన కార్నియాలు అందుతున్నాయన్నారు. అదే స్ఫూర్తితో భారత్‌లో కూడా ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి అంధులకు వెలుగులు ప్రసాదించాలని కోరారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేత్రాదానానికి సంబంధించిన వివరాలన్నింటిని ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సినీ నటి రెజీనా నేత్రదానం
నెల్లూరు (అర్బన్): ప్రముఖ సినీనటి (సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఫేమ్) రెజీనా రెజీనా కాసాండ్ర తన నేత్రాలను దానం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. తన మరణాంతరం అంధులకు తన నేత్రాలను అమర్చాలని కోరుతూ అంగీకారపత్రంపై మంగళవారం ఆమె నెల్లూరులో సంతకం చేశారు. నెల్లూరులోని డాక్టర్ అగర్వాల్ నేత్ర ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన నేత్రదానాన్ని ప్రకటించారు. ఆస్పత్రిలోని ఐ-బ్యాంకును ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన దేశంలో మూడు మిలియన్ల మంది అంధులు నేత్రదాతల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. నెల్లూరు రూరల్, నగర నియోజకవర్గ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు శ్రీనివాసయాదవ్, రాజానాయుడు, ఆస్పత్రి సీఈవో డాక్టర్ అదిల్ అగర్వాల్, మెడికల్ డెరైక్టర్ డాక్టర్ శివప్రతాపరెడ్డి పాల్గొన్నారు. -
నేత్రదానం చేయాలని నిర్ణయించుకున్న హీరోయిన్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన అందమైన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకుంది. ఇదివరకు హిందీలో సింగం, స్పెషల్ 26 సినిమాల్లో మెరిసిన కాజల్ బాలీవుడ్లో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనుంది. రణదీప్ హూడా సరసన ఆమె నటించిన 'దో లఫ్జోంకీ కహానీ' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్ తొలిసారి అంధురాలిగా కనిపించనుంది. చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుని ఆ పాత్ర చేశానని చెబుతోంది కాజల్. ఆ పాత్రను సహజంగా పండించేందుకు అంధులైన విద్యార్థులను కలిసింది. పలువురు అంధులతో కలిసి పనిచేసింది. వారిని దగ్గరగా గమనించిన కాజల్.. మరణానంతరం తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకుంది. చిన్న చిన్న పనులకు కూడా ఎంత కష్టపడాలో అంధులను దగ్గరగా చూసిన తర్వాతే తెలిసిందని, అంధురాలి పాత్ర తనలో మార్పు తీసుకొచ్చిందని అంటోంది కాజల్. చూపు విలువ తెలిసొచ్చిందని.. అందుకే తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అలాగే ఆమెతో నటించిన హీరో రణదీప్ హూడా కూడా తన కళ్లను దానం చేసేందుకు నిర్ణయించుకున్నారు. కాగా అవయవ దానం పట్ల అవగాహన పెరుగుతోంది. పలువురు ప్రముఖులు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో నాగార్జున, అమల దంపతులు అవయవ దానం విషయంలో నిర్ణయం తీసుకోగా, బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, సల్మాన్ కాన్, ఆమీర్ ఖాన్లు ముందున్నారు. -
నేత్రదానంపై ఎస్పీ గానం
సెవెన్‌స్టార్ మ్యూజికల్ సెంటర్లో గానం చేస్తున్న ఎస్పీ కర్నూలు: నేత్రదానంపై ప్రజలను చైతన్యపరచి లక్ష మందిని ఒప్పించే లక్ష్యంతో ఉన్నట్లు ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. ‘నేత్రదానం చేయండి.. మరో ఇద్దరు అంధులకు వెలుగునివ్వండి, మరణంలోనూ జీవించండి’ అంటూ నేత్రదానంపై ఎస్పీ ఓ పాట రాశారు. స్వయంగా సంగీతం సమకూర్చుకుని పాడా రు. కర్నూలు ఆంధ్ర కిచెన్ వేర్ సమీపంలోని సెవెన్‌స్టార్ మ్యూజికల్ సెంటర్లో థ్రిల్లర్ తెలుగులో మొదటి పాప్ గీతం పాడి ఆడియో, వీడియోల రూపంలో బుధవారం సీడీలను విడుదల చేశారు. ఎస్పీ దంపతులు నేత్రదాన పత్రాలపై ఇదివరకే సంతకాలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అవయవదాన పత్రాలపై కూడా సంతకాలు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నేత్రదానంపై ఆలపించిన గానంను యూట్యూబ్‌లో చూడవచ్చన్నారు. ఈ గీతాన్ని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు అంకితమిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
ప్రణయ్ కళ్లను దానం చేసిన తల్లిదండ్రులు
విజయవాడ: గొల్లపూడి ప్రమాదం ఘటనలో మృతిచెందిన ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థి మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం విద్యార్థి ప్రణయ్ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు. కొడుకు చనిపోయాడన్న పుట్టెడు దు:ఖంలోనూ ప్రణయ్ కళ్లను ఆ తల్లిదండ్రులు స్వేచ్ఛ ఐ బ్యాంకుకు దానం చేశారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
480 మంది నేత్రదానానికి అంగీకారం
ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అంగీకారపత్రాలు అందజేత చేవెళ్ల రూరల్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడకు చెందిన 480 మంది గ్రామస్తులు నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఆదివారం వీరంతా కలసి చేవెళ్ల ఆర్డీవో చంద్రమోహన్ చేతుల మీదుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నికల్ డెరైక్టర్ కిషన్‌రెడ్డికి నేత్రదాన అంగీకారప్రతాలు అందజేశారు. ఇదే మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చిన ఇక్కారెడ్డిగూడవాసులు అభినందనీయులని ఆర్డీవో కొనియాడారు. -
కొత్తగూడెంలో మహిళ నేత్రదానం
కొత్తగూడెం (ఖమ్మం) : మనం చనిపోయినా మన కళ్లు మరొకరికి చూపునివ్వడానికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఓ మహిళ తన కళ్లను దానం చేసింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణ పరిధిలోని గొల్లగూడకు చెందిన కటకం లక్ష్మి(48) గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ శనివారం మృతిచెందింది. కాగా తాను మరణించాక తన కళ్లను దానం చేయాలని ఆమె ముందే కోరడంతో.. ఆమె ముగ్గురు కూతుళ్లు ఖమ్మం నేత్ర నిధికి ఆమె కళ్లను దానం చేశారు. -
నాస్తికోద్యమ నేత లవణం అస్తమయం
* శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ కన్నుమూత * అంతిమ కోరిక మేరకు నేత్రదానం * ప్రముఖుల సంతాపం సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ కుమారుడైన లవణం తండ్రి నుంచి నాస్తికత్వం, సంఘసేవ అలవరుచుకున్నారు. చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహం జరిగే సమయంలో జన్మించడంతో గోరా తన కుమారుడికి ‘లవణం’ అని పేరు పెట్టారు. చిన్ననాటి నుంచే సంఘసేవలో పాల్గొని అస్పృశ్యత, మూఢనమ్మకాలు, జోగిని దురాచార నిర్మూలనకు, నేరస్తులను సంస్కరించేందుకు అవిశ్రాంత పోరాటం చేశారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. ముప్పైకి పైగా దేశాల్లో పర్యటించి నాస్తికోద్యమాన్ని ప్రచారం చేశారు. నాస్తిక వారపత్రిక సంఘం, ఆర్థిక సమత, నాస్తికమార్గం, హిందీ పత్రిక ఇన్సాన్, ఇంగ్లిష్ మాసపత్రిక ఎథియిస్ట్ నిర్వహణలో లవణం ప్రముఖ పాత్ర వహించారు. భూదాన, సర్వోదయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1960లో మహాకవి జాషువా కుమార్తె హేమలతను వివాహం చేసుకున్నారు. 1962లో తలపెట్టిన ప్రపంచ శాంతియాత్రలో లవణం పాల్గొన్నారు. 1966-67లో అమెరికాలో శాంతి ఉద్యమంలోనూ, మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వాన పౌరహక్కుల ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో సహాయ పునర్నిర్మాణ మహాసభలలో పాల్గొన్నారు. 2005లో నక్సలైట్ల సమస్య పరిష్కారానికి గట్టి కృషి సల్పారు. 2006లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్వర్ణో త్సవాల ముగింపు సభలో హింసలేని విప్లవం, అవినీతిలేని ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధుల బాధ్యతపై ఆయన ప్రసంగించారు. ఆయన తన జీవితమంతా సమాజ పరివర్తనకు కృషి చేశారు. ఆయన కోరిక మేరకు కళ్లను స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకుకు దానం చేశారు. భౌతికకాయాన్ని శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు అప్పగిస్తారు. లవణం భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ వివరాలు గోరా తొమ్మిది మంది సంతానంలో లవణం రెండో వారు. లవణంకు సంతానం లేదు. సతీమణి హేమలత 2008లో కన్నుమూశారు. ప్రముఖ వైద్యుడు జి.సమరం, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్యకు లవణం సోదరుడు. లవణం మృతికి సీఎంల సంతాపం గోపరాజు లవణం మృతికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. జోగినుల జీవితాలను మెరుగు పరిచేందుకు నిజామాబాద్ జిల్లాలో రెండు దశాబ్దాల క్రితం లవణం సతీమణి హేమలతతో కలసి పనిచేసిన అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలనకు సామాజిక కార్యకర్తగా లవణం చేసిన కృషిని ప్రస్తావించారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడిన లవణం మృతి నాస్తికోద్యమానికే కాకుండా రాష్ట్రానికే తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ జగన్ సంతాపం సంఘ సంస్కర్త డాక్టర్ లవణం మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. సమాజంలో బడుగుల అభ్యున్నతికీ, కుల వ్యవస్థ నిర్మూలనకూ లవణం చేసిన కృషిని కొనియాడారు. వర్నిలో విషాదం వర్ని(నిజామాబాద్): నాస్తికోద్యమ నేత గోపరాజు లవణం మృతితో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని వర్ని ప్రాంతంతో ఆయనకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. 1997లో వర్నికి చెందిన మార్ని రామకృష్ణారావు హేతువాద సభలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు లవణంతో పరిచయమైంది. వర్ని ప్రాంతంలో ప్రబలంగా ఉన్న చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాల గురించి రామకృష్ణారావు ద్వారా తెలుసుకున్న లవణం దంపతులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించారు. లవణం స్ఫూర్తితో వర్నిలో 1980లో నాస్తిక మిత్ర మండలి ఏర్పాటు చేశారు. జిల్లాలో జోగిని వ్యవస్థ దురాచారానికి ఎందరో మహిళలు బలవుతున్నారని గమనించి నాటి గవర్నర్ కుముద్ బిన్ జోషి, జిల్లా కలెక్టర్ ఆశామూర్తితో చర్చించి ఆ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. అభాగ్యులైన మహిళల కోసం 1985లో ఇక్కడ ‘చెల్లి నిలయం’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా జోగినులకు వివాహాలు జరిపించారు. ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా 1997లో ప్రకృతి చికిత్సాలయూన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలందించారు. ఆయనతో కలసి పనిచేసిన కొందరు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లారు. -
ఆ మృగాన్ని శిక్షిస్తేనే వారి ఆత్మకు శాంతి
హైదరాబాద్ : ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది మొదలు..తిరిగి ఇంటికొచ్చే దాకా.. గంట గంటకు ఫోన్ చేసేవారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పేవారు... ..అమ్మా వేళకు బస్సు దొరికిందా? నువ్వు క్షేమంగా ఆఫీసుకు చేరుకున్నావా....జాగ్రత్తగా వెళ్లు..భోజనం చేశావా.. .ఇంటికొచ్చేటప్పుడు జాగ్రత్త అంటూ నా కన్నతల్లిలా నా బిడ్డలు నన్ను ఫోన్లో పలకరించేవారు. వాళ్లు చదువుల సరస్వతులు. నేను ఎన్ని కష్టాలొచ్చినాసరే వారిని బాగా చదివించాలనుకున్నాను. నా బంగారు తల్లుల కలలు నిజం చేయాలనుకున్నాను. కానీ వాడు నా ఇద్దరు బిడ్డలను దారుణంగా చంపేశాడు....దుఖఃతో హైమావతి గొంతు జీరబోయింది. ఉన్మాది ఘాతుకానికి తన ఇద్దరు కూతుళ్లను కోల్పోయి వారం గడిచినా ఆమె ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది. నిత్యం యామినీ సరస్వతి,శ్రీలేఖలతో ఆనందంగా గడిపే ఆ తల్లి ఇపుడు బతికున్న శవంలా కాలం వెళ్లదీస్తోంది. ఇటీవల ఇద్దరు అక్కాచెల్లెళ్లను ప్రేమోన్మాది అమిత్‌సింగ్ అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన ఆ తల్లి మాత్రం పుట్టెడు దుఖఃతో తల్లడిల్లుతోంది. తన కంటికి రెప్పలా కాపాడుకున్న ఇద్దరు కూతుళ్లను కోల్పోవడంతో వెక్కి వెక్కి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయి ధీనంగా చూస్తోంది. కోటి ఆశలు పెట్టుకొని గారాబంగా పెంచుకున్న తన ఇద్దరు కూతుళ్లను కోల్పోయి మౌనంగా రోదిస్తోంది. అత్యంత దారుణం.. హైమావతి కూతుళ్లు యామినీ సరస్వతి(22), శ్రీలేఖ(21)లను ఈనెల 14న ఉదయం 8.30 గంటలకు కొత్తపేట్‌లో వారు అద్దెకుంటున్న ఇంట్లోనే అమిత్‌సింగ్ అనే ఉన్మాది పాశవికంగా చంపి పారిపోయాడు. ఈ జంట హత్యలు జరిగి మంగళవారానికి సరిగ్గా వారమైన నిందితుడి ఆచూకీ మాత్రం ఇంకా చిక్కలేదు. కనీసం పుట్టెడు శోకంలో ఉన్న హతురాళ్ల తల్లిని ఓదార్చే విషయంలో సర్కారు పెద్దలకు మనసు రాలేదు. నిందితున్ని గంటల్లో పట్టుకుంటామని హత్య జరిగిన రోజు హడావుడి చేసిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం వారి దుఖాఃన్ని మరింత పెంచుతోంది. హస్తినాపురం(వనస్థలిపురం)లో నివాసం ఉంటున్న ఆమె సోదరుడు చౌదరిరెడ్డి ఇంట్లో తలదాచుకున్న హైమావతిని మంగళవారం 'సాక్షి' ప్రతినిధి పలకరించగా..ఆ తల్లి కన్నీళ్ల పర్యంతమైంది. కూతుళ్లే నాకు సర్వస్వం.. ఇరవై రెండేళ్లుగా నా కూతుళ్లే నాకు సర్వస్వం. వారి కోసమే నేను బతుకుతున్నా. ఇద్దరూ చదువుల్లో సరస్వతీ పుత్రులే. పెద్దమ్మాయి యామిని(22)ఇంజినీరింగ్ పూర్తిచేసింది. చదువులో ఎప్పుడూ టాప్ ర్యాంకరే. షాద్‌నగర్‌లో చదువుకున్నప్పుడు ఎస్సెస్సీలో టాపర్‌గా నిలిచింది. ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తిచేసింది. బ్యాంకు పీఓ పోస్టు పరీక్షకు సన్నద్ధమౌతోంది. వారి ఉన్నత చదువుల కోసమే ఏడాది క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చాం. ప్రభుత్వ ఉన్నతోద్యోగం సాధించడమే యామిని ధ్యేయం. చిన్నమ్మాయి శ్రీలేఖ(21) చేవెళ్లలోని సాగర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఈమె కూడా చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకరే. అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్నది ఆమెలక్ష్యం. ఇన్నేళ్లుగా నేను వారి కోసమే బతుకుతున్నా. వారి బంగారు భవిష్యత్ కోసమే కష్టపడుతున్నా. అప్పుడప్పుడూ నేను వారితో గడపాలని కోరితే వెంటనే ఉద్యోగానికి సెలవు పెట్టేదాన్నని హైమావతి జీరబోయిన గొంతుతో చెప్పింది. పరామర్శకు కూడా నోచుకోలేదు... ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన నన్ను హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు లకా్ష్మరెడ్డి,జూపల్లి కృష్ణారావులు కనీసం పరామర్శించలేదు. అమిత్‌సింగ్ తప్పించుకు తిరుగుతున్నా వాడిని వారం రోజులుగా పోలీసులు పట్టుకోలేకపోయారు. నా కూతుళ్లను పాశవికంగా చంపేసిన ఆ మృగాన్ని కఠినంగా శిక్షిస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. భవిష్యత్‌లో ఆడపిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసుకోవాలంటే ఇలాంటి మృగాలను సమాజంలో బతకనీయకూడదు. మరొకరికి చూపునిచ్చిన అక్కాచెల్లెళ్లు... హత్యకు గురైన యామినీ సరస్వతి, శ్రీలేఖల నేత్రాలను ఎల్వీప్రసాద్ ఐ ఇన్సిట్యూట్‌కు దానం చేశారు. మరణించినా ఆ ఇద్దరు సరస్వతులు ఇంకొకరి జీవితాల్లో వెలుగులు నింపడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తల్లి హైమావతి అంగీకారం మేరకే ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో వారి నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్సిట్యూట్ నిపుణులు సేకరించారు. నా చేతులతో పెంచా... చిన్నప్పటి నుంచి నేను ఆ ఇద్దరమ్మాయిలతోనే ఉంటూ వారి ఆలనా పాలనా చూస్తూ నా చేతులతోనే అల్లారుముద్దుగా పెంచా. హత్య జరిగిన రోజు నేను ఇంట్లో ఉండి ఉంటే నా ప్రాణం అడ్డుపెట్టి మరీ ఆ పిల్లలను దక్కించుకునే దాన్ని. ఆ మృగాన్ని కఠినంగా శిక్షించాలి. - నారమ్మ, హతురాళ్ల అమ్మమ్మ -
మూర్తి.. సేవా స్ఫూర్తి
రక్త, నేత్రదానాలతో ప్రోత్సాహం పేదలకు ఆర్థికంగా చేయూత 25 ఏళ్లుగా సేవే పరమావధిగా.. రామచంద్రపురం :ఆయన పేరు తొగరు మూర్తి.. కాలేజీ వయస్సు నుంచి సేవే పరమావధిగా ముందుకుసాగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. 25 ఏళ్లుగా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ఎవరైనా రక్తం కావాలని అడగడమే తరువాయి. వెంటనే స్పందించే గుణం ఆయనది... సేవా ప్రస్థానం ప్రారంభం ఇలా.. మూర్తి బీకాం చదువుతున్న రోజుల్లో కాలేజీ బయట తన స్నేహితుడు శ్రీధర్ ప్రమాదానికి గురయ్యాడు. రక్తం కావాల్సి వస్తే తన స్నేహితులు నలుగురితో కలిసి మూర్తి రక్తాన్ని అందించారు. తమ కుమారునికి పునర్జన్మ ప్రసాదించారంటూ శ్రీధర్ తల్లిదండ్రులు ప్రదర్శించిన కృతజ్ఞతాభావం మూర్తిలో సేవా భావాన్ని తట్టిలేపింది. రక్తం లేక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని తెలుసుకున్న మూర్తి వెంటనే తన నలుగురు స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసిన రక్షా ఫౌండేషన్ ద్వారా గత 25 ఏళ్లలో జిల్లావ్యాప్తంగా సుమారుగా 12వేల మందికి రక్తాన్ని అందించారు. మూర్తిగానే సుపరిచితులు తొగరు ఆదినారాయణ, మంగామణి దంపతుల పెద్దకుమారుడు తొగరు సత్యనారాయణమూర్తి. ఆయన అందరికీ మూర్తిగానే సుపరిచితులు. 1989 నుంచి రక్షా ఫౌండేషన్ ద్వారా యువకులకు, రక్త, నేత్రదానంపై అవగాహన కల్పించడంతోపాటుగా ఇప్పటివరకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు 11 జతల నేత్రాలను కూడా అందించారు. గత 25 ఏళ్లుగా ఇప్పటివరకు మూర్తి 50సార్లు స్వయంగా రక్తదానం చే సి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. రోటరీ క్లబ్ మేనేజర్ డాక్టర్ కామరాజు, సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తో పాటుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నుంచి కూడా మూర్తి ప్రశంసలదుకున్నారు. పేదలకు సాయం చేయడంలోనూ ముందు రక్తదానమే కాకుండా పేదలకు సాయం చేయటంలోనూ మూర్తి ముందుంటారు. ఎందరో నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించి ఉపాధి మార్గాన్ని చూపించారు. పేదవారి వివాహాలకు కూడా ఆర్థిక సాయాలు అందించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే సంజీవిని 108ను ఉంచేందుకు చోటు లేకపోతే. పట్టణంలోని డీసీసీబీ బ్యాంకు వద్ద రూ.10వేలతో షెడ్డును ఏర్పాటు చేశారు. ఓటరు అవగాహన సదస్సుల ఏర్పాటుతోపాటు, బాల కార్మికుల సంక్షేమం గురించి పోరాటం చేయడంలోనూ మూర్తి ముందుంటారు. స్థానిక వైఎస్సార్ నగర్లో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో వాకర్స్ క్లబ్ గౌరవాధ్యక్షునిగా కూడా మూర్తి పనిచేస్తున్నారు. క్రీడాప్రాంగణంలో సదస్సులు ఏర్పాటు చేసి నడకతో కలిగే ప్రయోజనాలు, యోగా ద్వారా కలిగే ఆరోగ్య ఉపయోగాల గురించి తెలియజేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే తలంపుతోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు మూర్తి చెబుతున్నారు. -
చిలుకూరు.. వెలుగురేఖలు!
- నేత్రదానానికి ముందుకొచ్చిన 2వేల మంది గ్రామస్తులు - రేపు అంగీకార పత్రాలపై సంతకాలు చేసేందుకు సన్నద్ధం - ‘మాధవనేత్రం’ స్వచ్ఛంద సంస్థకు అప్పగించేందుకు సన్నాహాలు మొయినాబాద్: హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామం అందరికీ సుపరిచితమే. చిలుకూరు గ్రామ పంచాయతీకి దేవంల్వెంకటాపూర్, అప్పోజీగూడ అనుబంధ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం జనాభా 7,265 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,900 మంది, మహిళలు 3,365 మంది. గ్రామంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. చాలా మంది వ్యవసాయంపైనే జీవిస్తున్నారు. కొంత మంది యువకులు, మహిళలు చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద షాపులు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. అయితే చిలుకూరు గ్రామానికి చెందిన కొంత మంది యువకులకు నేత్రదానంపై ఆలోచన వచ్చింది. దీంతో గ్రామపెద్దలు, స్థానిక యువజన సంఘాలతో చర్చించి నేత్రదానానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ఉషోదయ, చైతన్య, శివాజీ, అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులతోపాటు మరికొన్ని యువజన సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. మొత్తం 10 సంఘాల్లోని సుమారు 500 మంది సభ్యులతోపాటు సుమారు 1500 మంది గ్రామస్తులు నేత్రదాన అంగీకార పత్రాలపై సంతకాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అంగీకార పత్రాలపై సంతకాలు చేసి ‘మాధవ నేత్రం’ సంస్థకు అప్పగించనున్నారు. అందుకోసం సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో... చేవెళ్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు నేత్రదానం చేసేందుకు ఇప్పటికే ముందుకొచ్చారు. నాలుగేళ్ల క్రితం చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లిలో సుమారు 2వేల మందికిపైగా నేత్రదానం చేసేందుకు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. అదే విధంగా మొయినాబాద్ మండలంలోని రెడ్డిపల్లిలో సైతం యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు నేత్రదానానికి ముందుకొచ్చారు. 2011లో నేత్రదాన పత్రాలపై సంతకాలు చేసి మాధవ నేత్రం సంస్థకు ఇచ్చారు. రెండు సంవత్సరాల క్రితం రెడ్డిపల్లికి చెందిన మోర యాదయ్య మరణించడంతో ఆయన కళ్లను మాధవ నేత్రం సంస్థకు అప్పగించారు. ఇదే స్ఫూర్తితో చిలుకూరు గ్రామస్తులు సైతం నేత్రదానానికి ముందుకురావడం అభినందనీయం. అంధుల జీవితాల్లో వెలుగులు నింపాలనే.. అంధత్వంతో ఎంతో మంది బాధపడుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతో నేత్రదాన కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నాం. గ్రామపెద్దలతో చర్చించి నేత్రదాన కార్యక్రమం చేపడుతున్నాం. - మహేష్, యువజన సంఘం సభ్యుడు, చిలుకూరు -
స్ఫూర్తి ప్రదాత రాజ్‌కుమార్
కంఠీరవుడి ప్రేరణతో నేత్రదానానికి సిద్ధమన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటి, చివరి ఆటోగ్రాఫ్ రాజ్‌కుమార్‌దే: రజనీకాంత్ ఎంతో ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితం గడిపారు : చిరంజీవి ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ స్మారకం ఆవిష్కరణ బెంగళూరు: ‘నేత్రదానం చేసి డాక్టర్ రాజ్‌కుమార్ ఈ సమాజానికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. అదే ప్రేరణతో నేనూ నేత్రదానం చేయడానికి నిర్ణయించుకున్నాను’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అక్కడికక్కడే నేత్రదానానికి సంబంధించిన సమ్మతి పత్రాలపై ఆయన సంతకం చేశారు. శనివారమిక్కడి కంఠీరవ స్టూడియోలో డాక్టర్ రాజ్‌కుమార్ స్మారకాన్ని లాంఛనంగా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. డాక్టర్ రాజ్‌కుమార్ వంటి మహోన్నత నటుడిని ఆదర్శనీయ వ్యక్తిగా కీర్తించడంతో పాటు ఆయన ఆదర్శాలను కూడా పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దేశంలో ఎన్నో లక్షల మంది ప్రజలు అంధత్వంతో బాధపడుతున్నారని, నేత్రదానం వల్ల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాధ్యమవుతుందని, ఇదే సందేశాన్ని రాజ్‌కుమార్ అందించారని తెలిపారు. కన్నడ సాంస్కృతిక రాయబారిగా వెలిగిన ఘనత రాజ్కుమార్కే దక్కుతుందని శ్లాఘించారు. సామాజిక, పౌరాణిక, చరిత్రాత్మక సినిమాలతో పాటు బాండ్ శైలి సినిమాల్లో సైతం రాజ్‌కుమార్ తన అమోఘ ప్రతిభను కనబరిచారని కొనియాడారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ భౌతికంగా లేకపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచేఉంటారని అన్నారు. మొదటి, చివరి సంతకం రాజ్‌కుమార్‌దే: రజనీకాంత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూపర్‌స్టార్ రజనీకాంత్ కన్నడ భాషలో అనర్గళంగా రాజ్‌కుమార్ ఘనతను వర్ణించారు. కళా సరస్వతి వరపుత్రుడిగా జన్మించిన రాజ్‌కుమార్ ఇప్పటికీ ప్రజల మనసుల్లో సజీవంగా ఉన్నారని అన్నారు. ‘బేడర కన్నప్ప’తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రాజ్‌కుమార్ కన్నడ చిత్రసీమను 54 ఏళ్ల పాటు నిర్విరామంగా ఏలారని అన్నారు. భారతీయ చిత్రరంగంలో ఇంత సుదీర్ఘకాలం కథానాయకుడిగా కొనసాగిన మరే వ్యక్తినీ తానింత వరకు చూడలేదని అన్నారు. కనకదాసు, పురందర దాసు, బసవణ్ణ వంటి మహనీయుల పాత్రలతో పాటు రావణాసురుడు, హిరణ్యకసిపుడు వంటి పాత్రల్లో సైతం రాజ్‌కుమార్ అద్భుత నటనా ప్రతిభను కనబరిచారని శ్లాఘించారు. రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఉదంతాన్ని సైతం రజనీ తనదైన శైలిలో అభివర్ణించారు. ‘రాజ్‌కుమార్ వంటి మహానటుడిని వనదేవత కూడా ఓ సారి చూడాలనుకుంది. అందుకే ఆయన్ను తన వద్దకు పిలిపించుకుంది. 108 రోజుల పాటు ఆయన్ను చూసి సంతోషంతో మళ్లీ పంపించేసింది’ అని పేర్కొన్నారు. ‘నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నగరంలోని శని మహాత్ముడి ఆలయం వద్దకు వెళ్లిన సమయంలో డాక్టర్ రాజ్‌కుమార్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను నా జీవితంలో తీసుకున్న మొదటి, చివరి ఆటోగ్రాఫ్ రాజ్‌కుమార్‌దే. ఆ తర్వాత ఎవ్వరి వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోలేదు’ అని రజనీకాంత్ గత స్మృతులను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితమే: చిరంజీవి కన్నడ సినీపరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగినా అత్యంత సాధారణ జీవితం గడిపిన మహావ్యక్తి డాక్టర్ రాజ్‌కుమార్ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ‘నేను ఎన్నో సార్లు రాజ్‌కుమార్‌ను కలిశాను. ఎప్పుడు కలిసినా తెలుగులోనే మాట్లాడేవారు. ఆయనకు దేశ, విదేశాల్లో ఎంతో మంది అభిమానులున్నప్పటికీ ఆయనలో ఏ కోశాన గర్వం కనిపించేది కాదు. ఆయనలో ఓ గొప్ప మానవతావాదిని కూడా చూశాను. కర్ణాటక ప్రభుత్వం రాజ్‌కుమార్ స్మారకాన్ని ఏర్పాటు చేసినందుకు నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని చిరంజీవి తెలిపారు. -
నేడు స్కై లాంతరు ఫెస్టివల్-2014
నేత్రదానంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్సార్ నిథమ్, జియో మెరిడియన్, వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా గురువారం ‘స్కై లాంతరు ఫెస్టివల్-2014’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పేద విద్యార్థుల కోసం నిధుల సమీకరణలో భాగంగా బాచుపల్లిలోని వీఎన్ఆర్ వీజేఐఈటీ క్యాంపస్‌లో ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తారు. సినీనటుడు బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ఇరవైవేల స్కైలాంతర్లను ఆకాశంలోకి వదలనున్నారు. ఒక్కో లాంతరుకు రూ.100 చెల్లించి పేదలకు సాయం చేయడంలో అందరూ తోడ్పడాలని నిర్వాహకులు కోరారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ సంస్థ విద్యార్థుల ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. ఇతర వివరాల కోసం 7842455581, 9989904305 నంబర్లకు సంప్రదించవచ్చు. - రాయదుర్గం -
లింగా చిత్రం హీరోయిన్ నేత్రదానం
లింగా చిత్ర హీరోయిన్ సోనాక్షి సిన్హా నేత్రదానం చేశారు. ఆ విధంగా ఆ బ్యూటీ సేవకుల జాబితాలో చేరారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ద్విపాత్రాభినయంతో త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్న చిత్రం లింగా. ఈ చిత్రంలో ఆయనకు జంటగా అనుష్క, ముంబయి బ్యూటీ సోనాక్షి సిన్హా నటించారు. వీరిలో నటి సోనాక్షి సిన్హా నేత్రదానం చేశారు. హర్యానాకు చెందిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు సోనాక్షి సిన్హా నేత్రదానం చేశారు. ఆ సంస్థ విజ్ఞప్తి మేరకు తాను నేత్రదానం చేసినట్లు ఈ ముద్దుగుమ్మ పేర్కొన్నారు. ఆ విధంగా సేవా విభాగంలో పాలు పంచుకునేందుకు ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే కమలహాసన్, మాధవన్, స్నేహ, అమితాబ్‌బచ్చన్, జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్, అమీర్ ఖాన్, కిరణ్రావ్లాంటి ప్రముఖులు నేత్రదానం చేశారు. ఈ పట్టికలో సోనాక్షి సిన్హా చేరారు. -
'అవయవ దానంపై చిన్నారుల్లో అవగాహన కల్పిస్తాం'
న్యూఢిల్లీ: చిన్నారులు అవయవ దానం చేసేలా ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని, ముఖ్యంగా నేత్రదానంపై సానుకూల దృక్ఫథం ఏర్పడేలా చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. చిన్నారుల్లో అవయవదానంపై అవగాహన కలిగేలా పాఠ్యపుస్తకాల్లో ఈ అంశాన్ని చేర్చాలని మానవ వనరుల అభివద్ధి శాఖకు సూచించినట్టు పేర్కొన్నారు. హర్షవర్ధన్ శనివారం ఢిల్లీలో జరిగిన షరోఫ్ చారిటీ నేత్ర వైద్యశాల శతవార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్నియల్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న వారి సంఖ్య భారత్‌లోనే అధికమని, దేశంలో ఏటా లక్ష కార్నియాలు కావాలని, అయిలే 17 వేలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. -
చనిపోయినా.. కను‘గుడ్’
అమ్మానాన్నలు.. తోబుట్టువులు.. బంధువులు..స్నేహితులు..ఇలా అంతా ఉన్నా.. ఆరోగ్యంగానే ఉన్నా.. చూపులేనికారణంగా అంధులు అన్ని ఆనందాలకు దూరమవుతారు. నిత్యం ఆవేదనలో మునిగిపోతారు. జన్యులోపాలు లేదా పుట్టుకతో అంధులుగా మారినవారు.. ప్రమాదాల్లో కార్నియా పోగొట్టకున్నవారు వెలుగు చూడకుండా బతుకుతున్నారు. వీరిలో చాలామందికి చూపు తెప్పించే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కావాల్సిందే చనిపోయినవారి నేత్రాలు సేకరించి అమర్చడమే! దురదృష్ట వశాత్తు నేత్రదానంపై నేటి సమాజంలో ఇప్పటికీ పూర్తిస్థాయి చైతన్యం కలగలేదు. ప్రస్తుతం దేశంలో లక్షలాదిమంది కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారు. రోజూ ఎంతోమంది లోకం విడిచివెళుతున్నా.. కేవలం 20 వేలకు మించి కార్నియాలు లభ్యం కావడంలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయితే 1575 కార్నియాలే సేకరించగలుగుతున్నారు. నేత్రదానం వీరు చేయవచ్చు.. ఏనిమిదేళ్ల నుంచి 80 ఏళ్ల వయసున్న వ్యక్తులు చనిపోయిన సందర్భాల్లో వారి నుంచి కార్నియాలను సేకరించవచ్చు. శుక్లాలు ఉన్నవారు, కంటి ఆపరేషన్ చేయించుకున్నవారివి కూడా పనికొస్తాయి. అయితే కార్నియా దెబ్బతినకుండా ఉండాలి. మధుమేహం, గుండెజబ్బులు, చత్వారం ఉన్నవారు సైతం నేత్రదానం చేయవచ్చు. ప్రమాదాల్లో, అనుమానాస్పదంగా మరణించిన వారి నుంచి చట్టపరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కార్నియా సేకరించే అవకాశం ఉంటుంది. వీరు అనర్హులు పిచ్చి కుక్కు కరచి.. ర్యాబిస్ వ్యాధితో మరణించవారి నుంచి కార్నియాలు సేకరించకూడదు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు.. కారణం తెలియకుండా మరణించవారి నేత్రాలు కూడా పనికిరావు. క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులతో మరణించిన వారి నుంచి కార్నియాలు సేకరించకూడదు. -
జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు
ముంబై: నేత్రదానంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే నేత్రాలను దానం చేయొచ్చని.. నేత్రదానం చేస్తున్నట్లు ముందుగా ప్రకటించినవారు మాత్రమే తమ కళ్లను దానం చేయొచ్చని.. ఇలాంటి అపోహలను తొలిగించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రచార కార్యక్రమాలు, నేత్రదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా ప్రజను నేత్రదానం వైపు ప్రోత్సహించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఎవరైనా నేత్రదానం చేయొచ్చు... నేత్రదానం చేయడానికి వయసుకు పరిమితులు లేవు. ఒకరు రెండు కళ్లు దానం చేయడం ద్వారా ఇద్దరికి కంటి చూపు వస్తుంది. నేత్రదానం చేస్తున్నట్లు ప్రకటించినా, ప్రకటించకపోయినా కళ్లను దానం చేయొచ్చు. కళ్లజోడు పెట్టుకునేవారు. అధిక బ్లడ్ ప్రెషర్, మధుమేహం, ఉబ్బసం వ్యాధులతో ఉన్నవారు, కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారూ తమ నేత్రాలు దానం చేయొచ్చు. నేత్రాలు దానం చేయూలనుకుంటే వెంటనే దగ్గరిలోని నేత్రదాన ంపై అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు, ఐ బ్యాంకులకు సమాచారం ఇవ్వాలి. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నేత్రదానం కోసం 1919/1053 అనే ఉచిత (టోల్‌ఫ్రీ) నంబర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నేత్రాలను దానం చేయాలనుకునేవారు ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ వివరాలు తెలియజేయాలి. తమవారెవరైనా మరణించిన, బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్నా వారి నేత్రాలను దానం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు భావిస్తున్నా ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. అయితే వ్యక్తి మరణించిన వెంటనే సమాచారం ఇవ్వాలి. -
మీ ముందు‘చూపే’.. మరొకరికి కంటి వెలుగు
దోమ: ఒక్క క్షణం కళ్లు మూసుకుంటే అంతా అంధకారమే.. రాత్రి వేళ కరెంట్ పోతే చాలు వెంటనే దీపం కోసమో.. టార్చలైట్ కోసమో వెతికేస్తాం.. మరి చూపే లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే కదూ.. పుట్టుకతో అంధత్వం గల వారితో పాటు పలు కారణాలతో మధ్యలో చూపు కోల్పోయిన వారిని సమాజంలో ఎంతో మందిని చూస్తుంటాం. అలాంటి వారిని ఆదుకొని కంటి చూపు ప్రసాదించడానికి ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. అయినా ఇంకా ఎందరో అందమైన ప్రపంచాన్ని చూసే భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించి ఆ దిశగా వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన వారోత్సవాలను నిర్వహిస్తోంది. సరైన సమయంలో చికిత్స అందకే.. అధికారుల వివరాల ప్రకారం జిల్లాలోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది అంధత్వంతో బాధపడుతున్నారు. పాక్షిక అంధత్వంతో బాధపడుతున్న వారు 15 నుంచి 16 శాతం వరకు ఉన్నారు. పాక్షిక అంధత్వంతో బాధ పడుతున్న వారిలో ఎక్కువ శాతం సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం మూలంగానే దృష్టిలోపానికి గురవుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో... జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఉచిత కంటి వై ద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వారి కి హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత ఏడాది 20 వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించగా ఈ ఏడాది ఇప్పటి వరకు 22 వేల మందికి నిర్వహించారు. నేత్రదానం మహాదానం... జిల్లాలో కార్నియా అంధత్వంతో బాధపడేవారే ఎక్కువగా ఉన్నారు. ఏటా 100 నుంచి 120 మంది వరకు ఈ తరహా అంధత్వానికి గురవుతున్నారు. చనిపోయిన వారి నుంచి సేకరించిన కళ్లను ఇలాంటి వారికి అమర్చడం ద్వారా చూపును ప్రసాదించే వీలుంది. వారికి అమర్చడానికి కార్నియాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నేత్రదానం చేసే వారి సంఖ్య పెరిగితే ఈ సమస్యను అధిగమించే వీలుంటుంది. నేత్ర దానానికి వీరు అర్హులు... ప్రమాదవ శాత్తు గుండె జబ్బులు, ఇతర ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మరణించిన వారు, సహజ మరణం పొందిన వారు నేత్ర దానానికి అర్హులు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయొచ్చు. మధుమేహం, రక్త పోటు వ్యాధిగ్రస్తులు కూడా మరణానంతరం నేత్రదానం చేయొచ్చు. నేత్రదానం చేయాలనుకునే వారు... నేత్ర దానం చేయాలని సంకల్పించే వారు ముందుగా తమ కుటుంబ సభ్యుల సమ్మతితో సంబంధిత ప్రతిజ్ఞా పత్రాన్ని నింపి సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో గానీ, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఐ బ్యాంకుల్లో గానీ అందజేయవచ్చు. చనిపోయిన 6 గంటల లోపు వారి కుటుంబ సభ్యులు, బంధువుల అనుమతితో కళ్లను సేకరిస్తారు. జిల్లాలో గత ఏడాది 70 మంది నేత్రదానానికి ముందుకు రాగా ఈ ఏడాది 80 మంది ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ఘర్షణల్లో చూపు కోల్పోయిన కలెక్టర్, నేత్రదానానికి సిద్దమైన ఓ నేత!
లక్నో: హింసాత్మక ఘర్షణల్లో కళ్లు కోల్పోయిన ఓ జిల్లా కలెక్టర్ కు సమాజ్ వాదీ పార్టీ నేత నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని కాంత్ ఏరియాలో జరిగిన హింసాత్మక సంఘటనలో మొరాదాబాద్ జిల్లా కలెక్టర్ కళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. నేత్ర, రక్త దానం కంటే మించినది ఈ ప్రపంచంలో ఏమిలేవు. చంద్రకాంత్ లాంటి నిజాయితీపరుడైన అధికారికి నా కళ్లు చూపు తీసుకువస్తే అంతకంటే గొప్ప గౌరవం తనకేముంటుంది అని ఎస్పీ నేత అమిత్ జానీ అన్నారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు లేఖ రాశారు. ఓ ఆలయంలో లౌడ్ స్పీకర్ తొలగింపు వ్యవహారంలో కాంత్ ఏరియాలో జూలై 4 తేదిన జరిగిన హింసాత్మక సంఘటనలో చంద్రకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చంద్రకాంత్ కు చికిత్స జరుగుతోంది. చంద్రకాంత్ కు కళ్లు దానం చేయడానికి ముందుకు వచ్చిన అమిత్ జానీపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
ఆ సంతకం ప్రత్యేకం
అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదంటారు. బతికున్నప్పటి వరకూ ఆ దానం ఓకే. కానీ, మరణించిన తర్వాత ఏం చేయగలుగుతాం?... ఇటీవల శిల్పాశెట్టి మనసుని తొలిచేసిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు సమాధానం కూడా కనుక్కున్నారామె. మరణించిన తర్వాత కూడా ఏదో రూపంలో జీవించాలంటే అవయవ దానం చేయడం మంచిదని నిర్ణయించుకున్నారు శిల్పా. అది కూడా ఈ అందమైన ప్రపంచాన్ని చూడ్డానికి నోచుకోలేనివారికి చూపు ఇస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్వచ్ఛంద సంస్థకు ‘నేత్రదానం’ చేసే విషయమై ఒప్పంద పత్రంలో సంతకం పెట్టారు శిల్పాశెట్టి. ఇప్పటివరకూ ఎన్నో సంతకాలు పెట్టానని, కానీ ఈ సంతకం ఇచ్చిన సంతృప్తి వేరే ఏదీ ఇవ్వలేదని తన సన్నిహితుల దగ్గర శిల్పా చెప్పారట. -
భూమా శోభానాగిరెడ్డి నేత్రదానం
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్సార్ సీసీ నాయకులు భూమా శోభానాగిరెడ్డి కళ్లను దానం చేశారు. శోభానాగిరెడ్డి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె కళ్లను దానం చేశారు. శోభానాగిరెడ్డి పార్థీవదేహం నుంచి నయనాలను సేకరించి వైద్యులు భద్రపరిచారు. శోభానాగిరెడ్డి కళ్లతో ఇద్దరికి వెలుగు ప్రసాదించనున్నారు. శోభానాగిరెడ్డి మరణించినా తన కళ్లను దానం చేసి చీకటి జీవితాల్లో వెలుగు నింపారు. శోభానాగిరెడ్డి కళ్లు దానం చేయడాన్ని సామాజికవేత్తలు, వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశంసించారు. నేత్రదానం చేసి శోభానాగిరెడ్డి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభానాగిరెడ్డి సంతాపసభ నిర్వహించారు. శోభానాగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ఆర్ సీపీ నేతలు, అభిమానులు నివాళి అర్పించారు. శోభానాగిరెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర వాప్తంగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఉదయ్ కిరణ్ కళ్లు దానం
-
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఉదయ్ కిరణ్ కళ్లు దానం
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న సినినటుడు ఉదయ్ కిరణ్ నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు సోమవారం ఉదయం ఉదయ్ కిరణ్ నేత్రాలలోని రెటీనాను సేకరించారు. మరోవైపు ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అపోలో ఆస్పత్రి నుంచి ఉస్మానియాకు తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అర్థాంతరంగా తనువు చాలించిన ఉదయ్ కిరణ్... తన కళ్లు మాత్రం వేరొకరికి చూపునిచ్చేలా సజీవంగా నిలిచాడు. -
14 నెలల చిన్నారి నేత్రదానం
రాంగోపాల్‌పేట, న్యూస్‌లైన్: పద్నాలుగు నెలల చిన్నారి.. తాను కన్ను మూస్తూ లోకాన వెలుగు నిం పింది. కంటిపాపలా చూసుకున్న తమ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండటంతో ఆ తల్లిదండ్రులు చిన్నారి నేత్రాలను దానం చేసి ఆమె జ్ఞాపకాలను అలాగే పదిలపర్చుకున్నారు. గాంధీనగర్ నెస్లే అపార్ట్మెం ట్లో ఉండే సత్యనారాయణ, శ్రీదేవి దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె అలేఖ్య (14 నెలలు) కొద్ది రోజు లుగా జలుబు, దగ్గుతో బాధపడుతోంది. ఉన్నట్టుండి గురువారం రాత్రి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా కొద్దిసేపటికే మరణించింది. గారాలపట్టి కళ్లెదుటే కన్నుమూయడంతో వారి వేదన వర్ణనాతీతం. ఆ బాధను దిగమింగుకుని తమ చిన్నారి మరణించినా ఆమె నేత్రాలు దానం చే సి జ్ఞాపకాలు పదిలం చేసుకోవాలని భావించి తల్లిదండ్రులు వాసన్ ఐ బ్యాంకుకు సమాచారమిచ్చారు. సిబ్బంది అక్కడికి వెళ్లి అలేఖ్య కార్నియాను సేకరించారు.