ఒక జన్మ రెండు జీవితాలు | special story on eye donate | Sakshi
Sakshi News home page

ఒక జన్మ రెండు జీవితాలు

Published Wed, Jan 18 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

ఒక జన్మ రెండు జీవితాలు

ఒక జన్మ రెండు జీవితాలు

మనిషి ఒకసారి పుట్టి ఒక్కసారే చనిపోతాడు
మనలోని అవయవాలు మనతోపాటు పుట్టి
మనతోపాటు మరణించవు...
మరొకరికి కూడా జీవితాన్నిస్తాయి.
ఒక మనిషికి చూపునిచ్చిన రెండు కళ్లు...
ఆ వ్యక్తి మరణించిన తర్వాత మరో ఇద్దరికి చూపునిస్తాయి
అందుకు... నేత్రదానం అనే ఒక మహోన్నతమైన
గుణంతో పాటు కార్నియా రీప్లేస్‌మెంట్‌ అనే
అత్యంత నైపుణ్యమైన చికిత్స తోడవ్వాలి.


నేత్రదానం అంటే... కళ్లను దానం చేయడం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి కళ్లను తీసి మరొకరికి అమర్చడం అన్నమాట. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రెండు కళ్లలో ఒక్కొక్క కంటిని ఒక్కొక్కరికి అమరుస్తారు. కాబట్టి ఒకరు నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛందంగా జరుగుతున్న మహోన్నత కార్యక్రమం. సమాజంలో కార్నియా దెబ్బతినడం కారణంగా దృష్టిలోపంతో బాధపడుతున్న వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. నేత్రదానం ప్రతిజ్ఞ చేసిన వారు తక్కువమంది ఉన్నారు. ఏడాదికి రెండు లక్షల కార్నియాల అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం ఏడాదికి దాదాపు 45వేలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.

పేషెంటుకి దెబ్బతిన్న కార్నియా (కంటి మీద ఉండే పారదర్శకమైన పొర)ను తొలగించి, దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కార్నియాను అమరుస్తారు. దీనిని కార్నియా రీప్లేస్‌మెంట్‌ లేదా కెరటోప్లాస్టీ, కార్నియల్‌ గ్రాఫ్టింగ్‌ అంటారు. ఈ సర్జరీ చేయడానికి నేత్రదాత బ్లడ్‌గ్రూప్‌ – గ్రహీత బ్లడ్‌గ్రూప్‌ ఒకటే కావాల్సిన అవసరం లేదు. అంటే ఆ రెండూ మ్యాచ్‌ కావాల్సిన అవసరం లేదన్నమాట.

కార్నియా పారదర్శకంగా ఉంటూ బయటి దృశ్యాలను కంటి లోపలికి చేరవేస్తుంది. కార్నియాలోని పారదర్శకత లోపించినప్పుడు అది రెటీనాకు సరైన సమాచారాన్ని చేరవేయలేదు. దానిని కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌ అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే... పాడైన కార్నియాను తొలగించి ఆరోగ్యకరమైన కార్నియాను అమర్చడమే మార్గం.

దాత నుంచి సేకరించిన తర్వాత కంటి వైద్యనిపుణులు కార్నియాను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇన్నర్‌ లేయర్‌ (ఎండోథీలియమ్‌) శక్తిని పరీక్షిస్తారు. అది సరిగ్గా ఉంటే ....ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రక్రియ ద్వారా, దానిని అవసరమైన వారికి అమరుస్తారు.

ఎవరెవరికి అవసరం
∙సూడోపేకిక్‌ బుల్లస్‌ కెరటోపతి ∙కెరటోకోనస్‌ ∙కార్నియాకు గాయాలు (కార్నియల్‌ ఇంజ్యురీస్‌) ∙కార్నియల్‌ డీ జనరేషన్‌ ∙ కార్నియల్‌ అల్సర్స్‌ ∙ఎండోథీలియల్‌ డీ–కంపెన్సేషన్‌ ∙పుట్టుకతోనే తెల్లటి కార్నియా ఉండటం (కంజెనిటల్‌ కార్నియల్‌ ఒపాసిటీ)
∙కెమికల్‌ బర్న్స్‌ (అంటే రసాయనాల వల్ల కార్నియా దెబ్బతినడం).

ఇలా సేకరిస్తారు!
∙మరణానంతరం ఆరు గంటలలోపు కళ్లను సేకరించాలి ∙అంతవరకు మృతుని కనురెప్పలను మూసి, కళ్ల మీద తడిగుడ్డ లేదా దూదిని లేదా ఐస్‌ ముక్కలను ఉంచాలి ∙తల ఎత్తులో ఉండేటట్లు చూడాలి, తలకింద రెండు తలగడలు ఉంచాలి ∙మృతదేహం ఉన్న గదిలో ఫ్యాన్‌ వేయకూడదు. దీనివల్ల కార్నియా డ్రైగా మారి చెడిపోయే అవకాశం ఉంది. కానీ గది వీలైనంత వరకు చల్లగా (లో–టెంపరేచర్‌తో) ఉండాలి ∙అధునాతనమైన పరికరాలు అందుబాటులో ఉన్న ప్రస్తుత నేపథ్యంలో కంటి నల్లగుడ్డు మీద ఉండే కార్నియాను మాత్రమే సేకరిస్తున్నారు. కాబట్టి నేత్రదానం చేసినా కంటి ఆకారంలో మార్పు కనిపించదు.

ఒకవేళ పాత పద్ధతిలో కంటిని మొత్తంగా తీసినట్లయితే ఆ స్థానంలో కృత్రిమ కంటిని అమర్చుతారు. పార్థివ దేహం మామూలుగా కళ్లు మూసుకుని ఉన్నట్లే కనిపిస్తుంది ∙కార్నియాను సేకరించిన తర్వాత దాన్ని కార్నియా బ్యాంకు (ఐ–బ్యాంకు)లో ఉంచుతారు. ఆ తర్వాత మరొకరికి అమర్చుతారు ∙వీలైనంత త్వరగా కంటిని సేకరించేందుకు వీలుగా ఐ బ్యాంక్‌ ప్రతినిధులు, వైద్యనిపుణులు వచ్చేలోపే... మరణించిన వ్యక్తి తాలూకు డెత్‌ సర్టిఫికేట్, మెడికల్‌ రికార్డ్స్‌  సిద్ధంగా ఉంచడం మంచిది ∙మృతునికి వారసులుంటే వారి అనుమతి తప్పనిసరి.

ఆపరేషన్‌ తర్వాత వచ్చే సాధారణ సమస్యలు ఇవి...  
ఆపరేషన్‌ తర్వాత గాయం మానే సమయంలో కొందరికి ఐసైట్‌లో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ∙ఫారిన్‌బాడీని దేహం అనుమతించనప్పుడు కొత్త కార్నియాకు వ్యతిరేకంగా బతికి ఉన్న దేహం రియాక్ట్‌ అయితే (గ్రాఫ్ట్‌ రిజెక్షన్‌) ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సక్సెస్‌ కాదు. సాధారణంగా ఎదురయ్యే సమస్య ఇదొక్కటే ∙కార్నియల్‌ గ్రాఫ్ట్‌ ఇన్ఫెక్షన్‌... ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తర్వాత కంటిలోపల ఇన్ఫెక్షన్‌ వస్తే సర్జరీ లక్ష్యం నెరవేరదు. అయితే ఈ సమస్య ఇటీవల కనిపించడం లేదు ∙గ్లకోమా... కార్నియల్‌ రీప్లేస్‌మెంట్‌ తర్వాత రోగిలో గ్లకోమా లక్షణాలు కనిపిస్తే, కంటి నరాల్లో ఒత్తిడి పెరిగి ఆప్టిక్‌ నర్వ్‌ దెబ్బతింటుంది. అప్పుడు చూపును తిరిగి తీసుకురావడం కష్టం. అయితే. ఇది తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది.
వీటన్నింటిని అధిగమించ గలిగిన టెక్నాలజీ అభివృద్ధి చెందింది. దీనిని లామెల్లార్‌ కెరటోప్లాస్టీ అంటారు. కాబట్టి ఆపరేషన్‌ తర్వాత ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని, వాటిని నివారించగలిగిన చికిత్స విధానాలు కూడా ఇటీవల బాగా అభివృద్ధి అయ్యాయి.

అపోహలు–వాస్తవాలు
1. అపోహ:కళ్లను దానం చేసి... కళ్లు లేని దేహాన్ని ఖననం లేదా దహనం చేస్తే మరుసటి జన్మలో కళ్లు లేకుండా పుడతారని, అందుకు మతాలు ఒప్పుకోవనేది ఒక అపోహ.
    వాస్తవం: ఇది నిరాధారమైన అపోహ మాత్రమే. నిజానికి ఏ మతమైనా దాతృత్వాన్నే ప్రబోధిస్తుంది.
2.  అపోహ:కాటరాక్ట్‌ సర్జరీ చేయించుకున్న వాళ్ల కళ్లు నేత్రదానానికి పనికిరావు.
    వాస్తవం: కాటరాక్ట్‌ సర్జరీ చేయించుకున్నా సరే... కళ్లను దానం చేయవచ్చు.
3.  అపోహ: ముసలివాళ్ల కళ్లు దానానికి పనికిరావు. వయసులో ఉన్న వాళ్ల కళ్లు మాత్రమే పనికివస్తాయి.
    వాస్తవం: ఏడాది వయసు నిండిన పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవరైనా సరే... అందరూ నేత్రదానం చేయవచ్చు.
4. అపోహ: బతికి ఉన్న వాళ్లు కూడా జీవించి ఉండగానే కళ్లు దానం చేయవచ్చా?
    వాస్తవం: కేవలం చనిపోయినవారి నుంచి మాత్రమే కళ్లను స్వీకరిస్తారు. ఒకవేళ తమ దగ్గరి వారికి ఏదైనా సమస్య వచ్చి వారు కళ్లను కోల్పోతే... తల్లిదండ్రులు లేదా ఎంత దగ్గరి బంధువులైనా భావోద్వేగాలతో ముందుకు వస్తే...  వారి కళ్లను బతికి ఉండగా స్వీకరించరు.

నేత్రదానం ఎవరెవరు చేయవచ్చు?
నేత్రదానం చేయాలనుకున్న వాళ్లు సంబంధిత సంస్థలను సంప్రదించి ప్రతిజ్ఞ చేయాలి. అలాగే ప్రతిజ్ఞ చేయకుండా మరణించిన వారి కళ్లను కూడా వారి పిల్లలు, న్యాయ/చట్టపరమైన వారసులు దానం ఇవ్వవచ్చు.
నేత్రదానానికి వయసుతో నిమిత్తం లేదు. నేత్రదానానికి వార్ధక్యం ఏ మాత్రం అడ్డుకాదు.
కంటికి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకున్న వారు, కళ్లజోడు ధరించేవారు, బీపీ, షుగర్, ఉబ్బసం, టీబీ వంటి వ్యాధులు ఉన్న వారు కూడా కార్నియా ఆరోగ్యంగా ఉంటే నేత్రదానం చేయవచ్చు.
వీళ్లు చేయకూడదు!
ఎయిడ్స్, హెపటైటిస్, రుబెల్లా, మలేరియా, సిఫిలిస్‌ వంటి అంటువ్యాధులున్న వారు, క్రెజ్డ్‌ఫోల్డ్‌ జాకబ్‌ డిసీజ్, అల్జీమర్స్, మల్టిపుల్‌ స్కెర్లోసిస్, బ్లడ్‌ క్యాన్సర్, ట్యూమర్లు ఉన్నవారు, మత్తుపదార్థాలు వాడేవారు నేత్రదానానికి అర్హులు కారు (నేత్రదానం కోసం ప్రతిజ్ఞ చేసే నాటికి పై సమస్యలు లే కున్నా, ఆ తర్వాత సంక్రమించే ప్రమాదం ఉంది కాబట్టి... ప్రతిజ్ఞ చేసి చనిపోయిన వ్యక్తి నుంచి కార్నియాతోపాటు రక్తాన్నీ సేకరిస్తారు. రక్తపరీక్షలు చేసి పై అనారోగ్యాలేవీ లేవని నిర్ధారణ చేసుకున్న  తర్వాత మాత్రమే ఆ కార్నియాకు రీప్లేస్‌మెంట్‌కి అర్హత వస్తుంది.
విషప్రభావంతో మరణించిన వారి కళ్లు పనికిరావు. వాటిని సేకరించే ప్రయత్నం కూడా జరగదు.

- డాక్టర్‌ రవికుమార్‌ రెడ్డి  కంటి వైద్య నిపుణులు, మెడివిజన్‌ ఐ హాస్పిటల్, హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement