నేత్ర, అవయవదానాలతో ఆదర్శం
ముందుకొచ్చిన ఓదెల, అబ్బిడిపల్లి గ్రామస్తులు
సాక్షి, పెద్దపల్లి: ఆయుష్షు అరవై ఏళ్లు ఉందనుకుంటే.. మరణానంతరం మన కళ్లకు.. మరో అరవైఏళ్లు లోకాన్ని చూసే అదృష్టం కల్పించవచ్చని ఆలోచించారు ఆ జంట గ్రామాల ప్రజలు. పుట్టుకతో చూపు పోయినవారు కొందరు, ప్రమాదవశాత్తు కళ్లు పోయినవారు మరికొందరు.. వారికి జీవితమంతా చీకటే.
ఇలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా.. చనిపోయిన తర్వాత కూడా కళ్లకు జీవితాన్నివ్వాలన్న గొప్ప ఆలోచన వారిలో తట్టింది. వెరసి ఆ ఊరు ప్రజలంతా మూకుమ్మడిగా నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఓదెల, అబ్బిడిపల్లి గ్రామాలపై స్ఫూర్తిదాయక కథనమిది.
ఒక్కరి కృషితో.. ఒక్కొక్కొరుగా కదలివచ్చి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఆర్‌ఎంపీ మేర్గు భీష్మాచారి స్థానికంగా ప్రాథమిక వైద్య చికిత్స చేస్తుండేవారు. ఆయన అత్తమ్మ చనిపోయినప్పుడు.. ఆమె కుమారులు నేత్రదానం చేశారు. నేత్రదానం అంటే.. పూర్తిగా కన్ను తీసుకుంటారనే అపోహలో ఉన్న ఆ ఆర్‌ఎంపీ.. కార్నియా సేకరణకు సహకరిస్తే.. మరొకరికి చూపు ఇచ్చిన వారవుతారని తెలుసుకున్నారు.
ప్రమాదవశాత్తు కంటిచూపు పోయి ఇబ్బంది పడుతున్న ఎందరినో చూసిన ఆయన.. మరికొందరితో కలిసి 2015లో సదాశయం ఫౌండేషన్ స్థాపించారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తన వద్దకు వైద్య సాయం కోసం వచ్చేవారిని చైతన్యపరచటం ప్రారంభించారు. అదే స్ఫూర్తితో ప్రజలను చైతన్యపరుస్తూ ఇప్పటివరకు దాదాపు 2,000 మందితో నేత్రదానానికి హామీపత్రాలిచ్చేలా కృషి చేశారు.
ఒకరిని చూసి మరొకరు..
తొలుత ఓదెల మేజర్ గ్రామపంచాయతీలో ఒక్కొక్కరుగా నేత్రదానం చేసేందుకు ముందుకురాగా, వారిని చూసి పక్కనే ఉన్న అబ్బిడిపల్లి గ్రామస్తులు సైతం ముందుకొచ్చారు. ఓదెల గ్రామంలో చనిపోయిన 190 మంది నేత్రదానం చేశారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్న సమీప అబ్బిడిపల్లి గ్రామస్తులు అదే స్ఫూర్తి కొనసాగిస్తున్నారు. 500. మంది ఉన్న గ్రామ జనాభా మూకుమ్మడిగా నేత్రదానం చేయడానికి సిద్ధమయ్యారు.
నేత్రదానం చేస్తామని.. 2022లో గ్రామ పంచాయతీలో తీర్మానించారు. తీర్మానం ప్రతిని కలెక్టర్‌కు ఇచ్చి గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు. నేత్రదానంతోపాటు అవయవదానానికీ సదాశయం ఫౌండేషన్ ఆయా గ్రామాల్లో అవగాహన కలి్పస్తోంది. దీనికి కూడా ప్రజలు ముందుకు వస్తున్నారు.
మా ఆయన కండ్లు ఇచ్చిన..
మా ఆయన జింకిరి మల్లయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిండు. నాకు ఐదుగురు బిడ్డలు. మట్టిలో కలిసిపోవడం కంటే మరొకరికి కంటిచూపు ఇవ్వొచ్చని నా కొడుకు నిర్ణయించిండు. మా ఆయన కండ్లు దానం చేసినం. ఓదెల గ్రామానికి చెందిన సదాశయ ఫాండేషన్ వారికి అప్పగించినం. కళ్లదానం చేసేందుకు ఊరోళ్లందరం ఒక్కటైనం.– జింకిరి శాంతమ్మ, అబ్బిడిపల్లి
కొంటే దొరకనివి నేత్రాలు
ఏది కొన్నా దొరుకుతుంది.. కానీ నేత్రాలు దొరకవు. అందుకే మా ఊరోళ్లందరం నేత్రదానం చేయాలని మూకుమ్మడిగా తీర్మానం చేసినం. ఈ క్రమంలో గ్రామంలో ఎవరు చనిపోయినా నేత్రదానం చేస్తున్నం. నేను కూడా నేత్రదానం చేస్తానని హామీ పత్రం ఇచ్చిన
సంస్మరణ సభలతో అవగాహన
నేత్రదానం, అవయవదానంపై ప్రజ ల్లోని అపోహలు తొలగించేందుకు మా సంస్థ కృషి చే స్తోంది. నేత్ర, అవయవ దానం చేసిన వారికి, దశ దినకర్మ రోజు మా సంస్థ సంస్మరణ సభలు నిర్వహిస్తోంది. అక్కడికి వచ్చే బంధువులు, మిత్రులకు అర్థమయ్యేలా వివరిస్తూ, మృతుల కుటుంబ సభ్యులను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment