భక్తుడి పేరిట వెలుగొందుతున్న గుడి... కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి
సీతారాములు వనవాస సమయంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్టు ప్రతీతి
మల్లన్నను దర్శించుకున్నాకే ఎన్నికల బరిలోకి నేతలు
పట్నాలు, బోనాల కోసం పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాక
సాక్షి, పెద్దపల్లి: ‘గజ్జల లాగులను ధరించిన ఓదెల మల్లన్న దండాలో.. మమ్మేలు మా స్వామి దండాలో.. ఆలుమిలా తారడో బోలుమియా గారడో..’ అంటూ గంతులు వేస్తూ తమ ఇలవేల్పును దర్శించేందుకు భక్తులు ఆ ఆలయానికి భారీగా తరలివస్తుంటారు. తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు.. మల్లన్నగా.. ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధి చెందాడు. అదే పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం. ఆ ఆలయ చరిత్ర తెలుసుకుందాం.
నాగలి చేసిన గాయంతో..
పూర్వం ఈ ప్రాంతం దండకారణ్యంగా (Deep Forest) ఉండేది. ఆ రోజుల్లో స్వయంభూలింగంగా వెలసిన మహాశివుడిని పంకజ మహామునీశ్వరుడు నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఆలయ స్తంభంపై మునీశ్వరుల బొమ్మలు, నామం చెక్కి కనిపిస్తాయి. ఆయన తర్వాత పూజ చేసేవారు లేక శివలింగంపై పెద్దఎత్తున పుట్ట పెరిగింది. అయితే, చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం చేస్తుండగా.. నాగలి కర్ర పుట్టలోని శివలింగానికి తగిలింది. జరిగిన పొరపాటును ఓదెలు తెలుసుకొని, స్వామివారిని మన్నించమని వేడుకున్నాడు. దీంతో ఓదెలుకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా, అతడి పేరుతోనే భక్తులకు దర్శనం ఇస్తానని స్వామివారు చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు.
ఇప్పటికీ శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ క్రమం, స్తంభ వర్ణ శిలలు, శిల్పాల ఆధారంగా సుమారు 1300 మధ్య కాకతీయుల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయని చెబుతున్నారు. ఆ సమయంలో దక్షిణ దిశగా శ్రీభ్రమరాంబ అమ్మవారిని, ఉత్తర దిశగా శ్రీవీరభద్రస్వామిని, క్షేత్రపాలకుడిగా శ్రీభైరవస్వామిని ప్రతిష్టించారు.
మల్లన్న ఆలయానికి సమాంతరంగా సీతారామ చంద్రస్వామి విగ్రహాలు
శ్రీసీతారాములు వనవాసం చేసే సమయంలో రామగిరిఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే దారిలో ఓదెల శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకున్నారని ప్రతీతి. దానికి ప్రతీకగా మల్లన్నస్వామి ఆలయానికి సమాంతరంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి విగ్రహాలను ప్రతిష్టించారని స్థానికులు చెబుతుంటారు.
సంతానం కోసం టెంకాయ బంధనం
‘గండాలు తీరితే గండదీపం పెడతాం.. కోరికలు తీరితే.. కోడెలు కడతాం.. పంటలు పండితే.. పట్నాలు వేస్తాం.. పిల్లాజెల్ల సల్లంగా ఉంటే.. సేవలు చేస్తాం’ అని స్వామివారికి భక్తులు మొక్కుకుంటారు. వచ్చే భక్తుల్లో చాలామంది సంతానం కోసం ‘టెంకాయ బంధనం’ కట్టి వారికి సంతానం కలిగిన తర్వాత స్వామివారికి మొక్కుబడి చెల్లిస్తారు. మల్లన్నను దర్శించుకున్న తర్వాతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఒగ్గుపూజారుల పట్నాలతో..
ఓదెల మల్లన్న సన్నిధిలో భక్తులు (Devotees) స్వామివారి పేరిట పట్నం వేస్తారు. ఒగ్గుపూజారుల చేతిలో ఢమరుకాన్ని మోగిస్తూ శ్రుతిని తలుస్తుండగా స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మండపంలో ఒగ్గు పూజారులు గజ్జెలతో కుట్టిన లాగుల (నిక్కర్లు)తో పూసలు కట్టిన అంగీలు (చొక్కాలు), పూసల కుల్లాయి (టోపీ) సన్నని జాలిచెద్దరు, చేతిలో త్రిశూలం, దానికి చిరుగంటలు, మరోచేతిలో కొరడా (వీరకొల) వంటివి ధరించి భక్తి తన్మయత్వంతో పూనకాలతో ఊగుతూ, గంతులు వేస్తూ.. శివతాండవం చేస్తూ దేవున్ని ప్రత్యేకంగా కొలవడం విశేషం.
పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాక
ఏటా సుమారు రూ.2 కోట్లకుపైగా ఆదాయం సమకూరే ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దేవాలయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
భక్తుడి పేరుతో దర్శనం
చింతకుంట ఓదెలు అనే భక్తుడి పేరు మీద మల్లన్న క్షేత్రం విరాజిల్లు తోంది. శ్రీరాముడు కూడా మల్లన్నను దర్శించుకొని పూజలు చేశాడని ప్రతీతి. శ్రీశైలం, ఓదెల ఆలయం రెండు ఒకే సమయంలో నిర్మించడంతో తెలంగాణ శ్రీశైలం అని ఈ ఆలయానికి పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.
– పంచాక్షరి, ఆలయ అర్చకులు
బుధ, ఆదివారాల్లో రద్దీ
ఉగాది పర్వదినం రోజున ఎడ్లబండ్లతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత జాతర ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పెద్దపట్నాలు, అగ్నిగుండాలు దాటడంతో ఏటా జాతర సాగుతుంది. ఆలయంలో పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటి నిర్మాణాలకు సహకరించిన దాతలకు జాతర సమయంలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తాం.
– బి.సదయ్య, ఈవో(403)
Comments
Please login to add a commentAdd a comment