ఆండాలమ్మ ఆలయ నిర్మాణం
అనివార్య కారణాలతో ప్రతిష్టించని విగ్రహం
ఫొటో షూట్‌కు చిరునామాగా పురాతన ఆలయం
అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా మారే అవకాశం
సాక్షి, పెద్దపల్లి: గుడి ఉంటే దేవుడు ఉండాలి. దర్శనం చేసుకునేందుకు భక్తులు రావాలి. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాలి. కానీ, ఈ గుడిలో దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు రారు. వెడ్డింగ్ ఫొటోషూట్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌లు, పిక్నిక్‌ల కోసం వచ్చే సందర్శకులు, పర్యాటకులతోనే గుడి కళకళలాడుతోంది. ఆ గుడి ఏంటి? విశేషాలు, చరిత్ర తెలుసుకోవాలంటే పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్ ప్రాంతానికి వెళ్లాల్సిందే.
ఆండాలమ్మ గుడి కోసం..
13వ శతాబ్దంలో జైనుల కాలంలో పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్.. రాఘవాపూర్ సంస్థానా«దీశుల ఆదీనంలో ఉండేది. ఆయా సంస్థానాధీశులైన ఎరబాటి లక్ష్మీనరసింహారావు, ఆయన కుమారుడు లక్ష్మీకాంతరావు గుడికి అంకుర్పారణ చేసినట్లు చరిత్రకారులు, గ్రామస్తులు చెబుతున్నారు. తొలుత రంగనాయకస్వామి ఆలయాన్ని నిర్మించారు. దీనికి అనుబంధంగా 500 అడుగుల దూరంలో ఆండాలమ్మ దేవాలయం నిర్మించారు. ఈ రెండింటి మధ్య రోప్ వే నిర్మించి, దీనిద్వారా అమ్మవారిని రంగనాయకస్వామి ఆలయానికి తీసుకొచ్చి.. కల్యాణవేడుక జరిపించాలన్న ఆలోచనతో గుడి నిర్మించారు. దాని నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి హఠాత్తుగా మృతి చెందటంతో.. ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. అనంతరం వారి వారసులు సైతం అమ్మవారి విగ్రహం ఏర్పాటపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో.. విగ్రహం లేకుండానే గుడి మిగిలిపోయింది.
ఎత్తయిన కొండల మధ్య.. అద్భుత శిల్ప కళాసౌందర్యంతో..
దట్టమైన అడవి, చుట్టూ ఎత్తయిన పచ్చని కొండల నడుమ గుడి దర్శనమిస్తోంది. ప్రధాన గోపురంలో అమ్మవారు, గర్భగుడికి ఇరువైపులా దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు, అందమైన మండపం నిర్మించారు. గోపురంపై జీవకళ ఉట్టిపడేలా చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి. మండపానికి కొద్దిదూరంలో ఆలయానికి మరింత శోభను తీసుకొచ్చేలా విశాలమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. అయితే, దేవత విగ్రహం లేకపోవడం, రంగనాయకుల స్వామి గుడి పరిధిలోని 439 ఎకరాల దేవాదాయ భూములు కాలక్రమంలో అన్యాక్రాంతమవడంతో.. ఈ గుడిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఇటీవల పల్లె ప్రకృతివనం కార్యక్రమంలో ఆండాలమ్మ గుడిచుట్టూ ఉన్న మూడెకరాల్లో మొక్కలు నాటి పార్క్ ఏర్పాటు చేశారు. దీంతో పురాతన ఆలయాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రదేశం వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌ల చిరునామాగా మారింది.
అభివృద్ధి చేయాలి
మా తాతల కాలంలో రాఘవపూర్ సంస్థానాదీశులైన ఎరబాటి లక్ష్మీనరసింహారావు ఆండాలమ్మ గుడి నిర్మించాడు. విగ్రహ ప్రతిష్ఠ సమయంలో.. ఎవరో చనిపోవడంతో అలాగే ఉండిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం గుడిని అభివృద్ధి చేస్తే బావుంటుంది.
– అందె పోచమల్లు, గ్రామస్తుడు
అరకొర సౌకర్యాలు
ప్రాచీన సంస్కృతి, శిల్పకళ ఉట్టిపడేలా గుడి నిర్మించారు. అనివార్య కారణాలతో ఆండాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. ప్రస్తుతం అరకొర సౌకర్యాలు ఉన్నాయి. అయినా, వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్‌ల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు, దర్శకులు వస్తున్నారు. ఈ గుడితోపాటు పక్కనే ఉన్న రంగనాయకులస్వామి ఆల యం, సబ్బితం జలపాతం, రామగిరి ఖిలాతో టూరిజం సర్క్యూట్ నిర్మించి, అభివృద్ధి చేస్తే బాగుంటుంది.
– నల్లగొండ కుమార్, స్థానికుడు
Comments
Please login to add a commentAdd a comment