
ప్రతిపాదిత రోప్‌వే జాబితాలో చోటు
మాస్టర్ ప్లాన్‌లో రూ.5 కోట్లు కేటాయింపు
కాళేశ్వరం నుంచి మంథని ఆలయాల అభివృద్ధికి నిధులు
ఇకో పార్కుగా ఎల్‌మడుగు
అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. తెలంగాణలో తొలిసారిగా రోప్‌వే పర్యాటకానికి అవకాశం కల్పించింది. భువనగిరి జిల్లా యాదగిరి గుట్టపై 2 కిలోమీటర్ల రోప్‌వేను తొలిసారిగా ఏర్పాటు చేస్తుండగా.. రాష్ట్రంలో మరో నాలుగు ప్రతిపాదిత రోప్‌వేలలో పెద్దపల్లి జిల్లా రామగిరి కోటకు చోటు కల్పించారు. – మంథని
ప్రాచీన శిల్పకళా సంపదకు చిరునామా.. రామగిరి ఖిలా
జిల్లాలోని రామగిరి ఖిలాను జాతీయస్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇక్కడి ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. రామగిరి ఖిలా (Ramagiri fort) క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో రామగిరి కోటగా రూ పుదిద్దుకుంది. ఈ కోట శత్రుదుర్భేద్యమైన రక్షణ స్థావరంగా వందల ఏళ్లపాటు వివిధ వంశాల రాజులకు ఆశ్రయమిచ్చింది. ఎంతో ఎత్తున్న దుర్గం, అనేక రాతి కట్టడాలు, బురుజులు, ఫీనాలతో విరాజిల్లుతోంది. దుర్గం అంతర్భాగంలో సాలుకోట, సింహాల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వాల, కొలువుశాల, మొఘల్‌శాల, చెరసాల, గజశాల, భజనశాల, సభాస్థలితో పాటు రహస్య స్థలాలు, రహస్య మార్గాలు, సొరంగాలు, తీపులు, ఫిరంగి గుండ్లు ఇక్కడ దర్శనమిస్తాయి.
తెలంగాణలోని దుర్గాల్లో ఈ దుర్గం పటిష్టంగా ఉండి.. వజ్రకూటంగా ప్రసిద్ధి చెందింది. సీతమ్మ కొలను గుంటపై పసుపు, ఎరుపు రంగు నీరు దర్శనమివ్వడం విశేషం. పిల్లల ఫిరంగి నుంచి దూరితే సంతానప్రాప్తి లభిస్తుందని పర్యాటకుల విశ్వాసం. రామగిరి ఖిలాపై సుందర దృశ్యాలు, ప్రాకారాలు.. సందర్శకులను ఆకర్షిస్తాయి. శ్రీరాముని మూల విగ్రహాలున్న స్థలంలో కొండ చరియకింద వెయ్యిమంది తలదాచుకోవచ్చు.

రామగిరి కోటలో ఇరువైపులా 9 ఫిరంగులు, 40 తోపులు ఉన్నాయి. శ్రీరాముడు వనవాసకాలంలో రామగిరికోటపై తపస్సు చేసి గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి కొండపై నుంచి వచ్చే నీటిధార.. బిలం నుంచి లోయలోకి ప్రవహిస్తోంది. ఈ ద్వా రం వద్ద సీతాదేవి స్నానమాచరించినట్లు భక్తుల నమ్మకం. కొండపై సీతారాముల విగ్రహాలతో పాటు నంది విగ్ర హం ఉంది. నీటిధార నేరుగా శివలింగం, నంది విగ్రహాలపై పడటం విశేషం. రామగిరి కొండ పైనుంచి వర్షాకాలం జలపాతాలు కనువిందు చేస్తాయి. రోప్‌వే (Rope Way) ద్వారా పర్యాటకుల్ని గుట్టపైకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే.. రామగిరి ఖిలాకు పర్యాటకుల సందడి పెరగనుంది.

లోయలాంటి సరస్సు ఎల్‌మడుగు
గోదావరి నది మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన అతి పెద్ద లోయలాంటి సరస్సే ఎల్‌మడుగు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్య మంథని మండలం ఖాన్‌సాయిపేట – శివ్వారం అటవీ ప్రాంతంలోని ఎల్‌మడుగు రెండు గుట్టల నడుమ ప్రవహిస్తోంది. ఈ సరస్సు చుట్టూ ఆనుకున్న దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తయిన కొండలు, గుట్టలు.. రెండు కొండల మధ్యనుంచి ప్రవహించే గోదావరి నది.. ఆ సరస్సులో సందడి చేసే పక్షుల కిలకిలారావాలు, నీటిలో ఎగిరే చేపల విన్యాసాలు కనువిందు చేస్తాయి. చిన్న చిన్న చేపపిల్లలు గుంపుగా కదులుతున్న దృశ్యం.. కళ్లెదుటే ఆక్వేరియం ఉన్నట్టు అనిపిస్తుంది. సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండే ఈ సరస్సులో.. ఈ సుందర దృశ్యాలను కచ్చితంగా చూడాల్సిందే అనడం అతిశయోక్తి లేదు.

ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఎల్‌మడుగును ఇకో పార్కుగా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్లు కేటాయించారు. ఇప్పటికే మంథని (Manthani) మండలం ఖానాపూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోదావరి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాళేశ్వరంలో పర్యాటక అభివృద్ధికి రూ.115 కోట్లు, మంథనిలోని గోదావరి నది తీరంలో గౌతమేశ్వర ఘాట్ అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇటీవల మంథనిలో పర్యటించగా, పర్యాటక శాఖ కమిషనర్ న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డి సైతం రామగిరిని సందర్శించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్.. మంత్రి శ్రీధర్‌బాబు సతీమణి కాగా, పర్యాటక శాఖ కమిషనర్ ఈ ప్రాంతానికి సంబంధించిన ఐపీఎస్ అధికారి కావడం.. మంథనికి కలిసివస్తుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.
చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు!
Comments
Please login to add a commentAdd a comment