ramagiri kila
-
వందల ఏళ్ల రక్షణ స్థావరం.. రామగిరి కోట!
అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. తెలంగాణలో తొలిసారిగా రోప్‌వే పర్యాటకానికి అవకాశం కల్పించింది. భువనగిరి జిల్లా యాదగిరి గుట్టపై 2 కిలోమీటర్ల రోప్‌వేను తొలిసారిగా ఏర్పాటు చేస్తుండగా.. రాష్ట్రంలో మరో నాలుగు ప్రతిపాదిత రోప్‌వేలలో పెద్దపల్లి జిల్లా రామగిరి కోటకు చోటు కల్పించారు. – మంథనిప్రాచీన శిల్పకళా సంపదకు చిరునామా.. రామగిరి ఖిలా జిల్లాలోని రామగిరి ఖిలాను జాతీయస్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇక్కడి ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. రామగిరి ఖిలా (Ramagiri fort) క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో రామగిరి కోటగా రూ పుదిద్దుకుంది. ఈ కోట శత్రుదుర్భేద్యమైన రక్షణ స్థావరంగా వందల ఏళ్లపాటు వివిధ వంశాల రాజులకు ఆశ్రయమిచ్చింది. ఎంతో ఎత్తున్న దుర్గం, అనేక రాతి కట్టడాలు, బురుజులు, ఫీనాలతో విరాజిల్లుతోంది. దుర్గం అంతర్భాగంలో సాలుకోట, సింహాల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వాల, కొలువుశాల, మొఘల్శాల, చెరసాల, గజశాల, భజనశాల, సభాస్థలితో పాటు రహస్య స్థలాలు, రహస్య మార్గాలు, సొరంగాలు, తీపులు, ఫిరంగి గుండ్లు ఇక్కడ దర్శనమిస్తాయి.తెలంగాణలోని దుర్గాల్లో ఈ దుర్గం పటిష్టంగా ఉండి.. వజ్రకూటంగా ప్రసిద్ధి చెందింది. సీతమ్మ కొలను గుంటపై పసుపు, ఎరుపు రంగు నీరు దర్శనమివ్వడం విశేషం. పిల్లల ఫిరంగి నుంచి దూరితే సంతానప్రాప్తి లభిస్తుందని పర్యాటకుల విశ్వాసం. రామగిరి ఖిలాపై సుందర దృశ్యాలు, ప్రాకారాలు.. సందర్శకులను ఆకర్షిస్తాయి. శ్రీరాముని మూల విగ్రహాలున్న స్థలంలో కొండ చరియకింద వెయ్యిమంది తలదాచుకోవచ్చు.రామగిరి కోటలో ఇరువైపులా 9 ఫిరంగులు, 40 తోపులు ఉన్నాయి. శ్రీరాముడు వనవాసకాలంలో రామగిరికోటపై తపస్సు చేసి గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి కొండపై నుంచి వచ్చే నీటిధార.. బిలం నుంచి లోయలోకి ప్రవహిస్తోంది. ఈ ద్వా రం వద్ద సీతాదేవి స్నానమాచరించినట్లు భక్తుల నమ్మకం. కొండపై సీతారాముల విగ్రహాలతో పాటు నంది విగ్ర హం ఉంది. నీటిధార నేరుగా శివలింగం, నంది విగ్రహాలపై పడటం విశేషం. రామగిరి కొండ పైనుంచి వర్షాకాలం జలపాతాలు కనువిందు చేస్తాయి. రోప్‌వే (Rope Way) ద్వారా పర్యాటకుల్ని గుట్టపైకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే.. రామగిరి ఖిలాకు పర్యాటకుల సందడి పెరగనుంది.లోయలాంటి సరస్సు ఎల్‌మడుగు గోదావరి నది మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన అతి పెద్ద లోయలాంటి సరస్సే ఎల్‌మడుగు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్య మంథని మండలం ఖాన్సాయిపేట – శివ్వారం అటవీ ప్రాంతంలోని ఎల్‌మడుగు రెండు గుట్టల నడుమ ప్రవహిస్తోంది. ఈ సరస్సు చుట్టూ ఆనుకున్న దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తయిన కొండలు, గుట్టలు.. రెండు కొండల మధ్యనుంచి ప్రవహించే గోదావరి నది.. ఆ సరస్సులో సందడి చేసే పక్షుల కిలకిలారావాలు, నీటిలో ఎగిరే చేపల విన్యాసాలు కనువిందు చేస్తాయి. చిన్న చిన్న చేపపిల్లలు గుంపుగా కదులుతున్న దృశ్యం.. కళ్లెదుటే ఆక్వేరియం ఉన్నట్టు అనిపిస్తుంది. సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండే ఈ సరస్సులో.. ఈ సుందర దృశ్యాలను కచ్చితంగా చూడాల్సిందే అనడం అతిశయోక్తి లేదు.ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఎల్‌మడుగును ఇకో పార్కుగా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్లు కేటాయించారు. ఇప్పటికే మంథని (Manthani) మండలం ఖానాపూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోదావరి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాళేశ్వరంలో పర్యాటక అభివృద్ధికి రూ.115 కోట్లు, మంథనిలోని గోదావరి నది తీరంలో గౌతమేశ్వర ఘాట్ అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇటీవల మంథనిలో పర్యటించగా, పర్యాటక శాఖ కమిషనర్ న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డి సైతం రామగిరిని సందర్శించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్.. మంత్రి శ్రీధర్‌బాబు సతీమణి కాగా, పర్యాటక శాఖ కమిషనర్ ఈ ప్రాంతానికి సంబంధించిన ఐపీఎస్ అధికారి కావడం.. మంథనికి కలిసివస్తుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు! -
బొట్టు బొట్టును ఒడిసిపడుదాం
రామగిరి గుట్టల ప్రాంతంలో చెక్‌డ్యాములు పర్యాటపక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ రామగిరిఖిలా ప్రాంతంలో ఆరుగంటలపాటు పర్యటన సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : చుట్టూ ఎల్తైన గుట్టలు... మధ్యలో లోయలు... అక్కడా నీటి గలగలలు... ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్లుగా ప్రకృతి అందాలు... పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో విస్తరించిన రామగిరిఖిలా సోయగాలివి. సుమారు 25 కిలోమీటర్ల పొడువు, 10 కిలోమీటర్ల వెడల్పు వెరసి దాదాపు 250 చదరపు కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఈ ఖిలా ప్రకృతి రమణీయతకు నెలవైనప్పటికీ పూర్తి నిరాదరణకు గురైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పడే వాన నీటిని ఒడిసి పట్టుకోవడంతోపాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మంగళవారం రామగిరిఖిలాతోపాటు పరిసరాల్లోని శ్రీరామపాదసరోవర్, గుర్రాలగండి, పులిమడుగు ప్రాంతాలను సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రాంతానికి వచ్చిన మంత్రి సాయంత్రం వరకు ఏకబిగిన ఆరు గంటలపాటు పర్యటించారు. ఈ ప్రాంతాలకు వెళ్లడానికి కనీసం సరైన రోడ్లు లేవు. రాళ్లుతేలి, ఇసుక, ముళ్లతో ఉన్న దారులే దిక్కు. మంత్రి కాన్వాయ్సహా ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ మంత్రి తన కాన్వాయ్‌ను మధ్యలోనే ఆపేసి కొంతదూరం పోలీసు జీపులో వెళ్లారు. ఆ తరువాత దాదాపు ఐదారు కిలోమీటర్ల కాలినడకన వెళ్లారు. తొలుత కాల్వశ్రీరాంపూర్ మండలంలోని శ్రీరామపాదసరోవర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి చుట్టూ గుట్టలు, మధ్యలో నీళ్లున్న అంశాన్ని పరిశీలించారు. ఇక్కడున్న చెక్‌డ్యాంకు మరమ్మతు పూర్తి చేయడంతోపాటు రిజర్వాయర్ నిర్మిస్తే కనీసం ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశాలున్నాయని, తద్వారా దాదాపు 20వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించచ్చని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు చేసిన సూచనకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎల్తైన గుట్టలున్న ఈ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అక్కడినుంచి వెన్నంపల్లి గ్రామ సమీపంలోని గుర్రాలగండి ప్రాజెక్టును సందర్శించారు. రామగిరిఖిలా పరిసర ప్రాంతాల గుట్టల నుంచి వచ్చే వరదనీటిని నిల్వ చేస్తే ఈ ప్రాంతంలోని 13 గొలుసు చెరువుల్లోకి నీరు చేరి దాదాపు రెండువేల ఎకరాల భూములకు సాగునీరందించే అవకాశముందని అధికారులు ప్రతిపాదించారు. చివరగా పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి సమీపంలోని పులిమడుగు గుట్టలను సందర్శించారు. పులిమడుగు వద్ద చెక్‌డ్యాం నిర్మిస్తే ఈ ప్రాంతంలోని వందలాది ఎకరాలకు సాగునీరందడంతోపాటు భూగర్భ జలాలు వృద్ధి చెంది వేలాది ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు చెక్‌డ్యాం వద్ద నిల్వ అయ్యే నీటిని ఎస్సారెస్పీ కాలువల్లోకి మళ్లించేందుకు వీలు కలుగుతుందని ప్రతిపాదించారు. అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యేలు భోజనం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఎస్సారెస్పీ కాలువలు ఉన్నప్పటికీ టెయిలెండ్ ప్రాంతమైనందున ఏనాడూ ఇక్కడి ప్రజలు కాలువల్లో నీళ్లు చూడలేదన్నారు. వ్యవసాయానికి బోర్లు, బావులే దిక్కయ్యాయన్నారు. ప్రజల అంతరంగాన్ని గమనించిన తమ ప్రభుత్వం ఆ నీటిని ఒడిసిపట్టేందుకు చెక్‌డ్యాంలను నిర్మిస్తే గొలుసుకట్టు చెరువులకు మళ్లించడంతోపాటు ఎస్సారెస్పీ కాలువలకు కూడా తరలించవచ్చని అన్నారు. అందులో భాగంగా జాఫర్‌ఖాన్‌పేట, గుర్రాంపల్లి, వెన్నంపల్లి ప్రాంతాల్లోని శ్రీరామపాదసరోవర్, గుర్రాలగండి, పులిమడుగు ప్రాంతాలను సందర్శించామన్నారు. చెక్ డ్యాంలు నిర్మించడం వల్ల భూగర్భజ లాలు పెరగడంతోపాటు అటవీ ప్రాంతం పెరుగుతుందన్నారు. రైతుల బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉంటాయన్నారు. దీంతోపాటు గొలుసు కట్టు చెరువుల్లోకి పుష్కలంగా నీళ్లు వస్తాయన్నారు. దసరా తరువాత ఆయా చెక్ డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా : మనోహర్‌రెడ్డి రామగిరిఖిలా సమీప ప్రాంతాలన్నింటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.50 కోట్లు, పర్యాటక కేంద్రంగా తీర్చిదద్దేందుకు మరో రూ.25 కోట్లు వెచ్చిస్తే ఈ ప్రాంతాన్ని పూర్తి సాగునీటి వనరుగా మార్చడంతోపాటు చక్కటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు.