బొట్టు బొట్టును ఒడిసిపడుదాం | save the rain water | Sakshi
Sakshi News home page

బొట్టు బొట్టును ఒడిసిపడుదాం

Published Tue, Jul 19 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

బొట్టు బొట్టును ఒడిసిపడుదాం

బొట్టు బొట్టును ఒడిసిపడుదాం

  • రామగిరి గుట్టల ప్రాంతంలో చెక్‌డ్యాములు 
  • పర్యాటపక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి 
  • ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 
  • రామగిరిఖిలా ప్రాంతంలో ఆరుగంటలపాటు పర్యటన 
  • సర్వే చేసి రిపోర్ట్‌ ఇవ్వాలని అధికారులకు ఆదేశం
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : చుట్టూ ఎల్తైన గుట్టలు... మధ్యలో లోయలు... అక్కడా నీటి గలగలలు... ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్లుగా ప్రకృతి అందాలు... పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో విస్తరించిన రామగిరిఖిలా సోయగాలివి. సుమారు 25 కిలోమీటర్ల పొడువు, 10 కిలోమీటర్ల వెడల్పు వెరసి దాదాపు 250 చదరపు కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఈ ఖిలా ప్రకృతి రమణీయతకు నెలవైనప్పటికీ పూర్తి నిరాదరణకు గురైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పడే వాన నీటిని ఒడిసి పట్టుకోవడంతోపాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మంగళవారం రామగిరిఖిలాతోపాటు పరిసరాల్లోని శ్రీరామపాదసరోవర్, గుర్రాలగండి, పులిమడుగు ప్రాంతాలను సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రాంతానికి వచ్చిన మంత్రి సాయంత్రం వరకు ఏకబిగిన ఆరు గంటలపాటు పర్యటించారు. ఈ ప్రాంతాలకు వెళ్లడానికి కనీసం సరైన రోడ్లు లేవు. రాళ్లుతేలి, ఇసుక, ముళ్లతో ఉన్న దారులే దిక్కు. మంత్రి కాన్వాయ్‌సహా ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ మంత్రి తన కాన్వాయ్‌ను మధ్యలోనే ఆపేసి కొంతదూరం పోలీసు జీపులో వెళ్లారు. ఆ తరువాత దాదాపు ఐదారు కిలోమీటర్ల కాలినడకన వెళ్లారు. తొలుత కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని శ్రీరామపాదసరోవర్‌ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి చుట్టూ గుట్టలు, మధ్యలో నీళ్లున్న అంశాన్ని పరిశీలించారు. ఇక్కడున్న చెక్‌డ్యాంకు మరమ్మతు పూర్తి చేయడంతోపాటు రిజర్వాయర్‌ నిర్మిస్తే కనీసం ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశాలున్నాయని, తద్వారా దాదాపు 20వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించచ్చని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు చేసిన సూచనకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎల్తైన గుట్టలున్న ఈ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అక్కడినుంచి వెన్నంపల్లి గ్రామ సమీపంలోని గుర్రాలగండి ప్రాజెక్టును సందర్శించారు. రామగిరిఖిలా పరిసర ప్రాంతాల గుట్టల నుంచి వచ్చే వరదనీటిని నిల్వ చేస్తే ఈ ప్రాంతంలోని 13 గొలుసు చెరువుల్లోకి నీరు చేరి దాదాపు రెండువేల ఎకరాల భూములకు సాగునీరందించే అవకాశముందని అధికారులు ప్రతిపాదించారు. చివరగా పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి సమీపంలోని పులిమడుగు గుట్టలను సందర్శించారు. పులిమడుగు వద్ద చెక్‌డ్యాం నిర్మిస్తే ఈ ప్రాంతంలోని వందలాది ఎకరాలకు సాగునీరందడంతోపాటు భూగర్భ జలాలు వృద్ధి చెంది వేలాది ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు చెక్‌డ్యాం వద్ద నిల్వ అయ్యే నీటిని ఎస్సారెస్పీ కాలువల్లోకి మళ్లించేందుకు వీలు కలుగుతుందని ప్రతిపాదించారు. అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యేలు భోజనం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఎస్సారెస్పీ కాలువలు ఉన్నప్పటికీ టెయిలెండ్‌ ప్రాంతమైనందున ఏనాడూ ఇక్కడి ప్రజలు కాలువల్లో నీళ్లు చూడలేదన్నారు. వ్యవసాయానికి బోర్లు, బావులే దిక్కయ్యాయన్నారు. ప్రజల అంతరంగాన్ని గమనించిన తమ ప్రభుత్వం ఆ నీటిని ఒడిసిపట్టేందుకు చెక్‌డ్యాంలను నిర్మిస్తే గొలుసుకట్టు చెరువులకు మళ్లించడంతోపాటు ఎస్సారెస్పీ కాలువలకు కూడా తరలించవచ్చని అన్నారు. అందులో భాగంగా జాఫర్‌ఖాన్‌పేట, గుర్రాంపల్లి, వెన్నంపల్లి ప్రాంతాల్లోని శ్రీరామపాదసరోవర్, గుర్రాలగండి, పులిమడుగు ప్రాంతాలను సందర్శించామన్నారు. చెక్‌ డ్యాంలు నిర్మించడం వల్ల భూగర్భజ లాలు పెరగడంతోపాటు అటవీ ప్రాంతం పెరుగుతుందన్నారు. రైతుల బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉంటాయన్నారు. దీంతోపాటు గొలుసు కట్టు చెరువుల్లోకి పుష్కలంగా నీళ్లు వస్తాయన్నారు. దసరా తరువాత ఆయా చెక్‌ డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. 
    పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా : మనోహర్‌రెడ్డి
    రామగిరిఖిలా సమీప ప్రాంతాలన్నింటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.50 కోట్లు, పర్యాటక కేంద్రంగా తీర్చిదద్దేందుకు మరో రూ.25 కోట్లు వెచ్చిస్తే ఈ ప్రాంతాన్ని పూర్తి సాగునీటి వనరుగా మార్చడంతోపాటు చక్కటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు. 
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement