2017లోగా ఇంటింటికీ తాగునీరు
-
మార్చి వరకు మొదటి దశలో పూర్తి
-
నాణ్యతతో పనులు చేయాలి
-
మిషన్‌భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల
హుస్నాబాద్/తిమ్మాపూర్/చిగురుమామిడి : రాష్ట్రంలోని ప్రతీ ఇంటింటికీ 2017లోగా తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్‌భగీరథ పనులు వేగవంతంచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్ మండలంలోని రాములపల్లె, తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీ, చిగురుమామిడి మండలంలోని సుందరగిరి వద్ద జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పైపులైన్ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ప«థకం ద్వారా త్వరలోనే ఇంటింటికీ సురక్షితమైన నీటిని అందించనున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని వివిధ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. జిల్లాలో రూ.6,170కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది మార్చి వరకు మొదటి దశలో పలు గ్రామాలకు, జూన్‌లో రెండో దశ, సెప్టెంబర్‌లో మూడో దశకు, డిసెంబర్ వరకు మిషన్ భగీరథను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. పనులు నాణ్యతగా సాగాలని, నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈ అమరేంద్ర, డీఈఈ త్రినాథ్, బాలరాజ్, జేఈ రంజిత్, హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న ఉన్నారు.