చంద్రబాబు ఎదుట నిరసన తెలుపుతున్న ఉండి టీడీపీ నేతలు
చంద్రబాబుకు కార్యకర్తల హెచ్చరిక
సైకిల్ గుర్తును తగలబెట్టిన రఘురామకు సీటు ఎలా ఇస్తారంటూ నిలదీత
పాలకొల్లులో అధినేతను అడ్డుకునేందుకు విఫలయత్నం..
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్, సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా రెండో రోజు పర్యటనలో చంద్రబాబుకు సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. ఉండి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నట్టు ఇచ్చిన సంకేతాలపై కార్యకర్తలు ఆయనపై తిరగబడ్డారు. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తును తగలబెట్టిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లు.. రామరాజును కాదని రఘురామకృష్ణరాజుకు టికెటిస్తే చిత్తుగా ఓడిస్తామంటూ చంద్రబాబు ఎదుటే తేల్చిచెప్పారు. ఉండి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరును చంద్రబాబు మొదటి జాబితాలోనే ప్రకటించారు.
ఈ మేరకు రామరాజు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఉండి సీటు తనదేనని, రెండు మూడు రోజుల్లో చంద్రబాబు ప్రకటిస్తారని రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో చెబుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ఎమ్మెల్యే రామరాజు వర్గానికి మింగుడు పడలేదు. ఈ తరుణంలో అభ్యర్థి మార్పుపై చంద్రబాబు ఇచ్చిన సంకేతాలు పార్టీ క్యాడర్‌లో అగ్గిరాజేశాయి. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పాలకొల్లు ఎస్ కన్వెన్షన్ హాలులో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కూటమి అభ్యర్థులు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
సమావేశానికి ఉండి ఎమ్మెల్యే రామరాజుతోపాటు రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామరాజుకు ప్రచారం స్పీడు తగ్గించాలని చంద్రబాబు చెప్పినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సమాచారంతో ఉండి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే రామరాజు అనుచరులు పాలకొల్లులోని ఫంక్షన్ హాలు వద్దకు చేరుకుని బయటే బైఠాయించి నిరసనకు దిగారు. రామరాజును మారిస్తే తమ సత్తా చూపిస్తామని, ఉండిలో పార్టీ విజయాలకు బ్రేక్ వేస్తామని హెచ్చరించారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబును అడ్డుకునే యత్నం చేశారు. చంద్రబాబు వారికి సమాధానం చెప్పకుండా సెక్యూరిటీ సిబ్బంది సాయంతో వెళ్లిపోయారు. ఉండి కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నోఏళ్లుగా పార్టీ విజయానికి పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
బ్రోకర్‌కు టికెట్టా!
రాజకీయ బ్రోకర్‌గా, వివాదాస్పదుడిగా ముద్రపడిన రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడడమేమిటని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అసలు ఈ ఉదంతంలో చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ ఆ పార్టీలో తన ఆటలు సాగకపోవడంతో కొద్దినెలలకే రాజకీయ బ్రోకర్‌గా మారి టీడీపీకి, చంద్రబాబుకు ఆప్తుడిగా మారిపోయారు. ఆయనకు అనుకూలంగా పనిచేశారు.
చంద్రబాబు చేసిన కుట్రలన్నీ రఘురామకు తెలుసని, అందుకే ఇప్పుడు ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. రఘురామ కూటమి తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏడాది క్రితమే ప్రకటించారు. బీజేపీలో చేరి నర్సాపురం ఎంపీ సీటు తెచ్చుకోవాలని కలలు కన్నారు. కానీ బీజేపీ అందుకు అంగీకరించలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో తన సంగతి తేల్చాలని చంద్రబాబుపై రఘురామ ఒత్తిడి తెచ్చారు. ఇంతకాలం అన్ని పనులకూ ఆయనను ఉపయోగించుకున్న కారణంగా రఘురామ బాధ్యత చంద్రబాబుపైనే పడింది.
Comments
Please login to add a commentAdd a comment