minister eetal rajender
-
కరీంనగర్‌ను రోగరహిత నగరంగా చేస్తాం
ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్‌హెల్త్ : కరీంనగర్‌ను రోగరహిత నగరంగా మార్చాలని రాష్ట్ర పౌర, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో స్మార్ట్సిటీపై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే స్మార్ట్‌సిటీ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పేదలున్నారని, వీరంతా ఎక్కవగా మురికి వాడల్లో నివసిస్తున్నారన్నారు. కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా రూపొందించడంలో భాగంగా వైద్యులు తగిన సూచనలు, సలహాలందించి సహకరించాలన్నారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ చాలñ ంజ్లో చేరేందుకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న మూడేళ్లలో కరీంనగర్ సమీపంలో ఏయిర్పోర్టు నిర్మాణం చేస్తామన్నారు. ఐదేళ్లలో వెయ్యి కోట్లు ఖర్చుచేయాల్సి ఉందని, అభివృద్ధి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోని అన్ని రహదారులను జాతీయ రహదారులుగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. ఉజ్వల పార్కు లేదా శాతవాహన విశ్వవిద్యాలయం స్థలంలో బృందావన్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కరీంనగర్‌ను విద్య, వైద్యానికి కేంద్రంగా తయారుచేస్తామని, బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కార్పొరేటర్ వై.సునీల్‌రావు, ఐంఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కిషన్, డాక్టర్ ఎల్. రవికాంత్, వైద్యులు భూంరెడ్డి, విజయలక్ష్మి, రఘురామన్ తదితరులు పాల్గొన్నారు. -
2017లోగా ఇంటింటికీ తాగునీరు
మార్చి వరకు మొదటి దశలో పూర్తి నాణ్యతతో పనులు చేయాలి మిషన్‌భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల హుస్నాబాద్/తిమ్మాపూర్/చిగురుమామిడి : రాష్ట్రంలోని ప్రతీ ఇంటింటికీ 2017లోగా తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్‌భగీరథ పనులు వేగవంతంచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్ మండలంలోని రాములపల్లె, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ, చిగురుమామిడి మండలంలోని సుందరగిరి వద్ద జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పైపులైన్ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ప«థకం ద్వారా త్వరలోనే ఇంటింటికీ సురక్షితమైన నీటిని అందించనున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని వివిధ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. జిల్లాలో రూ.6,170కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది మార్చి వరకు మొదటి దశలో పలు గ్రామాలకు, జూన్‌లో రెండో దశ, సెప్టెంబర్‌లో మూడో దశకు, డిసెంబర్ వరకు మిషన్ భగీరథను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. పనులు నాణ్యతగా సాగాలని, నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ అమరేంద్ర, డీఈఈ త్రినాథ్, బాలరాజ్, జేఈ రంజిత్, హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న ఉన్నారు. -
మంత్రి ఇంటి ముట్టడి
40 మందిని అరెస్టు చేసి ఠానాకు తరలింపు కరీంనగర్ హెల్త్ : తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ 34 రోజులుగా సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్ఎంలు శనివారం కరీంనగర్‌లోని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడించారు. స్థానిక కోర్టు చౌరస్తా నుంచి మంత్రి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. అప్పటికే మంత్రి ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎన్‌ఎంలను అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత మరికొంత వచ్చి ఆందోళన చేయడానికి ప్రయత్నించగా వారిని కూడా అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ... తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నెల రోజులు దాటినా కనీసం చర్చలకు కూడా పిలువలేదని విమర్శించారు. పదేళ్లుగా పది వేల వేతనానికి పనిచేస్తున్నామని, పెరుగుతున్న ధరలతో జీవించడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, హమీ ప్రకారం ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. -
నాట్లకు ఇబ్బంది రానివ్వం
ఎస్సారెస్పీ నీటితో ఎల్ఎండీని నింపుతాం అవసరమైతే చెరువులు, కుంటలకు నీళ్లిస్తాం నేటినుంచే నీటిని విడుదల చేస్తున్నాం.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం వైద్యులు, సిబ్బంది సెలవులు రద్దు చేశాం 15 రోజుల్లోగా మరో 2కోట్ల మెుక్కలు నాటుతాం దళితులకు భూమి ఇద్దామంటే అమ్మేవాళ్లు లేరు మంత్రి ఈటల రాజేందర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఖరీఫ్ సీజన్లో నాట్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా రైతాంగానికి భరోసా ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాల్వ, కాకతీయ కాల్వ ద్వారా ఎల్ఎండీ, మధ్యమానేరు రిజర్వాయర్లకు బుధవారం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అవసరాల మేరకు ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలను నింపి పంటలను కాపాడుతామన్నారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో రానున్న 15 రోజుల్లో ప్రభుత్వ లక్ష్యాన్ని మించి 4.5 కోట్ల మొక్కలు నాటనున్నామని చెప్పారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున వైద్యులు, సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో నీళ్లు కలుషితం కాకుండా ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని, పీహెచ్‌సీల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో ముఖ్యాంశాలివీ. సాక్షి : ఎస్సారెస్పీ నిండకుండానే నీటిని విడుదల చేయడానికి కారణమేంటి? ఈటల : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఎస్సారెస్పీ నిండనేలేదు. మొన్నటి వర కైతే జిల్లాలో భయంకరమైన పరిస్థితి ఉండేది. భూగర్భ జలాలు అడుగంటినయ్. బోర్లు, బావులు ఎండిపోయినయ్. పశువులు తాగడానికి నీళ్లు లేకుండే. ఇప్పుడిప్పుడే బాగా వానలు పడుతున్నయ్. రాష్ట్రం వచ్చాక తొలిసారి ఎస్సారెస్పీ నిండుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 44 టీఎంసీల నీరుంది. ఎగువన ఇంకా వానలు పడుతున్నందున 50 టీఎంసీల వరకు నీళ్లు వచ్చే అవకాశముంది. నిబంధనల ప్రకారం 40 టీఎంసీలుంటే తాగునీటికే నీరు వదలాలి. కానీ వానలు పడతాయనే నమ్మకంతో ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నం. బుధవారం ఉదయం 11 గంటలకు నేను, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పోచంపాడులో పూజలు నిర్వహించి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీళ్లను వరద కాలువ, కాకతీయ కాలువల ద్వారా ఎల్ఎండీకి విడుదల చేస్తాం. సాక్షి : ఎల్ంఎడీ నిండాక చెరువులు, కుంటలు నింపుతారా? ఈటల : ప్రస్తుతానికైతే నాట్లకు ఏమాత్రం ఇబ్బంది రానివ్వం. రైతులకు అవసరమైన మేరకు సాగు నీరందిస్తాం. అవసరాన్ని బట్టి చెరువులు, కుంటలు కూడా నింపుతం. ఈసారి ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండుతోంది. ఇప్పటికే 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాబట్టి నాట్లకు ఏమాత్రం ఇబ్బంది రానీయం. సాక్షి : కాకతీయ కెనాల్ ఆధునికీకరణ పనులు పూర్తయినట్లేనా? ఈటల : గతంలో ఎన్నడూ లేనంతగా ఎల్ఎండీ ఎగువన, దిగువన రూ.200 కోట్లు ఖర్చు చేసి కాకతీయ కెనాల్ కెపాసిటీని పెంచినం. వరంగల్ జిల్లాలో కొంత పని మినహా దాదాపు కాలువ ఆధునికీకరణ పనులు పూర్తయినయ్. సాక్షి : సీజనల్ వ్యాధుల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు..? ఈటల : డాక్టర్లకు సెలవులు రద్దు చేసినం. మంచి కండీషన్లో ఉన్న 108 వాహనాలను ఏజెన్సీ, మారుమూల గ్రామాల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించినం. ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాలని చెప్పినం. వానాకాలంలో పాముకాటుకు గురయ్యే అవకాశాలున్నందున ఆసుపత్రుల్లో ఆయా మందులను సిద్ధంగా ఉంచాలని సూచించినం. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున క్లోరినేషన్ తప్పకుండా చేయాలని, అందుకు కేటాయించిన సొమ్మును దానికి మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసినం. అట్లాగే ప్రతి రోజూ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించినం. జిల్లాలో మరణాలుంటే ఎందుకు చనిపోయారో తప్పనిసరిగా కారణాలు వెల్లడించాలి. జిల్లాలో ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ముందుల కోసం తగిన నిధులు విడుదల చేసినం. నిధుల వ్యయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్లకే సర్వధికారాలిచ్చినం. సాక్షి : జిల్లాలో హరితహారం లక్ష్యం నెరవేరలేదు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం పెంచాలని సీఎం చెబుతున్నారు కదా! ఈటల : జిల్లాలో ఇప్పటివరకు రెండున్నర కోట్ల మొక్కలు నాటినం. ఇంకా రెండు కోట్ల మొక్కలు నాటుతం. ఇప్పటికే నర్సరీల్లో 75 లక్షల టేకు, ఇరవై లక్షల పండ్ల, పది లక్షల ఈత, మరో పది లక్షల యూకలిప్టస్ సహా మొత్తం కోటిన్నర మొక్కలు అందుబాటులో ఉన్నయ్. వచ్చే పదిహేను రోజుల్లో ఇంకా రెండు కోట్ల మొక్కలు నాటుతం. ఎమ్మెల్యేలను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేస్తున్నం. కరీంనగర్ జిల్లాలో హరితహారం ముగింపు లేదు. నిరంతరం కొనసాగిస్తాం. ఖాళీ స్థలం కన్పిస్తే మొక్కలు నాటుతం. గుట్టల, వాగుల పక్కన, రోడ్లకు ఇరువైపుల, అడవుల్లో, చెరువు శిఖం భూములుసహా ప్రతిచోట మొక్కలు నాటుతం. మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించాలని ఇప్పటికే తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినం. అధికారులు ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమై ఉన్నరు. సాక్షి : మేనిఫెస్టోలో పేర్కొన్న డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు భూపంపిణీ ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు కదా? ఈటల : అట్లేం లేదు. వాస్తవానికి మొన్నటివరకు తాగడానికి నీళ్లకే ఇబ్బంది ఉండే. ఇప్పుడిప్పుడే మంచిగ వానలు పడుతున్నయ్. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళుతోంది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం గ్రౌండింగ్ అవుతోంది. అట్లాగే దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. ఎక్కడెక్కడ భూములు అందుబాటులో ఉంటే ఆ మేరకు దళితులకు ఇస్తామని చెప్పినం. ఆ మేరకు భూములు కొనుగోలు చేసి దళితులకు ఇస్తున్నం. ఇల్లంతకుంట మండలంలో 500 ఎకరాల భూమి కొనిచ్చినం. గ్రామాల్లో రైతులు భూములను సోషల్ స్టేటస్‌గా భావిస్తున్నందున ఎవరూ అమ్మేందుకు సిద్ధపడటం లేదు. ప్రభుత్వ భూములు లేవు. ఎవరైనా భూములను అమ్మడానికి ముందుకొస్తే వాటిని కొనుగోలు చేసి దళితులకు అందజేస్తున్నం. సాక్షి : ప్రాజెక్టులకు భూసేకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారినట్లుంది? ఈటల : ఎవరు ప్రాజెక్టులు కట్టాలన్నా భూమి మీదే తప్ప ఆకాశంలో కట్టలేరు కదా! ప్రాజెక్టులు కడితే భూములు మునగక తప్పదు. అందుకు కొంతమంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. ప్రాజెక్టులు నిర్మిస్తే లక్షలాది మంది బతుకులు బాగుపడుతయ్. దయచేసి ప్రతిపక్షాలు భూసేకరణపై రాద్ధాంతం చేయకుండా నిర్మాణాత్మక సూచనలిస్తే స్వీకరిస్తం. ప్రజలకు అన్యాయం చేయడం మా ప్రభుత్వ అభిమతం కాదు. రాష్ట్ర ప్రజలకు నీళ్లివ్వడమే మా లక్ష్యం. -
బొట్టు బొట్టును ఒడిసిపడుదాం
రామగిరి గుట్టల ప్రాంతంలో చెక్‌డ్యాములు పర్యాటపక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ రామగిరిఖిలా ప్రాంతంలో ఆరుగంటలపాటు పర్యటన సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : చుట్టూ ఎల్తైన గుట్టలు... మధ్యలో లోయలు... అక్కడా నీటి గలగలలు... ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్లుగా ప్రకృతి అందాలు... పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో విస్తరించిన రామగిరిఖిలా సోయగాలివి. సుమారు 25 కిలోమీటర్ల పొడువు, 10 కిలోమీటర్ల వెడల్పు వెరసి దాదాపు 250 చదరపు కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఈ ఖిలా ప్రకృతి రమణీయతకు నెలవైనప్పటికీ పూర్తి నిరాదరణకు గురైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పడే వాన నీటిని ఒడిసి పట్టుకోవడంతోపాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మంగళవారం రామగిరిఖిలాతోపాటు పరిసరాల్లోని శ్రీరామపాదసరోవర్, గుర్రాలగండి, పులిమడుగు ప్రాంతాలను సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రాంతానికి వచ్చిన మంత్రి సాయంత్రం వరకు ఏకబిగిన ఆరు గంటలపాటు పర్యటించారు. ఈ ప్రాంతాలకు వెళ్లడానికి కనీసం సరైన రోడ్లు లేవు. రాళ్లుతేలి, ఇసుక, ముళ్లతో ఉన్న దారులే దిక్కు. మంత్రి కాన్వాయ్సహా ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ మంత్రి తన కాన్వాయ్‌ను మధ్యలోనే ఆపేసి కొంతదూరం పోలీసు జీపులో వెళ్లారు. ఆ తరువాత దాదాపు ఐదారు కిలోమీటర్ల కాలినడకన వెళ్లారు. తొలుత కాల్వశ్రీరాంపూర్ మండలంలోని శ్రీరామపాదసరోవర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి చుట్టూ గుట్టలు, మధ్యలో నీళ్లున్న అంశాన్ని పరిశీలించారు. ఇక్కడున్న చెక్‌డ్యాంకు మరమ్మతు పూర్తి చేయడంతోపాటు రిజర్వాయర్ నిర్మిస్తే కనీసం ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశాలున్నాయని, తద్వారా దాదాపు 20వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించచ్చని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు చేసిన సూచనకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎల్తైన గుట్టలున్న ఈ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అక్కడినుంచి వెన్నంపల్లి గ్రామ సమీపంలోని గుర్రాలగండి ప్రాజెక్టును సందర్శించారు. రామగిరిఖిలా పరిసర ప్రాంతాల గుట్టల నుంచి వచ్చే వరదనీటిని నిల్వ చేస్తే ఈ ప్రాంతంలోని 13 గొలుసు చెరువుల్లోకి నీరు చేరి దాదాపు రెండువేల ఎకరాల భూములకు సాగునీరందించే అవకాశముందని అధికారులు ప్రతిపాదించారు. చివరగా పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి సమీపంలోని పులిమడుగు గుట్టలను సందర్శించారు. పులిమడుగు వద్ద చెక్‌డ్యాం నిర్మిస్తే ఈ ప్రాంతంలోని వందలాది ఎకరాలకు సాగునీరందడంతోపాటు భూగర్భ జలాలు వృద్ధి చెంది వేలాది ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు చెక్‌డ్యాం వద్ద నిల్వ అయ్యే నీటిని ఎస్సారెస్పీ కాలువల్లోకి మళ్లించేందుకు వీలు కలుగుతుందని ప్రతిపాదించారు. అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యేలు భోజనం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఎస్సారెస్పీ కాలువలు ఉన్నప్పటికీ టెయిలెండ్ ప్రాంతమైనందున ఏనాడూ ఇక్కడి ప్రజలు కాలువల్లో నీళ్లు చూడలేదన్నారు. వ్యవసాయానికి బోర్లు, బావులే దిక్కయ్యాయన్నారు. ప్రజల అంతరంగాన్ని గమనించిన తమ ప్రభుత్వం ఆ నీటిని ఒడిసిపట్టేందుకు చెక్‌డ్యాంలను నిర్మిస్తే గొలుసుకట్టు చెరువులకు మళ్లించడంతోపాటు ఎస్సారెస్పీ కాలువలకు కూడా తరలించవచ్చని అన్నారు. అందులో భాగంగా జాఫర్‌ఖాన్‌పేట, గుర్రాంపల్లి, వెన్నంపల్లి ప్రాంతాల్లోని శ్రీరామపాదసరోవర్, గుర్రాలగండి, పులిమడుగు ప్రాంతాలను సందర్శించామన్నారు. చెక్ డ్యాంలు నిర్మించడం వల్ల భూగర్భజ లాలు పెరగడంతోపాటు అటవీ ప్రాంతం పెరుగుతుందన్నారు. రైతుల బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉంటాయన్నారు. దీంతోపాటు గొలుసు కట్టు చెరువుల్లోకి పుష్కలంగా నీళ్లు వస్తాయన్నారు. దసరా తరువాత ఆయా చెక్ డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా : మనోహర్‌రెడ్డి రామగిరిఖిలా సమీప ప్రాంతాలన్నింటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.50 కోట్లు, పర్యాటక కేంద్రంగా తీర్చిదద్దేందుకు మరో రూ.25 కోట్లు వెచ్చిస్తే ఈ ప్రాంతాన్ని పూర్తి సాగునీటి వనరుగా మార్చడంతోపాటు చక్కటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు.