మంత్రి ఇంటి ముట్టడి
-
40 మందిని అరెస్టు చేసి ఠానాకు తరలింపు
కరీంనగర్ హెల్త్ : తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ 34 రోజులుగా సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలు శనివారం కరీంనగర్‌లోని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడించారు. స్థానిక కోర్టు చౌరస్తా నుంచి మంత్రి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. అప్పటికే మంత్రి ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎన్‌ఎంలను అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత మరికొంత వచ్చి ఆందోళన చేయడానికి ప్రయత్నించగా వారిని కూడా అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు మాట్లాడుతూ... తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నెల రోజులు దాటినా కనీసం చర్చలకు కూడా పిలువలేదని విమర్శించారు. పదేళ్లుగా పది వేల వేతనానికి పనిచేస్తున్నామని, పెరుగుతున్న ధరలతో జీవించడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 10వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, హమీ ప్రకారం ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు.