నజియాభానుది ముమ్మాటికీ హత్యే
- కుటుంబ సభ్యుల ఆరోపణ
- మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ముట్టడికి యత్నం
- అత్తింటివారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
మడకశిర : వివాహిత నజియాభాను (23)ది ఆత్మహత్య కాదని ముమ్మాటికే హత్యేనని పుట్టింటివారు ఆరోపించారు. ఆమె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. మడకశిరకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సిరాజ్ కుమార్తె నజియాభానుకు పట్టణంలోనే ఆరేపేటలో నివాసముంటున్న కలీమ్‌తో రెండేళ్ల కిందట వివాహమైంది. కొంతకాలం సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత నుంచి భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో నజియాభాను ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటన అనంతరం భర్త, అత్త,మామలు పరారయ్యారు. అదనపు కట్నం కోసం అత్తింటి వారే హతమార్చి.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని నజియాభాను కుటుంబ సభ్యులు, వందలాదిమంది బంధువులు సోమవారం పోస్టుమార్టం గది, గేటు వద్ద ఆందోళన చేశారు. అనంతరం మృతదేహంతో పోలీసుస్టేషన్‌ను ముట్టడించేందుకు వెళుతుండగా ఎస్‌ఐ మక్బూల్‌బాషా అడ్డుకున్నారు. దీంతో వారు మాత్రమే స్టేషన్‌వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు.
ఆర్టీసీ డ్రైవర్ సిరాజ్ మాట్లాడుతూ తన కూతురును అదనపు కట్నం కోసం అల్లుడు వేధించేవాడని ఆరోపించారు. వారం క్రితమే ద్విచక్రవానం కొనుగోలుకు రూ.70వేలు ఇచ్చామని, అంతకుముందు రెండు, మూడు దఫాలుగా రూ.80వేల దాకా సర్దుబాటు చేశామని చెప్పారు. కట్నం దాహంతో నిండు ప్రాణాన్ని బలిగొన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు మడకశిరకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.