రహస్యంగా మృతదేహం పూడ్చివేత | - | Sakshi
Sakshi News home page

రహస్యంగా మృతదేహం పూడ్చివేత

Published Mon, Sep 25 2023 1:40 AM | Last Updated on Mon, Sep 25 2023 7:37 AM

- - Sakshi

మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశం

నల్లగొండ క్రైం : దుండగులు అర్ధరాత్రి ఓ మృతదేహానికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన నీలగిరి మున్సిపాలిటీ పరిధి చందనపల్లి శివారు చెత్త డంపింగ్‌ యార్డు సమీపంలో పానగల్‌ ఉదయ సముద్రం రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతంలో జరిగింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా.. గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 11:30 గంటలకు కారులో నలుగురు, మూడు బైక్‌లపై మరో ఆరుగురు వ్యక్తులు చందనపల్లి చెత్తడంపింగ్‌ యార్డు సమీపంలోని పానగల్‌ ఉదయ సముద్రం రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతానికి వచ్చారు.

వాహనాలను అక్కడే నిలిపి తమ వెంట తెచ్చుకున్న పలుగు, పారలతో సుమారు 4 నుంచి 5 ఫీట్ల పొడవులో గొయ్యి తీశారు. ప్యాకెట్లలో తీసుకొచ్చిన ఉప్పు గొయ్యిలో పోశారు. అనంతరం బ్యాగులో కుక్కి కారులో తీసుకొచ్చిన మృతదేహాన్ని బయటికి తీశారు. ఇద్దరు వ్యక్తులు సదరు మృతదేహం కాళ్లు ఒకరు, చేతులు మరొకరు పట్టుకుని గోతిలో పెట్టి పూడ్చిపెట్టారు. ఈ క్రమంలో వెంట వచ్చిన ఒకరు పెద్ద పెట్టున రోదించగా మిగతా వారు అతడిని వారించారు. అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత అందరూ ఆయా వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసింది.

ఆ.. మృతదేహం ఎవరిది?
గుర్తుతెలియని వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసిన మృతదేహం ఎవరిదనేది చందనపల్లి గ్రామంలో చర్చ జరుగుతోంది. గొయ్యి పొడవు 4 నుంచి 5 ఫీట్ల లోపే ఉండడంతో ఆ మృతదేహం 6 నుంచి ఏడేళ్ల లోపు వారిదే ఉంటుందని తెలుస్తోంది. మృతదేహం ఆడ, మగ అనేది స్పష్టత లేదని అర్ధరాత్రి చాటుగా గమనించిన వారు పేర్కొంటున్నారు.

ఏదైనా అనారోగ్యంతో మృతిచెందితే నిర్భయంగా అంత్యక్రియలు చేస్తారు. మహిళలు ఎవరు లేకుండా, అర్ధరాత్రి బ్యాగులో మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేయడంతో ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పూడ్చిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం అష్టమి కావడంతో నరబలి ఇచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తీసుకొచ్చి పూడ్చిపెట్టారనే అనుమానాలు లేకపోలేదు. అర్ధరాత్రి అంతిమ సంస్కారాల తంతును గమనించిన కొందరు చందనపల్లి గ్రామస్తులకు విషయం తెలపడంతో చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement