బిగుస్తున్న బడుగు పిడికిళ్లు | tomorrow collectrate Obsession | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న బడుగు పిడికిళ్లు

Published Sun, Jul 2 2017 12:33 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

బిగుస్తున్న బడుగు పిడికిళ్లు - Sakshi

బిగుస్తున్న బడుగు పిడికిళ్లు

-శ్రామికుల బతుకులతో బాబు సర్కారు చెలగాటం
-వివిధ పథకాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్ట విధానాలు
-నిరసనగా పోరుపథంలో కదం తొక్కుతున్న కార్మికులు
-రేపు కలెక్టరేట్‌ ముట్టడి
మానవ మనుగడకు, పురోగతికి మూలం శ్రమ. సమాజ పరిణామ క్రమంలో మనుషుల మధ్య అంతరాలకు ప్రధాన కారణం సంపద కొంత మంది వద్దే పోగుబడుతుండడంతో అత్యధికులు పేద, మధ్య తరగతులుగా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి వర్గాలకు ఎంతోకొంత ఊతంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు అమలు చేస్తున్నవే సంక్షేమ పథకాలు. ఆ కోవలోవే అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం, ఆశా వర్కర్ల వ్యవస్థ. అయితే..ఆ కనీస శ్రేయస్సుకు శ్రమించే వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి, ఆ వ్యవస్థల్లో పని చేసే శ్రామికుల జీవితాలను చీకటిలోకి నెట్టజూస్తోంది చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం. అలాగే ఎంవీ యాక్ట్‌లో సవరణల పేరుతో లక్షలాదిమంది ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులను వేధింపులకు గురిచేసే దిశగా అడుగులు వేస్తోంది. నిధుల మళ్లింపుతో భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సుకు భంగం కలిగిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల జీవితాలనూ ఊబిలోకి నెడుతోంది. సర్కారు కర్కశ వైఖరికి నిరసనగా బడుగుజనం పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏకమవుతున్న శ్రామిక శక్తి ఈ నెల మూడున చలో కలెక్టరేట్‌ పేరుతో ముట్టడికి పూనుకుంటోంది. ఈ నేపథ్యంలో వారి సమస్యలు, వేదనలు, డిమాండ్లపై ప్రత్యేక కథనం..
-కపిలేశ్వరపురం (మండపేట)
వేలాదిమంది స్కీం వర్కర్లు..
జిల్లాలో ఆశ వర్కర్లు 4,000 మంది, సెకండ్‌ ఏఎన్‌ఎంలు 700 మంది, టీబీ కంట్రోల్‌ ప్రోగ్రాం సిబ్బంది 150 మంది,  24 గంటల పీహెచ్‌సీల్లో స్టాఫ్‌ నర్సులు, కంటింజెంట్‌ వర్కర్లు 140 మంది, హెచ్‌ఐవీ రోగులకు సేవలందించే ఏపీ సాక్స్‌లో కౌన్సిలర్లు, స్టాఫ్‌నర్సులుగా 100 మంది, అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణ నిమిత్తం కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరంలలోని ఎస్‌ఎన్‌ కేర్‌ యూనిట్స్, ఎన్‌ఆర్‌సీలలో స్టాఫ్‌ నర్సులు, సెక్యూరిటీ గార్డులుగా 100 మంది, ఆయుర్వేదం, యునానీ, హోమియో వైద్య సేవలందించే ఆయుష్‌ విభాగంలో 100 మంది,  ఆర్‌బీఎస్‌కే పథకం వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఫిజియో థెరపిస్టులుగా 200 మంది,  హెల్త్‌ మిషన్‌ కార్యాలయాల్లో ఉద్యోగులుగా పది మంది, నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌లో 150 మంది, వైద్యాధికారులుగా 200 మంది, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులుగా 8,000 మంది, 5,200 అంగన్‌వాడీ కేంద్రాలున్న ఐసీడీఎస్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలుగా 10,500 మంది, మినీ వర్కర్లుగా 200 మంది సేవలందిస్తున్నారు. 
ప్రీ స్కూల్స్‌ పేరుతో అంగన్‌వాడీ కేంద్రాల మూసివేత దిశగా..
చంద్రబాబు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఎత్తివేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. జిల్లాలోని కేంద్రాల్లో సుమారు 10,500 మంది కార్యకర్తలు, ఆయాలుగా పనిచేస్తున్నారు. తెలంగాణలో కార్యకర్తకు రూ.10 వేలు, ఆయాకు రూ.8 వేలు ఇస్తుండగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కార్యకర్తకు రూ.7 వేలు, ఆయాకు రూ.4 వేలు వేతనంగా ఇస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు, ఐదు నెలలుగా కేంద్రాల అద్దె బిల్లు, ఏడాదిగా పుల్లల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలను ఎత్తేసి ప్రీ స్కూల్స్‌గా మార్చి కార్యకర్తలు, ఆయాలను క్రమ క్రమంగా తొలగించాలనే కుట్ర జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కేంద్రాలను మూసేశారు.
రూ.4 వందలతో నెట్టుకొస్తున్న ఆశ వర్కర్లు
జిల్లాలో సుమారు నాలుగు వేల మంది వరకూ ఉన్న ఆశ వర్కర్లను గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య, వైద్య సదుపాయాలను దగ్గర చేసేందుకు ఉనికిలోకి తీసుకొచ్చారు. తీరా వీరికి ప్రభుత్వం ఏ విధమైన వేతనాన్నీ ఇవ్వడంలేదు. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడల్లా కొంత సొమ్ము ముట్ట చెబుతుండటంతో నెలంతా కష్టపడినా వీరికి రూ.నాలుగు వందల నుంచి రూ. వెయ్యి వరకూ కూడా రాని దుస్థితి. తెలంగాణలో వీరికి రూ.ఆరువేల వేతనాన్ని చెల్లిస్తున్నారు. 
మధ్యాహ్న భోజన నిర్వాహకుల మెడపై వేలాడుతున్న కత్తి
ప్రభుత్వం ఇచ్చేది అరకొరే అయినా అప్పు చేసో, అరువు తెచ్చో బడి పిల్లలకు అన్నంపెడుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల మెడపై ఏజెన్సీ ఎత్తివేత కత్తి వేలాడుతోంది. పాఠశాలల్లో వంట చేసి వడ్డించే పద్ధతికి బదులు 25,000 మంది పిల్లలకు ఒక కేంద్రంగా డివిజన్‌ స్థాయిలో వంటశాల ఏర్పాటు చేసి అక్కడే అన్నం వండి పాఠశాలలకు తీసుకెళ్లి వడ్డించే పద్ధతికి చంద్రబాబు తెరతీశారు. అలా చేస్తే జిల్లాలో ఏజెన్సీలను నిర్వహిస్తున్న సుమారు ఎనిమిది వేల మంది ఉపాధిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీరికి తమిళనాడులో రూ.ఐదు వేల వేతనాన్ని ఇస్తుండగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రూ.750, రాష్ట్ర ప్రభుత్వం రూ.250 వెరసి రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారు.
నిధుల మళ్ళింపుతో సంక్షేమం కుదింపు
భవన నిర్మాణానికి మట్టి తీసే కూలి నుంచి పూర్తయ్యాకా రంగు వేసే కార్మికుని వరకూ 33 రకాల పనులు చేసేవారు భవన నిర్మాణ కార్మికుల జాబితాలోకి వస్తారు. జిల్లాలో ఈ పనివారు సుమారు ఐదు లక్షల మంది ఉన్నారు. 318/2011 నంబరుగల  కేసులో 2013 నవంబరులో సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు ప్రకారం  కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని తీర్పు చెప్పినా చంద్రబాబు తన  పేరుమీద పథకాలను ప్రవేశపెట్టి, వాటి నిర్వహణ కోసం ఈ నిధులను మళ్ళిస్తున్నారు. దీంతో భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాల్సిన క్లెయిమ్స్‌ పరిష్కారంలో తీవ్ర జాప్యమవుతోంది.
మలినం ఎత్తిపోసే వారిపైనా కొరవడ్డ కనికరం..
జిల్లాలో 1100 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. వాటి పరిధిలో వేలాది మంది కార్మికులు క్షేత్ర స్థాయిలో విశేష సేలందిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది కాంట్రాక్టు, టెండరు, ఎన్‌ఎంఆర్‌ పద్ధతుల్లో పారిశుద్ధ్య, ట్యాంక్‌వాచర్, బిల్‌ కలెక్టరు, ఎలక్ట్రీషియన్‌లుగా పనిచేస్తున్నారు. వీరు రూ.వెయ్యి నుంచి రూ.ఏడు వేల లోపే జీతంగా అందుకుంటున్నారు. 2016 ఆగస్టులో జారీ చేసిన జీవో :151 ప్రకారం స్వీపర్లకు రూ.12 వేలు, ఇతర కార్మికులకు రూ.17 వేల వరకూ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా నెలలు తరబడి »బకాయిలు పెడుతున్నారు. 
ఆదాయం ప్రభుత్వానికి.. శిక్షలు డ్రైవర్లకి..
కేంద్ర ప్రభుత్వం మోటారు వెహికల్‌ చట్టంలో తీసుకొచ్చిన సవరణలు డ్రైవర్ల పాలిట సమ్మెటలుగా మారాయి. ట్రాన్స్‌పోర్టు రంగం ద్వారా సమకూరే రూ. కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లనే బాధ్యుల్ని చేస్తూ శిక్షలను తీవ్రతరం చేయడం ఈ సవరణల్లో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లాలోని వేలాది మంది డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారు. 
శ్రామికుల డిమాండ్లు ఇవే.. 
-వివిధ పథకాల నిర్వహణకు నిధులు కేటాయించి ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలి.
-ప్రభుత్వ పథకాల్లో  కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, క్యాజువల్, డైలీ వేజ్, వర్క్‌చార్జ్,డ్‌ పార్ట్‌ టైం పద్ధతుల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పీఎఫ్, ఈఎస్‌ఐ, పింఛను సౌకర్యాలన్నీ కల్పించాలి.  
-పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలి.
-మోటారు వెహికల్‌ చట్టంలోని ప్రమాదకర సవరణలను ఉపసంహరించుకోవాలి.
-చంద్రన్న బీమా పథకానికి మళ్ళించిన రూ.241 కోట్లను భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు తిరిగి చెల్లించాలి. 
-భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరించాలి.
-అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల ఎత్తివేత ఆలోచనను మానుకోవాలి.
-పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన సదుపాయాలు కల్పించి, శ్రమకు తగిన వేతనం చెల్లించాలి.
చాకిరీ ఎక్కువ, జీతం తక్కువ..
వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి జీవనోపాధిని దెబ్బతీసే విధంగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. అందుకే చలో కలెక్టరేట్‌ ఉద్యమం పేరిట కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నాం. 
 -జి.బేబిరాణి, శ్రామిక మహిళ సంఘం రాష్ట్ర నాయకురాలు, కాకినాడ
చంద్రన్న పథకానికి మా నిధులు..
చంద్రబాబు తన సొంత పేరుతో రూపొందించిన చంద్రన్న బీమా పథకానికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు చెందిన నిధులను మళ్ళిస్తున్నారు. ఈన్ని ఆందోళనల ద్వారా ప్రజల్లోకెళ్ళి ప్రభుత్వ విధానాలను ఎండగడతాం.
-చెక్కల రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement