కొమురయ్య.. దీవెనలివ్వాలయ్యా.. | Gopu Komurayya fair begins from 9th march | Sakshi
Sakshi News home page

కొమురయ్య.. దీవెనలివ్వాలయ్యా..

Published Fri, Mar 7 2025 5:17 AM | Last Updated on Fri, Mar 7 2025 6:57 PM

Gopu Komurayya fair begins from 9th march

గోపు వంశీయుల ప్రత్యక్ష దైవం కొమురయ్య

భవిష్యవాణి చెప్పేవారని భక్తుల విశ్వాసం

9 నుంచి గోపు కొమురయ్య జాతర ప్రారంభం

10న తొలిసారిగా ఎడ్లబండ్ల పోటీలు

రామగుండం: ఆరు దశాబ్దాల క్రితం నాటి మాట ఇది.. గోపు వంశీయుడొకరు భవిష్యవాణి చెప్పేవారు. తన మరణాన్ని కూడా ముందుగానే ప్రకటించి కన్ను మూశారు. ఆ రోజు నుంచి ఆయనను దైవంగా గో పు వంశీయులు కొలుస్తూ జాతరను నిర్వహిస్తు న్నారు. గోపు వంశీయులు భక్తి ప్రపత్తులతో కొలిచే ఆ దైవం పేరు గోపు కొమురయ్య. 

65 ఏళ్లుగా జాతర
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్‌ గ్రామానికి చెందిన గోపు కొమురయ్య మరణానంతరం.. ఆయన పేరిట 65 ఏళ్లుగా (మల్లికార్జున కల్యాణం) గోపు వంశీయులు జాతరను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

భవిష్యవాణితోనే బహుళ ప్రాచుర్యం
ఆరు దశాబ్దాల క్రితం గోపు కొమురయ్య బతికుండగానే భవిష్యవాణి చెప్పారని ఆయన భక్తులు విశ్వసిస్తారు. సమాజంలో జరిగే శుభాలు, దుష్పరిణామాలు ముందుగా గ్రహించేవారని.. పూనకం వచ్చిన సమయంలో.. తన వద్దకు వచ్చే వారికి భవిష్యవాణిని వినిపించేవారంటారు. తన మరణ తేదీని ముందుగా ప్రకటించారని.. తన పేరుతో జాతర నిర్వహించాలని ప్రకటించిన సమయానికే శివైక్యం పొందారని భక్తుల కథనం. దీంతో కొమురయ్య సమాధిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. 

యాదవ కులబాంధవులు ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటున్నారు. కొమురయ్య సమాధికి గది నిర్మించి ఆలయంగా పూజిస్తున్నారు. దశాబ్దాల తరబడి.. రోజూ ఉదయం క్రమం తప్పకుండా సమాధి వద్ద గోపు వంశీయులు దీపారాధన చేస్తున్నారు. సమాధి వద్ద గోపు వంశీయులు శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం పేరిట జాతర నిర్వహిస్తుండడం ఆనవాయితీ. 

పొరుగు జిల్లాల నుంచి సైతం అధిక సంఖ్యలో యాదవ కులస్తులు రావడం జాతర ప్రత్యేకత. ఈ క్రమంలో ప్రతీ హోలీ పండుగకు ముందు ఫాల్గుణ మాసం ఆది, సోమవారాల్లో జాతర నిర్వహిస్తుంటారు.

జాతరకు సకల ఏర్పాట్లు
అంతర్గాం మండలం ముర్మూర్‌ శివారులోని ఆయ న సమాధి (ఆలయం) వద్ద ఈనెల 9 నుంచి కార్య నిర్వాహక ప్రతినిధి గోపు అయిలయ్య యాదవ్‌ నేతృత్వంలో జాతర నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే తొలిరోజు దృష్టి కుంభం, మైల లు తీయడం, రుద్రాభిషేకం, బియ్యం, సుంకు పెద్ద పట్నంతో పాటు ఉదయం 11.45 గంటలకు శ్రీమల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. 

10వ తేదీ వేకువజామున 4 గంటలకు అగ్నిగుండ ప్రవేశం అనంతరం ఇప్పలపల్లి భరత్‌ స్వామి జంగమ మహేశ్వరులచే కొమురన్న జీవిత చరిత్రపై ఒగ్గు కథ ప్రదర్శించనున్నారు. ఈసారి తొలిసారిగా ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించనుండగా, ముగ్గురికి భారీగా ప్రోత్సాహక బహుమ తులు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొ న్నారు. రెండు రోజుల పాటు జాతరకు వచ్చే భక్తుల కు అన్నదానం చేస్తారు.

కొమురయ్య ఉన్నట్టే భావిస్తాం
గోపు కొమురయ్య జ్ఞాపకార్థం నిర్వహించే జాతరకు ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. 65 ఏళ్లుగా మా వంశీయులు నిష్టతో దీపారాధన చేస్తున్నారు. ఆయన మా మధ్య లేకపోయినా.. జీవించి ఉన్నట్లుగానే భావిస్తున్నాం. 
– గోపు అయిలయ్యయాదవ్, జాతర కార్యనిర్వాహక ప్రతినిధి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement