
ఓవైపు అగ్రనేతల వృద్ధాప్యం.. మరోవైపు అత్యాధునిక సాంకేతికతతో భద్రతా బలగాల వేట
ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టుల్లో అంతర్మథనం....
ఇటీవల పెరిగిన లొంగుబాట్లు
ములుగు ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య పద్మ
సాక్షి, హైదరాబాద్: భద్రతా బలగాల భారీ వేట.. వృద్ధాప్యానికి చేరిన మావోయిస్టు (Maoist) అగ్ర నాయకులు.. తరుముకొస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్... వెరసి అన్నల్లో అంతర్మథనం మొదలైందనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు గత మూడేళ్లుగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీసు బలగాల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాట పట్టారు. గత నెలన్నరరోజుల్లో తెలంగాణ (Telangana) పోలీసుల ఎదుట కొందరు కీలక నాయకులు లొంగిపోయిన విషయం తెలిసిందే.
ఇటీవల మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈమె దివంగత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య. పద్మ 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు కొందరు ఆకర్షితులవుతున్నారు.
మరోవైపు మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేషా లొంగిపోయిందని...ఆమె లొంగుబాటు సందర్భంగా అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేషాతోపాటు ఇటీవల కొందరు మావోయిస్టుల లొంగుబాట్ల వెనుకున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పలు కీలక స్థానాల్లో పనిచేసిన మావోయిస్టు సీనియర్ నాయకులు వరుస లొంగుబాట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
తెలంగాణలో గతేడాది 41 మంది సరెండర్
2024లో తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ, ఒకరు స్టేట్ కమిటీ సభ్యుడు, 16 మంది ఏరియా కమిటీ సభ్యులు, మిగిలినవారు పలు కేడర్లకు చెందినవారు. 85 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.
నాయకుల వయో‘భారం’
మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో దాదాపు అంతా ఐదు పదుల వయసు దాటినవారే ఉన్నారు. మావోయిస్టులను ముందుండి నడిపించాల్సిన అగ్రనాయకత్వం వయోభారంతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ స్థానికులకంటే ఇతర రాష్ట్రాలవారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనూ కీలక నేతలు కూడా వయసులో పెద్దవారే. వీరంతా ప్రస్తుతం సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఇలా ప్రతి అంశంలోనూ మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కిందిస్థాయి నాయకత్వానికి భరోసా ఇచ్చి నడిపించేవారు లేకుండాపోయారు.
మరికొన్ని ప్రధాన లొంగుబాట్లు ఇలా...
ఈ ఏడాది ఫిబ్రవరి 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
ఈ ఏడాది జనవరి 18న చర్ల పోలీస్‌స్టేషన్‌లో కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
ఈ ఏడాది జనవరి 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ఖేర్ ఎదుట ఒక మావోయిస్టు లొంగిపోయాడు.
ఈ ఏడాది జనవరి 2న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సీదం అలియాస్ తారక్క గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ 2024 డిసెంబర్ 25న ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు.
అక్టోబర్ 2, 2024లో పెదబయలు ఏరియా కమిటీకి చెందిన 17 మంది మావోయిస్టులు పాడేరు జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్ ఎదుట లొంగిపోయారు.
డిసెంబర్ 10 2023న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాల్లో 20 మంది మావోయిస్టులు స్థానిక ఎస్పీ ఎదుట లొంగిపోయారు.
జనవరి 1, 2022న సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 44 మంది లొంగిపోయారు.
జనవరి 28, 2022న విశాఖపట్నం పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment