సాయంత్రాల్లేని గ్రామం.. ‘క’ సినిమాతో మరోసారి వార్తల్లోకి.. | A village without evenings | Sakshi
Sakshi News home page

సాయంత్రాల్లేని గ్రామం.. ‘క’ సినిమాతో మరోసారి వార్తల్లోకి..

Published Tue, Nov 5 2024 5:09 AM | Last Updated on Tue, Nov 5 2024 12:39 PM

A village without evenings

మూడు జాముల కొదురుపా..క

మధ్యాహ్నం 3 గంటలకే చీకటి

ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది.. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతోంది’.. అని హీరో ప్రశ్నిస్తాడు.. ‘మా ఊరు చుట్టూతా ఎత్తయిన కొండలున్నాయి.. కొండల మధ్య మా ఊరు ఉంది.. మధ్యాహ్నం మూడు అయ్యేసరికి సూర్యుడు కొండల వెనక్కి వెళ్లిపోయి ఆ నీడ మా ఊరి మీద పడి.. మూడింటికల్లా చీకటి పడిపోతుంది అబ్బాయి..‘ఒక పెద్దాయన సమాధానమిస్తాడు. 

ఈ సంభాషణ ‘క’సినిమాలోనిదని మీకీ పాటికే అర్థమై ఉంటుంది. దీంతో అలాంటి ఊరు ఎక్కడుందంటూ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ ఊరే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కొదురపాక గ్రామం. రీల్స్, వీడియోలతో ఇప్పుడా ఊరు నెట్టింట సందడి చేస్తోంది.  
– సాక్షి, పెద్దపల్లి

నాలుగు గుట్టల మధ్య.. 
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గ్రామం నాలుగు గుట్టల మధ్య.. హుస్సేనిమియా వాగు చెంత.. పచ్చని ప్రకృతి నిలయంగా ఉంటుంది. ఈ గ్రామానికి తూర్పున గొల్లగుట్ట, పడమరన రంగనాయకులు గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలున్నాయి. ఇక్కడి వైవిధ్య భౌగోళిక పరిస్థితులను గమనించిన శాతవాహనులు ఈ ఊరు వెలుపల నంబులాద్రీశ్వరస్వామి, రాజరాజేశ్వరస్వామి ఆలయాలు నిర్మించారు. గ్రామ ప్రత్యేకతను శిలాఫలకంపై చెక్కించారు.


 
ఆలస్యంగా ఉదయం..  తొందరగా సాయంత్రం.. 
సాధారణంగా 3 గంటలకు ఒక్కజాము చొప్పున రోజులో మొత్తం 8 జాములుంటాయి. పగటిపూట నాలుగు, రాత్రిపూట నాలుగు జాములుగా లెక్కిస్తారు. తూర్పున ఉన్న గొల్లగుట్ట ఈ గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. 

ఇక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సూర్యుడు గ్రామ పడమర దిక్కునున్న రంగనాయకులు గుట్ట వెనక్కి వెళ్తాడు. దీంతో కొండల నీడతో ఈ గ్రామాన్ని చీకటి తొందరగానే అలుముకుంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం రాత్రితో కలిసిపోతుండటంతో పగటి సమయం తగ్గిపోతోంది. దీంతో ఈ గ్రామాన్ని మూడు జాముల కొదురుపాకగా పిలుస్తున్నారు. ఆ ఊరికి సాయంత్రం జాము లేకపోవడంతో.. సాయంత్రం 4 గంటలకే ఇళ్లలో దీపాలు, వీధి దీపాలు వెలిగించాల్సి వస్తోంది. 

దేవుడు లేని ఆలయం 
ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. రంగనాయకులు గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు. దీంతో ప్రతీ దసరాకు పక్కనే ఉన్న దేవునిపల్లి గ్రామం నుంచి నంబులాద్రి నరసింహస్వామిని రథయాత్రతో తీసుకొచ్చి.. ఈ ఆలయంలో ఒకరోజు ఉత్సవాలు జరుపుతారు. ఆ తర్వాత తిరిగి దేవునిపల్లికి తీసుకెళ్తారు. దీంతో ఏడాదిలో ఆ ఒక్కరోజే ఆ గుడిలో వేడుకలు నిర్వహిస్తారు.

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి  
మా గ్రామాన్ని చూడటానికి ఎంతోమంది ఎక్కడినుంచో వచ్చి పోతున్నారు. వచ్చిపోయే వారికి గ్రామంలో సౌకర్యాలు కల్పించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  
– బాలాజీరావు, స్థానికుడు  

నలుదిక్కులా గుట్టలు 
మా ఊరుకు నలుదిక్కులా గుట్టలు ఉండటంతో ఉదయం ఆలస్యంగా సూర్యుడు వస్తాడు. తొందరగానే సూర్యుడు అస్తమిస్తాడు. దీంతో సాయంత్రం 4 గంటలు దాటిందంటే ప్రతీ ఇంట దీపం వెలిగించుకోవలసిందే.   
– రాజగౌడ్, స్థానికుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement