దోమ: ఒక్క క్షణం కళ్లు మూసుకుంటే అంతా అంధకారమే.. రాత్రి వేళ కరెంట్ పోతే చాలు వెంటనే దీపం కోసమో.. టార్‌చలైట్ కోసమో వెతికేస్తాం.. మరి చూపే లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే కదూ.. పుట్టుకతో అంధత్వం గల వారితో పాటు పలు కారణాలతో మధ్యలో చూపు కోల్పోయిన వారిని సమాజంలో ఎంతో మందిని చూస్తుంటాం.
అలాంటి వారిని ఆదుకొని కంటి చూపు ప్రసాదించడానికి ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. అయినా ఇంకా ఎందరో అందమైన ప్రపంచాన్ని చూసే భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించి ఆ దిశగా వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన వారోత్సవాలను నిర్వహిస్తోంది.
సరైన సమయంలో చికిత్స అందకే..
అధికారుల వివరాల ప్రకారం జిల్లాలోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది అంధత్వంతో బాధపడుతున్నారు. పాక్షిక అంధత్వంతో బాధపడుతున్న వారు 15 నుంచి 16 శాతం వరకు ఉన్నారు. పాక్షిక అంధత్వంతో బాధ పడుతున్న వారిలో ఎక్కువ శాతం సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం మూలంగానే దృష్టిలోపానికి గురవుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో...
జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఉచిత కంటి వై ద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వారి కి హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత ఏడాది 20 వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించగా ఈ ఏడాది ఇప్పటి వరకు 22 వేల మందికి నిర్వహించారు.
నేత్రదానం మహాదానం...
జిల్లాలో కార్నియా అంధత్వంతో బాధపడేవారే ఎక్కువగా ఉన్నారు. ఏటా 100 నుంచి 120 మంది వరకు ఈ తరహా అంధత్వానికి గురవుతున్నారు. చనిపోయిన వారి నుంచి సేకరించిన కళ్లను ఇలాంటి వారికి అమర్చడం ద్వారా చూపును ప్రసాదించే వీలుంది. వారికి అమర్చడానికి కార్నియాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నేత్రదానం చేసే వారి సంఖ్య పెరిగితే ఈ సమస్యను అధిగమించే వీలుంటుంది.
నేత్ర దానానికి వీరు అర్హులు...
ప్రమాదవ శాత్తు గుండె జబ్బులు, ఇతర ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మరణించిన వారు, సహజ మరణం పొందిన వారు నేత్ర దానానికి అర్హులు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయొచ్చు. మధుమేహం, రక్త పోటు వ్యాధిగ్రస్తులు కూడా మరణానంతరం నేత్రదానం చేయొచ్చు.
నేత్రదానం చేయాలనుకునే వారు...
నేత్ర దానం చేయాలని సంకల్పించే వారు ముందుగా తమ కుటుంబ సభ్యుల సమ్మతితో సంబంధిత ప్రతిజ్ఞా పత్రాన్ని నింపి సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో గానీ, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఐ బ్యాంకుల్లో గానీ అందజేయవచ్చు. చనిపోయిన 6 గంటల లోపు వారి కుటుంబ సభ్యులు, బంధువుల అనుమతితో కళ్లను సేకరిస్తారు. జిల్లాలో గత ఏడాది 70 మంది నేత్రదానానికి ముందుకు రాగా ఈ ఏడాది 80 మంది ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మీ ముందు‘చూపే’.. మరొకరికి కంటి వెలుగు
Published Mon, Aug 25 2014 12:47 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM
Advertisement
Advertisement