
సందర్భం
ఢిల్లీ హైకోర్టు ‘న్యాయమూర్తి’ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగగా, ఆ మంటలను చల్లార్చడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో తగలబడిపోయిన నోట్ల కట్టల బస్తాలు కనిపించాయి. ఆ సమయానికి న్యాయ మూర్తి, ఆయన భార్య ఇంట్లో లేరు. వారి కూతురు, న్యాయమూర్తి తల్లి మాత్రమే ఉన్నారు. విషయం ఢిల్లీ పోలీసులకు చేరింది. ఢిల్లీ పోలీసు కమిషనర్ ఆ వీడియోలను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు. కొన్ని రోజులు ఆలస్యంగానైనా ఆ ఉదంతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాకా చేరి, మరొక రకం అగ్నిమాపక చర్యలు ప్రారంభమయ్యాయి. కొలీజియం (Collegium) సూచనపై వివాదాస్పద న్యాయమూర్తిని వెంటనే అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఈ బదిలీని తాము వ్యతిరేకిస్తున్నామని, అవినీతిపరులకు ఆశ్రయం కలిగించడానికి మా హైకోర్టు చెత్తబుట్ట కాదని తీవ్రమైన పదజాలంతో స్పందించింది. కొలీజియం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరవధిక సమ్మె ప్రారంభించింది.
ఈలోగా సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మతో (Justice Yashwant Varma) ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, ఆ ఉత్తరాలు, వీడి యోలు, ఫొటోలు అన్నీ తన వెబ్ సైట్ మీద బహిరంగంగా పెట్టింది. ఆ డబ్బు 15 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వదంతులున్నాయి. కార్పొరేట్ కంపెనీల ఆదాయపు పన్ను, జీఎస్టీ వగైరా కేసులను విచారించే కీలకమైన బాధ్యతలలో ఉన్నారు గనుక అది ఆ కంపెనీల నుంచి అందిన అవినీతి సొమ్ము కావచ్చుననే అనుమానాలున్నాయి. కొన్ని వేల రూపాయలో, లక్షల రూపాయలో లెక్క చూపని ధనం ఉన్నందుకే ముప్పు తిప్పలు పెట్టే ఐటీ, ఈడీ, సీబీఐ (CBI) వంటి సంస్థలున్న చోట ఇంత పెద్ద మొత్తం డబ్బు గురించి కఠినమైన శిక్షలకు దారి తీసే విచారణ జరగవలసే ఉంటుంది.
తొలగింపు ‘సాధ్యమే’నా?
భారత రాజ్యాంగం అధికరణాలు 124, 218, న్యాయమూర్తుల విచారణ చట్టం, 1968 ప్రకారం ఒక న్యాయమూర్తి మీద విచారణ జరపడం, తొల గించడం అసాధ్యం కాదు గాని కష్టసాధ్యం. ఆరో పణలు (చట్టం ‘దుష్ప్రవర్తన, అసమర్థత’లను మాత్రమే గుర్తించింది, అవినీతి అనే మాటే లేదు!) ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని తొలగించాలని 100 మంది లోక్‌సభ సభ్యులు గాని, 50 మంది రాజ్యసభ సభ్యులు గాని పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానాన్ని అనుమతిస్తే ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ ఆ ఆరోపణలు నిజమని తేల్చితే తొలగింపు తీర్మానం ముందుకు కదులుతుంది. సభలోని మొత్తం సభ్యులలో సగం కన్న ఎక్కువ మంది, లేదా హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆమోదిస్తేనే ఆ తీర్మానం నెగ్గి, రాష్ట్రపతి దగ్గరికి వెళుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ మూర్తులను తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది.
ఈ ప్రక్రియ అంతా చూస్తే, సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలు న్యాయమూర్తులకు వర్తించవని తేలుతుంది. భారత పౌరులమైన మనందరమూ రాజ్యాంగం ఎదుట సమానులమే గాని, న్యాయమూర్తులు మాత్రం ఎక్కువ సమానం! ఒకే రకమైన నేరం చేసినా కులాన్ని బట్టి శిక్ష లేక పోవడమో, తీవ్రమైన శిక్ష ఉండటమో నిర్దేశించిన మనుస్మృతి (Manusmriti) లాగానే, భారత న్యాయమూర్తులకు కూడా మినహాయింపులు ఉన్నాయి!
భావజాలాల మీద చర్చ వద్దా?
ఈ దొరికిపోయిన అవినీతి వ్యవహారం మీదనైనా కాస్త చర్చ మొదలయింది గాని, న్యాయమూర్తులలో ఉన్న తప్పుడు భావజాలాల మీద, అందువల్ల వెలువడుతున్న తీర్పుల మీద చర్చ కూడా లేదు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఒక మతతత్త్వ సంస్థ సభకు హాజరై ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేష ఉపన్యాసం చేశారు. న్యాయవ్యవస్థలోని ఉన్నతాధికార పీఠం అయిన కొలీజియం సంజాయిషీ అడిగితే, తన ఉపన్యాసానికి కట్టుబడి ఉన్నానని నొక్కి చెప్పారు.
మరొక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా తన ముందుకు ఒక మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసు వస్తే, దుండగులు ఆ బాలిక రొమ్ములను పిసికారని, ఆ బాలిక పైజామా బొందు తెంచివేశారని ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలు చూపినప్పటికీ, దాన్ని అత్యాచారయత్న నేరంగా చూడలేమని ప్రకటించారు. ఆ అన్యాయమైన తీర్పు మీద సమీక్ష జరపాలని దాఖలైన పిటి షన్‌ను వినడానికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీ సోమవారం నాడు నిరాకరించారు. ఆ అనుచిత ప్రవర్తనను, సుప్రీంకోర్టే మంగళవారం నాడు సవరించుకుంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమీక్షించాలని సుమోటో నిర్ణయం తీసుకుని, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ ఎ.జి.మసీహ్ ధర్మాసనానికి అప్పగించింది.
చదవండి: న్యాయమూర్తులకు భిన్న న్యాయమా?
శాసన నిర్మాణ వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనే మూడు అంగాలలో న్యాయవ్యవస్థ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర అధికారంతో మిగిలిన రెండు అంగాల పనితీరును కూడా సమీక్షించే ఉన్నతాధికారం కలిగి ఉంటుందని రాజనీతిశాస్త్రం పాఠాలు చెపుతుంది. రాజ్యాంగాన్ని, చట్టాలను వివరించే, వ్యాఖ్యానించే, సవరించే విస్తృతాధికారం ఉన్న న్యాయ వ్యవస్థకు సమాజం మొత్తం మీద, ప్రత్యే కించి శాసన నిర్మాణ, అధికార వ్యవస్థల మీద అదుపు ఉండటం సదుద్దేశంతోనే కావచ్చు. కాని కంచే చేను మేసినట్టు, ఆ న్యాయ వ్యవస్థే అన్యాయ, అవినీతి వ్యవస్థగా మారిపోతే, దాన్ని అదుపులో పెట్టేదెవరు? సమీక్షకులను సమీక్షించే వారెవరు? రాజ్యాంగమూ, చట్టమూ ఇచ్చిన ప్రత్యేక రక్షణలు, సబ్ జుడిస్ (న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా ఆ వ్యాజ్యం మీద మాట్లాడగూడదు), కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ (న్యాయస్థానం పట్ల ధిక్కార భావన) వంటి అవరోధాలతో, న్యాయస్థానాల మీద నోరెత్తడానికి ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?
న్యాయస్థానాలను మించినది సమాజం. న్యాయవ్యవస్థ తప్పులను నిలదీయ వలసిందీ, న్యాయ వ్యవస్థను కూడా సాధారణ పౌరుల లాగే ప్రజాక్షేత్రంలో చర్చకూ విచారణకూ గురిచేసి, జవాబుదారీ తనాన్ని స్థాపించవలసిందీ సమాజమే!
- ఎన్. వేణుగోపాల్
సీనియర్ జర్నలిస్ట్