కామెంట్లు చేయడం వాళ్లకో ఫ్యాషన్‌ అయ్యింది: సుప్రీం కోర్టు | Collegium Of Judges Most Transparent Says Supreme Court | Sakshi
Sakshi News home page

కొలీజియంను నిర్వీర్యం కానివ్వొద్దు.. కామెంట్లు చేయడం వాళ్లకో ఫ్యాషన్‌గా మారింది: సుప్రీం

Published Fri, Dec 2 2022 5:14 PM | Last Updated on Fri, Dec 2 2022 5:56 PM

Collegium Of Judges Most Transparent Says Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: జడ్జీల నియామకాల విషయంలో తాము ఎంతో పారదర్శకంగా ఉన్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించుకుంది. న్యాయమూర్తుల నియామక వ్యవస్థ పట్టాలు తప్పకూడదు. అందుకోసం ఉన్న న్యాయమూర్తుల కొలీజియం అత్యంత పారదర్శకంగా పని చేస్తోంది. దానిని అలా పని చేయనివ్వండి అంటూ శుక్రవారం ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పని చేస్తున్న వ్యవస్థను(కొలీజియంను ఉద్దేశించి) నిర్వీర్యం చేయవద్దు. దాని పనిని దాన్ని చేయనివ్వండి. మాది అత్యంత పారదర్శకమైన సంస్థ. కొలీజియం మాజీ సభ్యులకు.. నిర్ణయాలపై కామెంట్లు చేయడం ఓ ఫ్యాషన్‌గా మారింది అంటూ జస్టిస్‌ షా, జస్టిస్‌ రవికుమార్‌ నేతృత్వంలోని బెంచ్‌ వ్యాఖ్యానించింది. 

సుప్రీంకోర్టు కొలీజియం వివాదాస్పద-2018 సమావేశం వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరుతూ.. ప్రముఖ కార్యకర్త అంజలి భరద్వాజ్‌ దాఖలు చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. సమావేశం అజెండా, తీర్మానం తదితర వివరాల కోసం ఆమె జులైలో కోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ వేయగా.. కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. 

శుక్రవారం వాదనల సందర్భంగా..  పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ ‘కొలీజియం నిర్ణయాలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయా?  తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా?’ అని బెంచ్‌ను కోరారు. ‘‘ఆర్టీఐ ప్రాథమిక హక్కు అని కోర్టు స్వయంగా చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వెనక్కి తగ్గింది. ప్రధాన న్యాయమూర్తి- ప్రభుత్వం మధ్య జరిగే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది’’ అని ప్రశాంత్‌ భూషణ్‌ గుర్తు చేశారు. 

దీంతో కలుగుజేసుకున్న జస్టిస్‌ షా.. ఆ కొలీజియం సమావేశంలో ఎలాంటి తీర్మానం ఆమోదించలేదు. మాజీ సభ్యులు చేసిన దేనిపైనా మేము వ్యాఖ్యానించదలచుకోలేదు. కొలీజియం మాజీ సభ్యులు.. ఇక్కడి నిర్ణయాలపై వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది. మేం చాలా పాదదర్శకంగా పని చేస్తున్నాం. ఎందులోనూ మేము వెనక్కి తగ్గడం లేదు. పలు మౌఖిక నిర్ణయాలు తీసుకున్నాం అంటూ.. ఈ పిటిషన్‌పై ఆదేశాలను రిజర్వ్‌ చేసింది. 

సుప్రీంకోర్టు కొలీజియం 2018, డిసెంబర్‌ 12వ తేదీ నిర్వహించిన సమావేశం వివరాలను ఆర్టీఐ ద్వారా కోరుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అంజలి భరద్వాజ్‌. అంతకు ముందు సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌(CIC) ద్వారా ఆమె చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌ కొట్టేయడంతో.. ఆమె సుప్రీంను ఆశ్రయించారు. 

సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయ్‌ ఆటోబయోగ్రఫీ ‘జస్టిస్‌ ఫర్‌ ది జడ్జి’లో.. డిసెంబర్‌ 2018 సమావేశం గురించి ఆసక్తికర ప్రస్తావన ఉంది. ఆ సమావేశంలో ఆనాడు రాజస్థాన్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న  జస్టిస్‌ ప్రదీప్‌ నంద్రజోగ్‌, ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న జస్టిస్‌ రాజేంద్ర మీనన్‌లను.. సుప్రీం కోర్టు జడ్జిలుగా  ప్రతిపాదించాలని నిర్ణయించింది కొలీజియం. అయితే.. వాళ్ల నియామకాలకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కడంతో.. జనవరి 10వ తేదీ 2109లో కొత్త కొలీజియం వాళ్లిద్దరి పేర్లను ఆమోదించలేదు.  ఈ విషయాన్నే ప్రముఖంగా తన పిటిషన్‌లో ప్రస్తావించారు అంజలి భరద్వాజ్‌.

ఇదీ చదవండి: మీరే రూల్స్‌ ధిక్కరిస్తారా?..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement